California-school-faces-bird-trouble

లక్షలు పెట్టి గ్రౌండ్ అభివృద్ధి.. చివరకు ఓ పిట్ట వల్ల..

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలోని ఓ స్కూలుకు పిట్ట కష్టాలు వచ్చాయి. అర్థం కాలేదా? అంటే ఓ పిట్ట వల్ల సమస్యలు తలెత్తాయి. రియో అమెరికానో హైస్కూల్లో ఫుట్‌బాల్, లాంగ్ జంప్, లాక్రోస్ వంటి ఆటలు ఆడే క్రీడామైదానం సరిగాలేదు. దాంతో దీన్ని పునరుద్ధరించాలని బడి యాజమాన్యం నిర్ణయించింది. దీనికోసం సోషల్ మీడియా వేదికగా విరాళాలు సేకరించింది. ఆ సొమ్ముతో ఆటస్థలంతోపాటు టాయిలెట్లు, స్కోర్‌బోర్డులు అన్నింటినీ ఏర్పాటు చేసింది. అంతా అయిపోయింది.. ఇక గ్రౌండ్ ఓపెనింగే తరువాయి అనుకుంటుండగా వారికి అనుకోని సమస్య వచ్చిపడింది. ఆ క్రీడామైదానం చివర్లో కిల్‌డీర్ అనే జాతి పక్షి గూడు పెట్టుకొంది. చట్టప్రకారం, ఈ పక్షులకు ఎటువంటి హానీ చేయకూడదు. దాంతో ఆ పక్షిగూడు చుట్టూ కంచె వేసిన బడి యాజమాన్యం.. ఆ పిట్టల గుడ్లు పిల్లలుకాగానే అవి వెళ్లిపోతాయని, అప్పటివరకు మైదానం ప్రారంభోత్సవం చేయడం కుదరదని చెప్పింది. ఆ పక్షలు గుడ్లు పిల్లలు కావడం కోసం దాదాపు నెలరోజులుగా ఎదురు చూసిన విద్యార్థులకు.. ఇటీవలే స్కూలు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఆ పక్షులు వెళ్లిపోయాయని వచ్చే వారం మైదానం ప్రారంభోత్సవం జరగనుందని స్పష్టం చేసింది. అంత ఖర్చుపెట్టి నిర్మించుకున్న క్రీడామైదానంలో ఆటలాడటానికి ఇన్ని రోజులు వేచిచూడటం ఇబ్బందిగా అనిపించిందని విద్యార్థులంటున్నారు. ఇవే పిట్ట కష్టాలంటే అంటూ స్థానికులు నవ్వుతున్నారు.