12-YEAR-OLD-GIRL-TAKES-UBER-ALONE-TO-PARKING-GARAGE-TO-COMMIT-SUICIDE

తల్లిదండ్రులు నిద్రపోతుండగా.. 12 ఏళ్ల యువతి ఉబెర్ బుక్‌చేసి..

ఫ్లోరిడా: మానసిక స్థితి సరిగ్గాలేని ఓ యువతి తన ప్రాణాలను తానే తీసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన బెనిటా డైమండ్(12) అనే యువతి అర్థరాత్రి సమయంలో నిద్రలేచి తన తల్లి మొబైల్ ద్వారా ఓ ప్రదేశానికి వెళ్లడానికి ఉబెర్ క్యాబ్ బుక్ చేసింది. క్యాబ్ ఎక్కి ఓ పార్కింగ్ గ్యారేజ్‌కు వెళ్లింది. తొమ్మిది ఫ్లోర్లు కలిగిన ఆ గ్యారేజ్ పైకి ఎక్కి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనవరి 10న జరగగా.. బెనిటా తల్లి లీషా చెన్ ఉబెర్‌పై కోర్టులో దావా వేయాలని నిశ్చయించుకుంది. 12 ఏళ్ల పాపను క్యాబ్ ఎలా ఎక్కించుకుంటారని లీషా ఉబెర్ కంపెనీని ప్రశ్నిస్తోంది. ఆమె పెట్టుకున్న ప్రదేశంలో స్కూలు కానీ, పిల్లలకు సంబంధించినవి కానీ ఏమీ లేవని, ఉబెర్ డ్రైవర్ తన కూతురిని నిలదీసి క్యాబ్ ఎక్కించుకోకుంటే ఈరోజు తన కూతురు కళ్ల ముందు ఉండేదని లీషా ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ఉబెర్ వెబ్‌సైట్‌లో 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఉబెర్ సేవలను వినియోగించుకోవాలని, తక్కువ వయసు వారు 18 ఏళ్లకు పైబడిన వారితో ప్రయాణించాలని ముందుగానే సూచించింది. అయితే ఈ ఘటనపై ఉబెర్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. తన కూతురు చాలా తెలివైనదని, కానీ ఆమె మెదడు పూర్తిగా ఎదగలేదని లీషా తెలిపింది. కూతురి ఫోన్‌‌కు కూడా లాక్ వేస్తామని, ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తామని చెప్పింది. అందుకే క్యాబ్‌ను కూడా తన ఫోన్ నుంచి బుక్ చేసిందని తల్లి లీషా పేర్కొంది.