Court-accuses-Lover-for-a-wifes-divorce

భర్తతో విడాకులు తీసుకున్న భార్య.. ఆమె ప్రియుడికి షాకిచ్చిన కోర్టు..

ఉత్తర కరొలీనా: వివాహితతో అక్రమసంబంధం పెట్టుకుని ఆమె కాపురం కూలిపోయేలా చేసినందుకు ఓ వ్యక్తి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భార్యాభర్తలు విడిపోవడానికి అతడే కారణమని తేల్చిన న్యాయస్థానం.. ఆమె భర్తకు రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ సంచలన తీర్పిచ్చింది. ఈ ఘటన అమెరికాలోని ఉత్తర కరొలీనాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కెవిన్ అనే వ్యక్తికి 12 ఏళ్ల క్రితం వివాహం అయింది. అయితే ఇటీవలే కెవిన్ భార్య అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఎప్పుడూ పనిలో మునిగిపోయే కెవిన్.. తనను సరిగా పట్టించుకోవట్లేదని విడాకుల సందర్భంగా ఆమె పేర్కొంది.

 
అయితే అసలు సమస్య ఎక్కడుందో తేల్చాలనుకున్న కెవిన్.. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సహాయం తీసుకున్నాడు. ఆ డిటెక్టివ్ చేసిన దర్యాప్తులో.. కెవిన్ భార్య సహోద్యోగితో వివాహేతన సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. అతని కోసమే ఆమె కెవిన్‌ను వదిలేసిందని ఆ డిటెక్టివ్ చెప్పాడు. దీంతో భార్య ప్రియుడిపై కెవిన్ కోర్టుకెక్కాడు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం భార్య ప్రియుడిదే తప్పని తేల్చింది. అతను కెవిన్‌కు 750,00 డాలర్లు(రూ.5కోట్లపైగా) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
కెవిన్ ఓ ప్రత్యేకమైన చట్టం(ఎలియనేషన్ ఆఫ్ ఎఫెక్షన్) కింద ఈ కేసు వేశాడు. 1800 సంవత్సరం నాటి ఈ చట్టం అమెరికాలో కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే అమలులో ఉంది. దీని ప్రకారం, మూడో వ్యక్తి కారణంగా కాపురం కూలిపోయిందని భావించిన బాధితులు.. సదరు వ్యక్తిపై కోర్టులో కేసు వేయవచ్చు. వివాహ బంధం పవిత్రతను తెలియజెప్పేందుకే తాను ఈ కేసు వేసినట్లు కెవిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.