Man-Survives-188-Foot-Plunge-Over-Niagara-Falls-and-Found-Sitting-On-Rock-Below

నయగారా ఫాల్స్‌ చూస్తూ నదిలో పడిపోయాడు.. ఆచూకీ కోసం వెతకగా..

న్యూయార్క్: నయగారా ఫాల్స్‌ ఎత్తును ఫొటోలో చూస్తేనే భయమేస్తూ ఉంటుంది. మరి ఆ ఫాల్స్‌ను ప్రత్యక్షంగా చూస్తున్న ఓ వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోతే?  వినడానికే భయమేస్తోంది కదూ. అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. నయగారా ఫాల్స్ మొత్తం మూడు రకాలుగా ఉంటుంది. హార్స్ షూ ఫాల్స్, అమెరికన్ ఫాల్స్, బ్రైడల్ వీల్ ఫాల్స్. ఈ మూడింటిలో హార్స్ షూ ఫాల్స్ అంచుల్లో నిలబడిన ఓ వ్యక్తి అనుకోకుండా అక్కడి నుంచి జారి కింద నదిలో పడిపోయాడు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడున్న వారు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో.. వారు వ్యక్తి ఆచూకీ కోసం నది కింద వైపుకు వెళ్లారు. నదిలో పడిపోయిన వ్యక్తి కింద ఓ గట్టు మీద చిన్న చిన్న గాయాలతో కూర్చొవడాన్ని రెస్క్యూ టీం గమనించి అతడిని కాపాడింది. నదిలో పడిపోయిన సమయంలో ఓ పెద్ద గోడ తనకు కనిపించిందని ఆ గోడను పట్టుకుంటూ గట్టుపైకి చేరానని వ్యక్తి తెలిపాడు. అయితే ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు చెప్పారు. కాగా, నయగారా ఫాల్స్‌ ఎత్తు 188 అడుగులు. అక్కడి నుంచి కింద పడిన వారు.. ఇలా ప్రాణాలను దక్కించుకోవడం ఇది నాలుగో సారి అని.. గతంలో ముగ్గురు వ్యక్తులు ఇలానే ప్రమాదంలో పడి మృత్యుంజయులుగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.