California-Woman-Posed-as-a-Psychic-and-Duped-Rs-70-Lakh

కాలిఫోర్నియాలో కి'లేడీ'.. సినిమా డైలాగులు చెప్పి లక్షల్లో దోచుకెళ్లింది..

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ మహిళ తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మీరు ఇచ్చే సొమ్మును రెండింతలు చేసి ఇస్తానని సినిమా డైలాగులు చెప్పి అమాయకులను నమ్మించింది. అనంతరం వారి నుంచి ఏకంగా రూ. 70లక్షలకు పైగా వసూలు చేసి అక్కడి నుంచి ఉడాయించింది. పెర్లిటా అఫాన్సియో బాలెస్(29) అనే మహిళ ఇలా అమాయకులను మోసం చేసి భారీ మొత్తంలో దోచుకెళ్లింది. దీంతో శాక్రమెంటో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం... పెర్లిటా అక్కడి స్థానికులను తనను తాను ఎవా మారియాగా పరిచయం చేసుకుంది. అనంతరం తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కొన్ని జిమ్మిక్కులు చేసి వారిని నమ్మించింది. దీంతో అక్కడి స్థానికులు పూర్తిగా ఆమె మాయలో పడిపోయారు. 

నిజంగానే ఎవా వద్ద అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మడం మొదలెట్టారు. అదే అదనుగా భావించిన ఎవా... అక్కడి వారిని మీ వద్ద ఉన్న నగదును తనకు ఇచ్చి వెళ్తే తిరిగి వచ్చే సరికి రెండింతలు చేసి ఇస్తానని చెప్పింది. అది నిజం అని నమ్మిన జనం తమ వద్ద ఉన్నదంతా ఆమెకు అప్పగించి వెళ్లిపోయారు. కొంత సమయం తరువాత ఎవా ఉంటున్న చోటుకు వచ్చి చూసిన స్థానికులు నిర్ఘాంతపోయారు. అక్కడ ఆమె కనిపించలేదు. దాంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎవాపై భారీ దోపిడీ, మోసం కింద కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మోస్ట్ వాటెండ్ జాబితాలో ఉందని శాక్రమెంటో పోలీసులు తెలిపారు.