Woman-left-america-job-and-became-pad-woman

న్యూయార్క్‌లో పెద్ద ఉద్యోగం..చేతి నిండా డబ్బు.. కానీ

ప్యాడ్‌ ఉమెన్‌

ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ తయారీ
దీపాంజలి దాల్మియా సంచలనం

వయస్సు 26 ఏళ్లు..న్యూయార్క్‌లో పెద్ద ఉద్యోగం..చేతి నిండా డబ్బు..కానీ దీపాంజలి దాల్మియాకు సంతృప్తి లేదు! ఏదో చేయాలి.. నలుగురి కోసం బతకాలి..పదిమందికి సాయపడాలి! ఈ సంఘర్షణలోంచి పుట్టిందే.. ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ ఆలోచన! రెండేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధన ఫలించింది. 6 నెలల్లోనే మట్టిలో కలిసిపోయే ప్యాడ్ల తయరీతో ‘హేడే’ కంపెనీని ప్రారంభించింది.
 
దీపాంజలి దాల్మియా! న్యూయార్క్‌లోని ఓ టాప్‌ కంపెనీలో ఫైనాల్షియల్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ.. 2015లో ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇదేం పిచ్చి పని అని చాలామంది విమర్శించారు. కానీ యాంత్రికమైన పనిలో ఆమె ఇమడలేకపోయింది. నలుగురికీ ఉపయోగపడేలా కొత్తగా ఏదైనా చేయాలని తపించింది. అలా మొదలైన కంపెనీయే ‘హేడే’! వెదురు, కార్న్‌ ఫైబర్‌తో చేసిన.. నూటికి నూరుశాతం మట్టిలో కలిసిపోయే శానిటరీ ప్యాడ్‌! ఢిల్లీ, గుర్గావ్‌, నోయ్‌డా, ముంబైలలో ఇప్పడిదో బ్రాండ్‌! ‘భారత్‌లో 87శాతం మహిళలు శానిటరీ ప్యాడ్స్‌ ఉపయోగించరు. అందుకే వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన రంగంలో ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాను’ అంటుంది దీపాంజలి! ‘మార్కెట్లో ఉన్న ప్యాడ్స్‌లో 90శాతం రసాయనాలతో నిండిన ప్లాస్టిక్‌తో చేసినవే! అందుకే ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ తయారీ మొదలుపెట్టాను’ అనే దీపాంజలి మాటల్లో పర్యావరణంపై ప్రేమ కనిపిస్తుంది.
 
తయారీ నుంచి ప్యాకేజింగ్‌ వరకూ..
వెదురు నారకు పీల్చుకునే సామర్థ్యం ఉంటుంది. మొక్కజొన్న పోగుల అమరిక మెత్తగా ఉంటుంది. ఇలా రెండేళ్ల పరిశోధన తర్వాత గత ఏడాది సెప్టెంబరులో సేంద్రీయ, సహజమైన, సురక్షితమైన నెలసరి ప్యాడ్లు తయారీ కంపెనీ ప్రారంభించింది. తన బ్రాండ్‌కు ‘హేడే’ అని పేరుపెట్టింది. ప్యాకేజింగ్‌ ఇండియాలో జరుగుతున్నా..చైనా, ఫిన్లాండ్‌లలో ఉత్పత్తుల తయారీ జరుగుతోంది. మరి ఇలా ఎందుకు? ‘రసాయనాలు లేని, 100 శాతం సేంద్రియ పదార్థాలతోనే మేం శానిటరీ ప్యాడ్స్‌ తయారుచేస్తాం. భారత్‌లో రసాయనాలు లేని నేల మాకు కనిపించలేదు. అందుకే ఇతర దేశాలపై ఆధారపడుతున్నాం’ అని వివరిస్తోంది దీపాంజలి దాల్మియా! విదేశాల్లో తయారైనప్పటకీ మార్కెట్లోని ఇతర శానిటరీ న్యాప్‌కిన్స్‌తో పోలిస్తే.. హేడే ధర తక్కువే అంటోంది! శానిటరీ ప్యాడ్స్‌ దగ్గర్నుంచి..కవర్‌, ప్యాకేజింగ్‌ ఇలా మొత్తం ఆరునెలల్లో మట్టిలో కలిసిపోతుంది.
 
త్వరలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలో కూడా ఈ ఆర్గానిక్‌ శానిటరీ ప్యాడ్స్‌ అందుబాటులోకి రానున్నాయి. మహిళల ఆరోగ్యం, పర్యావరణ రక్షణను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన ఈ ఉత్పత్తికి 2017 సంవత్సరానికిగాను.. ఫోర్బ్స్‌ ఇండియా-30 జాబితాలో దీపాంజలి స్థానం సొంతం చేసుకుంది.