Father-arrested-after-son-brings-heroin-to-school

తండ్రిని పోలీసులకు అప్పగించిన ఐదేళ్ల కొడుకు.. ఎలా అంటే..

మసాచ్చుసెట్స్: అమెరికాలో ఓ బుడతడు తనకు తెలీకుండానే డ్రగ్స్ సరఫరా చేస్తున్న తండ్రిని పోలీసులకు అప్పగించాడు. ఇంతకూ ఆ బుడతడు ఏం చేశాడంటే.. ఐదేళ్ల వయసున్న పిల్లోడు గురువారం స్కూలుకు ఓ బ్యాగును తీసుకెళ్లాడు. ఆ బ్యాగులో ఓ పౌడర్ ఉందని.. అది తిన్నాక తాను స్పైడర్ మ్యాన్‌లా మరిపోయానని తోటి విద్యార్థులకు చెప్పాడు. ఆ బ్యాగును పరిశీలించిన టీచర్లు అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్కూలుకు వచ్చిన పోలీసులు పిల్లోడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అనంతరం పిల్లోడిని వెంటబెట్టుకుని పిల్లోడి ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన పిల్లోడి తల్లి ఆందోళన చెందింది. పిల్లోడి తండ్రి బెన్నీ గార్సియా(29) బెడ్‌రూంలో నిద్రిస్తుండగా.. అదే గదిలో పోలీసులకు దాదాపు 200 బ్యాగుల డ్రగ్స్ దొరికాయి. వెంటనే బెన్నీ గార్సియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడి కేసు నవంబరు 20న కోర్టుకు రానుంది.