పోర్ట్‌ల్యాండ్: రెస్టరెంట్స్‌కు వెళ్లినప్పుడు బిల్లుతో పాటు టిప్ కూడా సహజంగా ఇస్తుంటారు. అమెరికా లాంటి దేశాలలో ప్రతిఒక్కరు వారికి సర్వ్ చేసిన వెయిటర్స్‌కు తప్పక టిప్ ఇస్తారు. ఇప్పుడు టిప్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఓరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌కు చెందిన డేవిడ్ హౌస్ అనే వ్యక్తి గత శనివారం ఆనియెల్ ఆర్టిజ్ అనే బార్‌కు వెళ్లాడు. ఒక బీర్ తాగి బిల్లుతో పాటు 5 వేల డాలర్లు(రూ. 3.57 లక్షలు) టిప్‌గా కట్టి వచ్చాడు. ఇక్కడ వింతేంటంటే.. డేవిడ్ కేవలం ఐదు డాలర్లు మాత్రమే టిప్ ఇద్దామనుకుంటే.. తనకు తెలియకుండానే తన బ్యాంకు అకౌంట్ నుంచి 5 వేల డాలర్లు కట్ అయిపోయాయి. ఈ ఘటన జరిగిన రెండు, మూడు రోజుల తరువాత బ్యాంక్ బ్యాలెన్స్ చూడగా.. డేవిడ్‌కు అసలు నిజం తెలిసింది. వెంటనే డేవిడ్ బార్‌కు వెళ్లగా.. బార్ యజమాని సైతం తన అడ్రస్ గురించి వెతుకుతున్నట్టు తెలుసుకున్నాడు. జరిగిన పొరపాటును గుర్తించి బార్ యాజమాన్యం తన అడ్రస్‌ను వెతకడం గొప్ప విషయమన్నాడు.