Florida-man-allegedly-killed-girlfriends-dog-in-jealous-rage

గర్ల్‌ఫ్రెండ్ టైంకు ఇంటికి రాలేదని.. ఫ్లొరిడాలో..

బ్రోవార్డ్ కౌంటీ: అమెరికాలో ఓ యువకుడు దారణానికి పూనుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ చెప్పిన సమయానికి ఇంటికి రాలేదని.. అభం శుభం తెలియని కుక్క ప్రాణాలను కిరాతకంగా బలిగొన్నాడు. ఫ్లొరిడాలోని బ్రోవార్డ్ కౌంటీకి చెందిన లారెన్స్ గ్రహమ్(19) ఓ స్కూలులో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన గర్ల్‌ఫ్రెండ్‌కు ‘రాత్రి 10.30 గంటలలోగా నువ్వు ఇంట్లో ఉండాలి లేదా జార్డన్(కుక్క)ను చంపేస్తా’ అని మెసేజ్ చేశాడు. 10.30 గంటలు అయినప్పటికీ.. గర్ల్‌‌ఫ్రెండ్ ఇంటికి రాకపోవడంతో కుక్కను అనేక సార్లు నేలకేసి కొట్టాడని, దీంతో కుక్క ఉక్కిరిబిక్కిరి అయిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. అనంతరం కుక్కను తలుపు ఎదుటే పడుకోబెట్టి దానిపై టవల్ కప్పి, పూలను పేర్చి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు లేఖ రాసి పెట్టాడు. వైర్‌తో కుక్కను చంపినట్టు గర్ల్‌ఫ్రెండ్‌కు తెలియాలని కుక్క మెడ చుట్టూ వైర్‌ను ఉంచాడు. ‘నిజంగా నువ్వు జోర్డన్‌ను ప్రేమిస్తున్నట్టయితే.. త్వరగా వచ్చి దాన్ని కాపాడుకో’ అంటూ మరోసారి గర్ల్‌ఫ్రెండ్‌కు మెసేజ్ చేశాడు. మరుసటి రోజు ఈ ఘటన వెలుగులోకి రావడంతో కుక్కను హింసించి చంపినందుకు లారెన్స్‌పై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. లారెన్స్‌పై మొత్తంగా ఆరు కేసులు నమోదయ్యాయి. లారెన్స్ గర్ల్‌ఫ్రెండ్ ఆ రోజు ఇంటికి రాకపోవడమే మంచి పని అని.. లేకుంటే ఏం జరిగి ఉండేదోనని పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. గురువారం లారెన్స్‌ను కోర్టులో హాజరుపరచగా.. 15 వేల డాలర్ల(రూ. 10 లక్షల 34 వేలు) బాండ్‌ను విధించారు. ప్రస్తుతం కటకటాల వెనుకే నిందితుడు శిక్షను అనుభవిస్తున్నాడు.