Alaska-Man-Allegedly-Shot-Sister-to-Death-Because-She-Unfriended-Him-on-Facebook

ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ చేసిందని.. సొంత సోదరినే హతమార్చాడు..

అలాస్కా: కొందరు క్షణికావేశంలో చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకునేంతవరకు వెళ్తుంటారు. తాజాగా ఇదే కోవలో అమెరికాలోని అలాస్కాలో ఒక ఘటన చోటుచేసుకుంది. సొంత సోదరిని ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపేశాడు. అతను అలా ఎందుకు చేశాడో తెలుసా? కేవలం తనను ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ చేసిందనే చిన్న కారణానికే ఆమెను ఇలా అత్యంత కిరాతకంగా చంపాడు. రాత్రి థ్యాంక్స్ గివింగ్ పార్టీలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబంలో తెల్లవారేసరికి ఈ ఘటన విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే... మోసెస్ క్రో అనే వ్యక్తి  క్షణికావేశంలో ఒక చిన్న కారణానికే ఈ దారుణానికి ఒడిగట్టాడు. రాత్రి థ్యాంక్స్ గివింగ్ పార్టీలో పాల్గొన్న అతను ఉదయం లేచి తాను ఎంతో ఇష్టంగా చూసుకునే కుక్కపిల్ల కనిపించక పోవడంతో దాని కోసం వెతకడం మొదలెట్టాడు. ఇంతలో ఆ పప్పీ అతని సోదరి అమండా ఓవెన్ చేతిలో కనిపించింది. 

దాంతో తన కుక్కపిల్ల తనకు ఇచ్చేయాలని ఆమెతో చెప్పాడు. ఆ సమయంలో మోసెస్‌కు తన సొంత పిల్లల కంటే ఈ కుక్కపిల్లనే ఎక్కువ అని అమండా ఎగతాళిగా మాట్లాడింది. అంతే... అది విన్న క్రోకు కోపం కట్టలు తెంచుకుంది. లోపలి నుంచి లైసెన్స్ రివాల్వర్ తీసుకొచ్చి సోదరికి గురిపెట్టాడు. అక్కడే ఉన్న నాన్నమ్మ అతడ్ని వారించే ప్రయత్నం చేసింది. వద్దు.. ఎందుకు ఇలా చేస్తున్నావని గ్రాండ్‌మదర్ క్రోను అడుగుతుండగానే.. అమండా తనను ఫేస్‌బుక్‌లో అన్‌ఫ్రెండ్ చేసిందని చెబుతూనే తుపాకీ పేల్చేశాడు. దాంతో అమండా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు మోసెస్ క్రోను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో సోదరిని బెదిరిద్దామని గన్ తీశానని, కాని అది ప్రమాదవశాత్తు పేలిపోయిందని తెలిపాడు. పోలీసులు క్రోపై హత్య నేరం కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు.