Man-use-fake-identity

మేనల్లుడి రీసెర్చ్ నకిలీ మామను పట్టించింది

పెళ్లి గుట్టు రట్టు చేసిన మేనల్లుడు

ఇద్దరు పెళ్లాలనూ మోసం చేశాడు.

ఫ్లోరిడా: ‘బిచ్చగాడు’ సినిమా హీరో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘నకిలీ’ సినిమా చూసే ఉంటారు. అందులో చనిపోయిన వ్యక్తి పేరుతో హీరో సమాజంలో బతుకుతుంటాడు. పేరు నుంచి ధృవీకరణ పత్రాల వరకూ చనిపోయిన వ్యక్తివే వాడుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన వారు.. హీరో చేతిలో హతమవుతూ ఉంటారు. సినిమాలో హీరో క్యారెక్టర్‌నే పోలిన విధంగా ఓ వ్యక్తి ఇద్దరిగా బతికాడు.. రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చివరకు కటకటాల పాలయ్యాడు. రిచార్డ్ హోగ్లాండ్ అనే వ్యక్తి... తన భార్య లిండా, మాథ్యూ(9), డోగ్లాస్(6) పిల్లలతో కలిసి అమెరికాలోని  ఇండియానాపోలిస్‌లో నివసిస్తున్నాడు. 1993వ సంవత్సరం ఫిబ్రవరిలో రిచార్డ్ కనిపించకుండా పోయాడు. ఎక్కడకు వెళ్లాడో, ఏమయిపోయాడో తెలియక కుటుంబమంతా తెగ ఆందోళన చెందింది. కనిపించకుండా పోయిన రిచార్డ్ మరణించే ఉంటాడని పేర్కొంటూ.. 2003లో పోలీసులు ధృవీకరించారు. అదే యేడాది లిండా మరో పెళ్లి చేసుకుంది. అందరూ అనుకున్నట్లు అతడు చనిపోతే కథ అంతటితో ముగిసిపోయేది. కానీ అతడు చనిపోలేదు. 
 
భార్య, పిల్లలను కావాలనే వదిలేసి ప్రస్తుతం ఉంటున్న ప్రాంతానికి దాదాపు 1600 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన అతడు.. ఫ్లోరిడాలో 1991లో ప్రమాదవశాత్తూ చనిపోయిన టెర్రీ సైమన్‌స్కై అనే వ్యక్తి ఐడెంటిటీని వాడుకున్నాడు. తన పేరే టెర్రీ అని చెప్పి ఫ్లోరిడాలో స్థిరపడ్డాడు. జిఫైర్‌హిల్స్ నగరంలో మేరీ హిక్‌మన్ అనే మహిళను 1995లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ బాబు కూడా పుట్టాడు.  టెర్రీ పేరుతోనే బతుకుతూ, అతడి పేరుతోనే ఉన్న ధృవీకరణ పత్రాలను వాడుకుంటూ పైలెట్ లైసెన్స్‌ను కూడా తీసుకున్నాడు. అంతా సజావుగానే ఉందనుకున్న సమయంలో టెర్రీకి మేనల్లుడి వరసైన ఓ యువకుడు తన చదువులో భాగంగా ఓ రీసెర్చి ప్రారంభించాడు. తన కుటుంబానికి చెందిన వారి వివరాలను సేకరించి ‘వంశవృక్షం’ తయారు చేయాలనుకున్నాడు. ఈ పరిశోధనలో భాగంగా టెర్రీకి 1995లో పెళ్లయినట్లు ఫ్లోరిడా చర్చిలో రికార్డు అయినట్లు గమనించాడు. 
 
తన మామయ్య చనిపోయిన విషయం అతడికి కూడా తెలుసు.. అనుమానం వచ్చిన అతడు.. చర్చిలో ఇచ్చిన అడ్రస్‌కు వెళ్లాడు. తీరా చూస్తే.. తన మామయ్య పేరుతోనే వేరే వ్యక్తి జీవిస్తున్నట్లు తెలుసుకున్నాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి 2016 అక్టోబర్ 28న టెర్రీ సైమన్‌స్కై అనబడే.. రిచార్డ్ హోగ్లాండ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి అరెస్టుకు కారణాన్ని పోలీసులు భార్యకు చెప్పగా మొదట విస్తుపోయింది. ఇల్లంతా వెతకగా.. అతడి పర్సనల్ బీరువాలో ఓ సూట్‌కేస్ కనిపించింది. దాన్ని భార్య మేరీ పోలీసులకు అందజేసింది. అందులో అసలు ధృవీకరణ పత్రాలు ఉండటం గమనార్హం.  1993లో కనిపించకుండా పోయిన వ్యక్తి 23 ఏళ్ల తర్వాత 2016లో వెలుగులోకి వచ్చాడు. ప్రస్తుతం అతడి వయస్సు 63 ఏళ్లు. ఇతడి మోసాన్ని మొదటి భార్య లిండాకు తెలిపారు. వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో ఇంతకాలం బాగానే చెలామణీ అయ్యాడు. ఎందుకు ఇలా చేశాడన్నది మాత్రం పోలీసులకు అంతుచిక్కని ప్రశ్నలా మారిపోయింది. తానేమీ నేరం చేయలేదని, ఆ కుటుంబంతో ఉండలేకపోయానని చెబుతున్నాడు రిచార్డ్. మరి కేసు చివరకు ఏమవుతుందో కోర్టులో తేలాల్సి ఉంది.