Dusserah-Batukamma-celebrations-in-Dallas

డాలస్‌లో టీపాడ్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు..

డాలస్: అమెరికాలోని టెక్సాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీపీఏడీ - టీపాడ్) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ, దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఆలెన్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలకు స్థానికంగా ఉంటున్న ప్రవాసీలంతా క్యూకట్టారు. జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లలితసంగీతం, జానపదగీతాలు, నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలంతా రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలు పేర్చి, కోలాటం చేశారు. గౌరీదేవికి దీపహారతులతో నైవేద్యాలు సమర్పించారు. బతుకమ్మల నిమజ్జనం అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ టీపాడ్ తరఫున బహుమతులందించారు.

ఆ తరువాత దసరా, జమ్మిపూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తిపాటలు, నృత్యాలు, పల్లకి ఊరేగింపులతో ఈ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది.  ప్రముఖ తెలుగు సినీ మాటల రచయిత, దర్శకుడు కోనవెంకట్,  అందాల తార మెహరీన్ కౌర్ ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు ప్రవీణ్ కొప్పోలు, అంజనాసౌమ్య, శిల్పారావు, ఈటీవీ వ్యాఖ్యాత రవళితో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. అనంతరం టీపాడ్ అధ్యక్షులు చంద్రారెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులకు, కమిటీ సభ్యులకు, విచ్చేసిన ప్రవాసీలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ వేడుకల్లో టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డితోపాటు టీపాడ్ వ్యవస్థాపక అధ్యక్షులు జానకీరామ్, వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ మామిడి, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ పవన్ గంగాధర్, వైస్ చైర్మన్ మాధవీ సుంకిరెడ్డి, జనరల్ సెక్రటరీ మాధవీ లోకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ కోఆర్డినేటర్ సుధాకర్ కలసాని, ట్రెజరర్ అనురాధా మేకల తదితరులు పాల్గొన్నారు.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి