Florida-Woman-Accused-of-Stealing-over-78-Lakh-in-Watches-from-her-Dates

డేటింగ్ పేరుతో బోల్తా కొట్టించి.. ఫ్లోరిడా మహిళ చేస్తున్నదిదీ..

ఫ్లోరిడా: డేటింగ్ పేరుతో ఖరీదైన చేతి వాచీలను దోచుకెళ్తున్న ఫ్లోరిడా మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేతి వాచీలతో పాటు బాధితుల పర్సులను కూడా పట్టుకెళ్లేదని పోలీసులు పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ఇలా ఆమె ఏకంగా రూ. 78 లక్షలకు పైగా కొల్లగొట్టిందని తెలిపారు. తాజాగా ఆమెను కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... కాటెలిన్ వోజ్టోవిచ్(25) అనే యువతిని మూడు వేర్వేరు చోరీ కేసుల్లో బుధవారం ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట డేటింగ్ పేరుతో బాగా డబ్బు ఉన్న వారికి కాటెలిన్ దగ్గరవుతుంది. ఆ తరువాత హోటళ్లకు తీసుకెళ్ళడం, వారితో సరదాగా గడపడం చేసి పూర్తిగా నమ్మిస్తుంది. అనంతరం అదును చూసి వారి చేతికి ఉన్న విలువైన వాచీలు, పర్సులను తీసుకొని అక్కడి నుంచి చెక్కేస్తుంది. 

కాటెలిన్ తొలిసారి మియామీ బీచ్‌లోని మోకాయ్ లాంజ్‌లో 2018, మేలో విక్సెన్ అనే వ్యక్తిని కలిసింది. విక్సెన్‌తో పరిచయం పెంచుకొని అతను ఉంటున్న ఫోంటైన్‌బ్లో హోటల్‌కు వెళ్లింది. రాత్రి ఇద్దరు ఎంజాయ్ చేసి పడుకున్నారు. అయితే, తెల్లవారే సరికి విక్సెన్‌కు కాటెలిన్ కనిపించలేదు. అదే సమయంలో రూ. 86వేలు విలువ చేసే అతని చేతి వాచీ, రూ. 86వేల నగదు, రూ.57వేల యాపిల్ ఐఫోన్, రూ. 47వేల గూచీ బెల్ట్ మాయమయ్యాయి. 

రెండోసారి 2018, అక్టోబర్ 10న మియామీ బీచ్‌కు వచ్చిన న్యూయార్క్ వ్యక్తిని కూడా ఇలాగే బోల్తా కొట్టించింది కాటెలిన్. డేటింగ్ పేరుతో అతను ఉంటున్న హోటల్ రూంకు వెళ్లి తెల్లవారే సరికి ఆ వ్యక్తి చేతికి ఉన్న రూ. 4లక్షల విలువ చేసే వాచీని తీసుకొని అక్కడి నుంచి ఉడాయించింది. 

మూడోసారి 2019, జనవరిలో మాండ్రియన్ హోటల్ బార్‌లో మరో యువకుడిని వలలో వేసుకుందామె. రాత్రికి అతని రూమ్‌కు వెళ్లిన కాటెలిన్ రూ. 1లక్ష 43వేల నగదు, రూ. 71వేలు విలువ చేసే రొలెక్స్ వాచీ తీసుకుని అక్కడి నుంచి వచ్చేసింది. ఇలా పలువురిని బోల్తా కొట్టించిన కాటెలిన్ ఏడాది కాలంలోనే రూ. 78 లక్షలకు పైగా కొల్లగొట్టింది.

ఈజీ మనీకి అలవాటు పడిన ఆమె చివరకు ఓ యువకుడితో హోటల్‌కు వెళ్లి పట్టుపడింది. యువకుడు బాత్రూంలో ఉండగా అతని పర్సు తీసుకొని పారిపోవాలని చూసింది. కానీ, అదే సమయంలో యువకుడు బయటకు రావడంతో ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. దాంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. పోలీస్ అధికారులు ఆమె చేసిన చోరీలకు సంబంధించిన  సీసీటీవీ ఫుటేజీ జడ్జి ముందు పెట్టారు. దాంతో న్యాయస్థానం కాటెలిన్‌ను దోషిగా తేల్చింది. ప్రస్తుతం ఈ కేసు ఇంక విచారణ దశలోనే ఉంది.