Florida-Man-claims-Wind-blew-crack-Cocaine-inside-his-Car

కొకైన్‌తో పట్టుబడిన ఫ్లోరిడా వ్యక్తి.. ఎలా వచ్చిందని అడిగితే విస్తుగొలిపే సమాధానం

ఫోర్ట్ పియర్స్, ఫ్లోరిడా: కొకైన్‌ను అక్రమంగా రవాణా చేస్తూ ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే సదరు వ్యక్తికి కొకైన్‌ నీ దగ్గర ఎలా వచ్చిందని అడిగిన పోలీసులకు అతడు చెప్పిన సమాధానం షాక్‌కు గురి చేసిందట. ఇంతకు ఆ వ్యక్తి ఏం చెప్పాడో తెలుసా? గాలి వల్ల ఆ మాదక ద్రవ్యం తన కారులో వచ్చి పడిందని తాపీగా చెప్పాడట. అది విన్న పోలీసులకు విస్తుపోవడం వారి వంతైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జోసెఫ్ జాక్(37) అనే వ్యక్తి తన కారును స్టాప్ సైన్ వద్ద కూడా ఆపకుండా వెళ్లడంతో అక్కడ ఉన్న పోలీస్ అధికారుల దృష్టిలో పడ్డాడు. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని వాహనాన్ని వెంబడించారు. 

ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన జాక్ కారులో ఏదో తరలిస్తున్నాడని అనుమానించారు. అలాగే కారు కిటికీలోంచి చూసిన పోలీసులకు వెనుక సీటుపై ఒక చిన్న బ్యాగు కనిపించింది. కొంతదూరం వెళ్లిన తరువాత జాక్ వాహనాన్ని పోలీసులు ఆపారు. ఆ సమయంలో బడ్వైజర్ కంటెయినర్‌ను పోలీసులకు కనిపించకుండా దాచిపెట్టాలని చూశాడు. అదే సమయంలో అతని మాటలు తడబడటం పోలీసులు గుర్తించారు. దాంతో అతని కారును పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులకు వెనుక సీటులో కొకైన్ పీల్చేందుకు ఉపయోగించే గాజు సిలిండర్ ఒకటి దొరికింది. దాంతో పాటు ఒక చిన్న సంచిలో తెల్లటి పదార్థం ఉండడం పోలీసులు గుర్తించారు.

దానిని పరిక్షీంచగా అది కొకైన్ అని తేలింది. దాంతో జాక్‌ను పోలీసులు నీ దగ్గర కొకైన్ ఎలా వచ్చిందని అడిగారు. దానికి అతను... గాలికి కొట్టుకోని వచ్చి తన కారులో పడి ఉండొచ్చని విస్తుగొలిపే సమాధానం ఇచ్చాడు. అది విన్న పోలీసులకు కొద్దిసేపు నోటమాట రాలేదు. మద్యం మత్తులో ఉన్న జాక్‌ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇక ఫ్లోరిడా స్టేట్ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలే కాదు మాదకద్రవ్యాల సామగ్రిని ఉపయోగించడం, తయారు చేయడం, రవాణా చేయడం, ప్రకటనలు లేదా విక్రయించడం అనేది శిక్షార్హనేరం.