37th-AAPI-convention-in-Atlanta-a-grand-success

అట్లాంటాలో ఘనంగా భారతీయ అమెరికన్ వైద్యుల వార్షిక సదస్సు..

అట్లాంటా: అమెరికాలోని అట్లాంటాలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్(ఏఏపీఐ) 37వ వార్షిక సదస్సు అంగరంగవైభవంగా జరిగింది. దీనిలో సుమారు మూడేవేల మంది వైద్యులు వారి కుటుంబాలతో కలసి పాల్గొన్నారు. జూలై 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో ఈ సదస్సును నిర్వహించారు. మెహబూబ్ నగర్ మూలాలు కలిగిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ గంగసాని శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విశ్వయోగి విశ్వంజీ జ్యోతి ప్రజ్వలనతో జూలై 3న  కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి అమెరికా ప్రభుత్వ అధికారులు, అమెరికా మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం హాజరయ్యారు. అట్లాంటాలోని భారత ప్రభుత్వ దౌత్య అధికారిణి డాక్టర్ స్వాతి కులకర్ణి భారతీయ వైద్యులనుద్దేశించి ప్రసంగించారు. 4వ తేదీన ప్రముఖ యోగా గురువు, ఇషా యోగ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్ ఉపన్యసించారు. ఏటా నిర్వహించే ఈ ఆపి(ఏఏపీఐ) కన్వెన్షన్ అండ్ సైంటిఫిక్ అసెంబ్లీ ఈ ఏడాది కూడా విజయవంతమైందని ఆపి ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వైద్యుల నృత్య నాటక ప్రదర్శనలు ఆహుతులను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు.

ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి