Medical-murderers-and-the-hospital-mysteries

నర్సులు కాదు యమదూతలు.. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రిలో..

పెన్సిల్వేనియా: సమాజంలో గుడి, బడి తర్వాత అంత పవిత్రమైన ప్రదేశం ఆస్పత్రి. మనిషి చావు పుట్టుకలతో ఇక్కడ ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందుకే మనుషులంతా కులం, మతం, వర్గం, ప్రాంతం బేధాలు లేకుండా గుడ్డిగా వీటిని, వీటిలోని వైద్యులను నమ్మేస్తారు. మనిషి మేధస్సుకు, మృత్యువుకు యుద్ధం జరిగే ఈ రణరంగంలో ఓడిపోయి తిరిగిరాని లోకాలకు ఎవరైనా వెళితే.. వారికి భూమిపై నూకలు చెల్లిపోయాయని సర్దుకుంటాం. గుండెలవిసేలా రోదిస్తామేగానీ, వైద్యం చేసిన డాక్టరును అనుమానించం. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ  ఆస్పత్రులనే మన పాలిట మృత్యుకూపాలుగా మారుస్తున్నారు కొందరు. తెల్లని యూనిఫామ్స్ వేసుకొని మన ప్రాణాలు కాపాడే దేవతలే కాదు, ప్రాణాలు తీసే యమదూతలు కూడా ఇక్కడే తిరుగుతుంటారని గుర్తుచేస్తున్నారు. వైద్యరంగంలో సామాన్యులకు ఉండే అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమలోని రాక్షసుడిని తృప్తి పరుచుకుంటున్నారు. నమ్మబుద్ధి కావడంలేదు కదూ. ఇది చదివితే అసలు విషయం మీకు అర్థమవుతుంది.

చార్లెస్ కలెన్ అనే వ్యక్తి అమెరికాలోని న్యూజెర్సీ, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో సుమారు 9ఆస్పత్రుల్లో నర్సుగా పనిచేశాడు. అలాగే డొనాల్డ్ హార్వే అనే వ్యక్తి సిన్సినాటి, కెంటక్కీ ప్రాంతాల్లో మూడు ఆస్పత్రుల్లో నర్సుగా చేశాడు. వీరిద్దరిలోనూ ఓ ముఖ్యమైన పోలిక ఉంది. అదేంటంటే వీరిద్దరూ పేషెంట్లకు ప్రిస్క్రయిబ్ చేయని మందులిచ్చి చంపేసేవారు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని వారే స్వయంగా ఒప్పుకున్నారు. ఇలాంటి హత్యలు జరుగుతున్నట్లు 1957లో తొలిసారి వెలుగులోకి వచ్చిందని విన్సెంట్ మార్క్స్ అనే పాథాలజిస్ట్(వ్యాధులు, వాటిని కలిగించే జీవుల గురించి పరిశోధించే శాస్త్రవేత్త) వెల్లడించారు. కెన్నెత్ బార్లో అనే నర్సు తన భార్యకు అధిక మొత్తాల్లో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేయడానికి ప్రయత్నించాడు. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉండటంతో ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. కానీ పోస్టుమార్టంలో ఆమె శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలాంటి హత్యల్లో ఎక్కువగా ఇన్సులిన్‌ను ఉపయోగించేవారని ఆయన చెప్పారు. ‘దీన్ని శరీరంలో గుర్తించడం అంత ఈజీకాదు. ఒకవేళ గుర్తించినా అది శరీరమే ఉత్పత్తి చేసిందో లేక బయట నుంచి ఎక్కించారో తెలుసుకోవడం కష్టం. ఇదే ఇటువంటి హంతకులకు ఆయుధంగా మారుతోంది’ అని విన్సెంట్ వివరించారు.

ఇక చార్లెస్ విషయానికొస్తే.. 9 ఆస్పత్రుల్లో ఉద్యోగం చేసిన అతను సుమారు 40మందిని చంపేశాడు. ఇంత జరుగుతున్నా అతన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. అప్పటివరకు బాగానే ఉండే పేషెంట్లు సడన్‌గా షుగర్ లెవెల్స్ పడిపోయి, ఊపిరి కూడా తీసుకోలేకపోవడం, ఆ కారణంగా మరణించడం ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి వచ్చింది. ఇలా జరగడానికి వారి శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరగడమే కారణమని తెలుసుకున్న వారికి.. అక్కడ నర్సుగా ఉన్న చార్లెస్‌పై అనుమానం వచ్చింది. దీంతో అతనిపై నిఘాపెట్టారు. కానీ ఎటువంటి ప్రయోజనమూ లేకపోయింది. అతను చాకచక్యంగా తప్పించుకు తిరిగాడు. ఆ సమయంలో కూడా ఆస్పత్రిలో పేషెంట్లు మరణిస్తూనే ఉన్నారు. దీంతో ఏమీ చేయలేని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు చార్లెస్‌ను జాగ్రత్తగా గమనించారు. ఆస్పత్రి యాజమాన్యం తనను అనుమానిస్తోందని గుర్తించిన చార్లెస్.. ఆ ఉద్యోగం మానేసి వేరే ఆస్పత్రిలో చేరడానికి అప్పటికే పథకం వేసుకున్నాడు. అదే సమయంలో అతనికి బాగా పరిచయం ఉన్న మరో నర్సు సాయం తీసుకున్న అధికారులు.. ఆమెకు మైక్ అమర్చి చార్లెస్‌తో మాట్లాడించారు. ఆ మాటల మధ్యలో చార్లెస్ అసలు గుట్టువిప్పాడు. తాను చాలా మందిని చంపేశానని,  దానికోసం ఇన్సులిన్, సైనేడ్ వంటివి వాడేవాడినని చెప్పేశాడు. ఆ రికార్డింగ్ ఆధారంగా చార్లెస్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తుకు సహకరిస్తే మరణశిక్ష తప్పుతుందని చెప్పడంతో వారికి సహకరించడానికి చార్లెస్ అంగీకరించాడు. 

