Mans-car-gets-stolen-while-he-robs-store-across-the-street

షాపును దోచుకున్న దొంగ.. అతని ట్రక్కు ఎత్తుకెళ్లిన మరో దొంగ..

వాషింగ్టన్: విలియం కెల్లీ అనే వ్యక్తి అమెరికాలోని వాషింగ్టన్‌లో ఓ స్టోర్‌కి వెళ్లాడు. అక్కడున్న క్యాషియర్‌ను బెదిరించి, డబ్బు తదితర వస్తువులు దోచుకున్నాడు. రోడ్డు అవతల తన పికప్ ట్రక్కును పార్కు చేశాడు. పారిపోవడానికి అనువుగా ఉండేందుకు దానికి తాళం వేయలేదు. అదే అతని కొంపముంచింది. ఎందుకంటే అతను షాపులో దొంగతనం చేసి వచ్చేప్పటికి, మరో దొంగ కెల్లీ ట్రక్కు దొంగిలించాడు. దాంతో ఏం చేయాలో తోచని కెల్లీ.. పోలీసులకు ఫోన్ చేశాడు. తన ట్రక్కును ఎవరో దొంగిలించారని కేసు పెట్టాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు, కెల్లీ చేసిన నేరం కూడా తెలిసిపోయింది. దీంతో కెల్లీని అదుపులోకి తీసుకున్నారు. అతని ట్రక్కు కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కెన్నెవిక్ పోలీస్ శాఖ ఫేస్‌బుక్‌లో పంచుకుంది. దాంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరలయింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘కనీసం దొంగల మధ్య కూడా సమన్వయం లేదు. ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం’ అంటూ ఒకరు జోకేస్తే.  ‘ఇంత త్వరగా కర్మ సిద్ధాంతం నిజం కావడం తొలిసారి చూస్తున్నా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.