Youtube-star-Vidya-Ayyar-Success-story

నెట్టింట హిట్‌ పాట

విద్యా అయ్యర్‌... అందరికీ పరిచయమున్న పేరు ‘విద్యా వోక్స్‌’. మద్రాసులో పుట్టి... వర్జీనియాలో పెరిగి...లాస్‌ఏంజిల్స్‌లో పాప్‌ గీతాలతో అదరగొడుతోంది. ‘యూట్యూబ్‌ స్టార్‌’గా నెట్టింట లక్షలాది ప్రపంచ సంగీత ప్రియులను షేక్‌ చేస్తోంది. ఇటీవల భారత్‌ పర్యటనలో హైదరాబాద్‌ సహా వివిధ నగరాల్లో లైవ్‌ షోలిచ్చి అభిమానులను ఉర్రూతలూగించిన 27 ఏళ్ల ఇండో-అమెరికన్‌ అయిన విద్యను ‘మీ హిట్‌ సీక్రెట్‌ ఏంట’ని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది...

 
అమెరికాలోని స్కూల్లో చదువుతున్నప్పుడు నన్ను ర్యాగింగ్‌ చేసేవారు. ఎందుకంటే మా స్కూల్లో భారతీయ విద్యార్థులు చాలా తక్కువ. ఆ వయసులో అది నన్ను బాగా ఆందోళనకు గురిచేసింది. దీంతో స్కూల్లో ఉన్నంతసేపూ నాలోని భారతీయ సంస్కృతి బయటకు కనిపించకుండా దాచుకునే ప్రయత్నం చేసేదాన్ని. కానీ... హైస్కూలు చదువు పూర్తయ్యే సరికి ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు నా మాతృభూమి భారత్‌ అని చెప్పుకోవడానికి వంద శాతం గర్వపడుతున్నా. ఇకపై మన సంస్కృతి, సంప్రదాయాలను దాచుకుని తిరిగే ప్రసక్తే లేదు.
 
లక్షలు దాటిన వీక్షకులు...
చిన్నప్పటి నుంచీ నాకు సంగీతమంటే ఎంతో ఇష్టం. అందుకే కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. ఇంట్లో తమిళంలో మాట్లాడుకొంటాం. దోశలు, ఇడ్లీలు తింటాం. స్కూలు వయసు నుంచీ బియాన్స్‌ పాటలు వినేదాన్ని. కెరీర్‌లో ఎదిగే క్రమంలో నాకు కొంత గుర్తింపు సమస్య వచ్చింది. పాప్‌ రాగాలకు భారతీయ సంప్రదాయ సంగీతాన్ని మిక్స్‌ చేసి ‘మ్యాషప్స్‌’ చేస్తున్నా. ఎప్పుడూ అనుకొంటూ ఉంటా... ‘ఈ రెండు ప్రపంచాలను నేనెలా పెళ్లి చేసుకోగలను’ అని! ఆ పరిణయం కనీసం కొన్ని నిమిషాలైనా చాలనిపిస్తుంది! ఈ ఆలోచనల్లో నుంచి పుట్టినవే నా పాటలు. 2015లో పాప్‌ హిట్స్‌కు- కర్ణాటక సంగీతం కలగలిపి రూపొందించిన పాటలతో యూట్యూబ్‌ చానల్‌ ‘విద్యా వోక్స్‌’ ప్రారంభించాను. అది సూపర్‌ హిట్టయింది.
 
ఇప్పుడు నా చానల్‌కు 350 మిలియన్‌ వ్యూవర్‌షిప్‌ ఉంది. మూడు మిలియన్లకు పైగా సబ్‌స్ర్కైబర్స్‌ ఉన్నారు. బాగా పాపులర్‌ అయిన మషప్స్‌ చెప్పాలంటే... ‘క్లోసర్‌-కబీరా’, ‘లవ్‌ మీ లైక్‌ యూ డూ-హోసన్నా’. వీటితోనే నాకు విపరీతమైన గుర్తింపు వచ్చింది. విడుదలైన ఏడు నెలల్లోనే 55 మిలియన్ల మంది వీక్షించారు. ‘కుత్తాందన్‌ పుంజలయిలీ’ కేరల బోట్‌ సాంగ్‌ ఎంతో ఆదరణ పొందింది. దీన్ని కేరళలోనే షూట్‌ చేశాం. నా పాటలన్నీ శంకర్‌ టక్కర్‌ ఆధ్వర్యంలోని బ్యాండ్‌తోనే పాడుతుంటా. ఇప్పటివరకూ యూట్యూబ్‌లోనే కాకుండా... అమెరికాలోని వైట్‌హౌస్‌, రీయూనియన్‌ ఐస్‌ల్యాండ్‌, దుబాయ్‌, నెదర్లాండ్స్‌తో పాటు భారత్‌లోని వివిధ ప్రధాన వేదికలపై ప్రదర్శనలిచ్చాను.
 
భారత్‌ పర్యటనతో కొత్త ఉత్సాహం...
సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందిన తరువాత అభిమానులున్నట్టే... విమర్శకులూ ఉంటారు. అలాంటి అవహేళనలు, అవమానకర వ్యాఖ్యలు నేను పట్టించుకోను. కామెంట్లు చూడకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తుంటా. విమర్శించేవారిని అర్థం చేసుకోగలను. మన పాటలు అందరికీ నచ్చాలని లేదు కదా! నాకు నా సంగీతమే సర్వస్వం. ప్రస్తుతం ‘కుతు ఫైర్‌’ ఆల్బమ్‌ విడుదల చేశాను. దాని ప్రమోషన్‌ కోసమే ‘విద్యా వోక్స్‌ కుతు ఫైర్‌ టూర్‌’ పేరిట భారత్‌ పర్యటన. ఈ పర్యటనతో కొత్త ఉత్సాహం వచ్చింది. హైదరాబాద్‌, ముంబై వంటి మహానగరాల్లో నా లైవ్‌ మ్యూజిక్‌కు మంచి ఆదరణ లభించింది. నా డ్రెస్సింగ్‌ కూడా ఇండో-వెస్ట్రన్‌ స్టైల్‌ కలిసి ఉంటుంది. మన ఆభరణాలు ఉపయోగిస్తుంటాను. మా అమ్మ, అమ్మమ్మల వార్డ్‌రోబ్‌ కూడా నా ఫ్యాషన్‌లో ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఫ్యాషన్‌ లైన్‌లోకి కూడా అడుగు పెట్టాలనేది నా కల. త్వరలోనే అదీ నెరవేరాలని కోరుకొంటున్నా.
 
పాప్‌ రాగాలకు భారతీయ సంప్రదాయ సంగీతాన్ని మిక్స్‌ చేసి ‘మ్యాషప్స్‌’ చేస్తున్నా. ఎప్పుడూ అనుకొంటూ ఉంటా... ‘ఈ రెండు ప్రపంచాలను నేనెలా పెళ్లి చేసుకోగలను’ అని! ఆ పరిణయం కనీసం కొన్ని నిమిషాలైనా చాలనిపిస్తుంది!