Batukamma-grand-celebrations-in-Kansas

కన్సాస్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ,దసరా సంబరాలు

కన్సాస్: అమెరికాలోని కన్సాస్ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కన్సాస్ హిందూ టెంపుల్ కల్చరల్ సెంటర్ హాల్ దీప కాంతుల వెలుగుల్లో ఆడపడుచులందరూ పాటలు పాడుతూ, ఆటలూ ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు. కన్సాస్ సిటీ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ 13వ బతుకమ్మ, దసరా వేడుకలు శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు లలితా సహస్రనామ పూజతో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు. కలాశ్రీ భిక్షు నాయక్, రేలా  రే రేలా ఫేం, వీ6 వ్యాఖ్యాత సుపరిచిత జానపద గాయకురాలు షాలిని తమ గానమాధుర్యంతో ఆహుతులను అలరించారు. ఈ ఉత్సవాల్లో పిల్లలు, పెద్దలు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలను ఇంత ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని స్థానిక తెలుగు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

సుమారు వెయ్యిమంది ప్రవాసీలు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. సంప్రదాయ తెలంగాణ డప్పు సంగీతంతో  ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు. దినేష్ చిన్నలచ్చయ్య, కిరణ్ కానకదండిల అద్యక్షతన, ఇతర కార్యవర్గ సభ్యులు గౌరి చెరుకుమూడి, శ్రీదేవి గొబ్బూరి, మహతి మండ, వెంకట్ పుసులూరి, విజయ్ కొండితోపాటు 30 మంది వాలంటీర్ల సమిష్టి కృషితో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన నాట్స్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి, వెంకట్ మంత్రి, మీడియా పార్టనర్స్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.