Indian-American-Festival-Hosted-by-IAFC-in-Dallas

ఐఏఎఫ్‌సీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవాస భారతీయోత్సవం

డాలస్: ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సీ) ఆధ్వర్యంలో మే 4న డాలస్ నగరంలో ప్రవాస భారతీయోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 3000 మందికి పైగా ప్రవాసీయులు పాల్గొనడంతో వేడుక కన్నుల పండుగా జరిగింది. వందలాది మంది పిల్లలు కేరింతలు కొడుతూ బారులు తీరి ‘పెట్టింగ్ జూ’, ‘పోనీ రైడ్స్’,  ‘స్టిల్ట్ వాకర్స్’, ‘ఫేస్ పెయింటింగ్’, ‘మెహంది’, ‘బౌన్సు హౌస్’ దగ్గర కోలాహలం చేశారు. దాదాపు 500 మందికి పైగా యువతీయువకులు భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిస్సి, జానపద నృత్య రీతులలో చేసిన నాట్య విన్యాసాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాశ్చాత్య సంగీత రీతులతో కూడిన కాప్పెల్ పాఠశాల అమెరికన్ విద్యార్థినీ విద్యార్థులు 20 నిమిషాలకు పైగా జరిపిన సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికి టెక్సాస్ రాష్ట్రానికి చెందిన అమెరికా సెనెటర్ టెడ్ క్రూజ్ స్వయంగా యోగితా పత్రాలను అందజేయడం పాల్గొన్న వారందరిలో ఉత్సాహాన్ని నింపింది. 

 
అమెరికా గాట్ టాలెంట్‌లో స్థానం సంపాదించి, స్పానిష్ గాట్ టాలెంట్‌లో సెమీఫైనలిస్ట్‌గా నిలిచిన హైదరాబాద్‌ యువకుడు క్రాంతి కుమార్ విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చూపుడు వేలుతో కొబ్బరికాయకు రంధ్రం చేసి కొబ్బరి నీళ్ళు త్రాగడం, రక్తస్రావం లేకుండా ముక్కులో డ్రిల్ బిట్ ఆన్ చేసి పెట్టుకోవడం, మరిగే నూనెను చేతుల్లో పోసుకుని త్రాగడం, 32 పొడవాటి కత్తులను గొంతులో దించుకోవడం, చెక్క ముక్కపై నుదిటితో మేకు కొట్టడం లాంటి అద్భుత విన్యాసాలు ప్రేక్షకులందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, బోర్డు సభ్యులు ఈ ఉత్సవాలలో క్రాంతికుమార్‌కు "సాహసవీర" అవార్డు ప్రదానం చేశారు. తన్వీర్ అరోరా స్టాండప్ కమెడియన్‌గా అందరినీ నవ్వించారు. బోర్డు సభ్యురాలు రన్నా జానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో రాజేశ్వరి ఉదయగిరి, అంజనా జయంతి, అపర్ణ వంశీలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 
 
ఈ కార్యక్రమంలో టెక్సాస్ రాష్ట్రానికి చెందిన సీనియర్ డెమొక్రాట్, యూ.ఎస్ కాంగ్రెస్ మెంబర్ ఎడ్డీ బెర్నీ జాన్సన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వివిధ సంస్కృతులు, ఆచారాలు కలిగిన ప్రవాసీయులకు అమెరికా నిలయమని, ఈ దేశంలో వివక్షతకు తావు లేదని, అమెరికా దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు. టెక్సాస్ రాష్ట్ర సెనెటర్ జేన్ నెల్సన్ ఈ ప్రవాస భారతీయ ఉత్సవాన్ని గుర్తిస్తూ టెక్సాస్ రాష్ట్ర సెనేట్ నుంచి ప్రశంసా పత్రాన్ని, టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ మెంబెర్ టెర్రీ మీజా ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ పాత్రను ప్రశంసిస్తూ టెక్సాస్ చట్ట సభ నుంచి ప్రత్యేక అభినందన పత్రాన్ని చదివి వినిపించారు. వీరితో పాటు టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు జూలీ జాన్సన్, మ్యాట్ షహీన్ పాల్గొని అమెరికా జన జీవన స్రవంతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఇంకా పెరగవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 
 
ఇటీవలే నార్త్ కరోలినా రాష్ట్ర సెనెటర్‌గా ఎన్నికైన భారత సంతతికి చెందిన జై చౌదరి మాట్లాడుతూ ప్రవాస భారతీయులంతా ఐక్యతతో మెలుగుతూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని తెలిపారు. భారత సంతతికి చెందిన వాషింగ్టన్ రాష్ట్ర సెనెటర్ మాంకా డింగ్ర తాను ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, అందరి సహకారంతో భారీ బడ్జెట్‌తో కూడిన ఎన్నికల్లో నిలబడి గెలిచానన్నారు. దీన్ని మహిళలందరూ స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. వాషింగ్టన్ డీసీలో నెలకొని ఉన్న భారత ఎంబసీ నుంచి కమ్యూనిటీ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ కుమార్, కాప్పెల్ నగర్ పోలీస్ చీఫ్ డానీ బార్టన్, కాప్పెల్ స్కూల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ బ్రాడ్ హంట్, నగర కౌన్సిల్ మెంబర్ బిజూ మాత్యూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఫొటోల కోసం క్లిక్ చేయండి
 
ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ లక్షల సంఖ్యలో ఉన్న ప్రవాస భారతీయులందరు అమెరికా జనజీవన స్రవంతిలో భాగమవుతూ స్థానిక సమస్యలన్నీ తమ సమస్యలుగా భావించి, అర్హత కలిగిన వారందరూ ఎన్నికల్లో పాల్గొంటూ తమ వాణిని ఐకమత్యంగా వినిపించకపోతే ప్రవాస భారతీయులకు సరైన గుర్తింపు లభించదన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమంలో రావు కల్వల పర్యవేక్షణలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని బోర్డు సభ్యులు నిర్వహించారన్నారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకోలేకపోయిన యూ.ఎస్. కాంగ్రెస్ మెంబెర్ రాజా కృష్ణమూర్తి, మిచిగాన్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ పద్మ కుప్ప, టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా సెనెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న సెనెటర్ జాన్ కార్నిన్, సెనెటర్ టెడ్ క్రూజ్‌ ఐఏఎఫ్‌సీ తలపెట్టిన ఈ ప్రవాస భారతీయోత్సవాన్ని ప్రశంసిస్తూ వీడియో మెసేజ్ ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు. వివిధ సంఘాల ప్రతినిధులకు, మీడియా వారికి బోర్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర నేతృత్వంతో కూడిన ఈ ‘ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్’‌లో బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ జాన్ హేమండ్, రావు కల్వల, తైయబ్ కుండావాల, డా. చెన్నుపాటి రావు, పియూష్ పటేల్, మురళి వెన్నం, డా. సత్ గుప్తా, రన్నా జానీ, రామ్‌కీ చేబ్రోలు, ప్రొఫెసర్. నిరంజన్ త్రిపాఠి వివిధ ఏర్పాట్లను పర్యవేక్షించారు.