ఇదేవిధంగా డొనాల్డ్ హార్వే కూడా తను పనిచేసిన మూడు ఆస్పత్రుల్లో చాలామందిని హతమార్చాడు. అయితే అతని పాపం పండి ఓసారి  అమెరికాలోని ఒహాయోలో పనిచేస్తుండగా.. యాక్సిడెంట్లో గాయపడి ఆస్పత్రిలో చేరిన జాన్ పావెల్‌ అనే వ్యక్తికి సైనేడ్ ఇచ్చి చంపేశాడు. అక్కడి చట్టాల ప్రకారం, యాక్సిడెంట్ కేసుల్లో ఎవరైనా మరణిస్తే తప్పకుండా పోస్టుమార్టం చేయాలి. ఈ చట్టమే డొనాల్డ్‌ను పట్టించింది. ఎందుకంటే యాక్సిడెంట్లో పెద్దగా దెబ్బలు తగలని జాన్.. సడన్‌గా చనిపోవడం, పోస్టుమార్టంలో సైనేడ్ లభించడం పోలీసులకు అనుమానం కలిగించింది. దీంతో డొనాల్డ్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అయితే 2017లో ఒహాయో స్టేట్ ప్రిజన్‌లో ఉండగా తోటి ఖైదీ చేసిన దాడిలో అతను మరణించాడు.

1980 నుంచి 2000 వరకూ ఇటువంటి మరణాలు ప్రముఖ ఆస్పత్రుల్లో చాలాజరిగాయి. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసుల్లో నిందితులను ఎవరూ పట్టుకోలేకపోయారు. ఈ నిందితులు కూడా చాలా ధైర్యంగా హత్యలు చేసేవారు. ఎందుకంటే వారికి కావాల్సిన ఆయుధాలన్నీ వారు పనిచేసే ప్రాంతంలోనే ఉంటాయి. దానికి తోడు వాటిని తీసుకునే అధికారం వారికుంటుంది. దాంతో ఎవరిని అనుమానించాలో, ఎవరిని నిందించాలో అధికారులకే అర్థం అయ్యేదికాదు. దీనికో పెద్ద ఉదాహరణేంటంటే.. దొరికిపోవడానికి ముందు ఓ హత్య కేసులో చార్లెస్‌ను అనుమానించిన పోలీసులు.. అతన్ని ప్రశ్నించారు. ఆ సమయంలో అధికారులను చూసి బెదరకుండా, ‘మీరేం రుజువు చేయలేరు’ అంటూ ధీమాగా మాట్లాడాడు చార్లెస్. అతన్ని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు చార్లెస్ గ్రేబర్ ‘ద గుడ్ నర్స్’ పేరిట ఓ పుస్తకాన్ని రాశాడు. దాని ప్రకారం చార్లెస్ తన వృత్తి జీవితంలో కనీసం 400మందిని పొట్టనబెట్టుకున్నాడు. అంతేకాదు ఇలాంటి నర్సులు ఇంకా చాలామంది ఉన్నారని, కానీ వారిని దోషులుగా నిరూపించే ఆధారాలు లేకపోవడంతో తామేమీ చేయలేకపోతున్నామని పోలీసులు అంటున్నారు. ఇటువంటి విషయాల్లో ఆస్పత్రుల యాజమాన్యాలకు అనుమానం వస్తే.. కొంతకాలం అనుమానితులను పరిశీలించేవారని, కానీ ఆ సమయంలో నిందితులు చాలా జాగ్రత్తగా ప్రవర్తించేవారని ‘ద గుడ్ నర్స్’ పుస్తకంలో గ్రేబర్ పేర్కొన్నారు. తమపై నిఘా పెరిగిందని భావించిన వెంటనే నిందితులు వేరే ఆస్పత్రులకు వెళ్లిపోయేవారని చెప్పారు.

ప్రముఖ ఆస్పత్రుల్లో జరిగిన ఈ హత్యలు చాలామంది వెన్నులో వణుకు పుట్టించాయి. ఈ క్రమంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఇద్దరు అధికారుల మృతదేహాలను తవ్వితీసి పరీక్షలు జరిపారు. ఇవి కూడా హత్యలేనని తేలింది. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారని చార్లెస్‌ను ప్రశ్నించగా.. పేషెంట్‌ల బాధ చూడలేక జాలితో చంపేసేవాడినని అతను చెప్పినట్లు గ్రేబర్ తన పుస్తకంలో రాశారు. చాలామంది ‘హంతక నర్సులు’ ఇదే సమాధానం ఇచ్చారు. అయితే అవన్నీ అబద్ధాలని ఈ కేసులను పరిశీలించిన క్రిమినల్ సైకాలజిస్టులు అంటున్నారు. ఈ నర్సులు కావాలనే హత్యలు చేసేవారని, వీరికి అదో సరదా అని తేల్చారు. ‘కాబట్టి ఆస్పత్రికి మంచి పేరుందనో, డాక్టరు మంచివాడనో గుడ్డిగా నమ్మొద్దు. ఎందుకంటే వారి పక్కనే నవ్వుతూ పలకరిస్తూ ప్రాణాలు తీసే ఇటువంటి యమదూతలు కూడా ఉంటారు తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరిస్తున్నారు.