Man-Caught-with-Guns-and-Drugs-Who-met-with-an-Road-Accident

రోడ్డు ప్రమాదం.. నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న వ్యక్తిని పట్టించింది

న్యూజెర్సీ: అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం ఓ నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్న వ్యక్తిని పోలీసులకు పట్టించింది. సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన జూలై 24న న్యూజెర్సీలో చోటుచేసుకుంది. లాఫాయెట్ టౌన్‌షిప్‌కు చెందిన జోసెఫ్ రుబినో(57) తన వాహనంలో మారణ ఆయుధాలు, డ్రగ్స్, మందుగుండు సామాగ్రితో వెళ్తుండగా న్యూజెర్సీలో ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే ప్రమాదస్థలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు వాహనంలో రుబినోతో పాటు మరో వ్యక్తి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉండడం చూశారు. దాంతో క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స కోసం హెలికాప్టర్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అనంతరం ప్రమాదానికి గురైన అతడి వాహనాన్ని పరిశీలించగా అందులో భారీగా తుపాకులు, మందుగుండు సామాగ్రి, మాదక ద్రవ్యాలు కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు అనుమానంతో రుబినో ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో అతడి ఇంట్లో డజన్ల కొద్ది మారణ ఆయుధాలు దొరికాయి. షార్ట్ గన్స్, రైఫిల్స్, సెమీ-ఆటోమేటిక్ హ్యాండ్ గన్, అధిక సామర్థ్యం గల సెమీ-ఆటోమేటిక్ పిస్తోల్, గ్రెనేడ్ లాంచర్ ఇలా పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను కూడా అతడి ఇంట్లో కనుగొన్నారు పోలీసులు. 70 గ్రాముల మెథామ్ఫెటామైన్, 7 కిలోల గంజాయి, 200పైగా గంజాయి వేప్ గుళికలు దొరికాయి. వీటితో పాటు ఇతర క్రిమినల్ యాక్టివిటీలకు సంబంధించిన పత్రాలను భారీ మొత్తంలో న్యూజెర్సీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో రుబినోపై పోలీసులు అక్రమంగా ఆయుధాలు, మాదకద్రవ్యాలను కలిగి ఉండడం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.