Woman-authors-in-Telugu-world-summit

మనసు నిండుగా మంచి జ్ఞాపకం

అమెరికా నుంచి అంతర్జాల సాహిత్య పత్రికను నిర్వహించిన వారు ఒకరైతే... దుబాయ్‌లో ఉంటూ సామాజిక మాధ్యమాల ద్వారా కవితాక్షరాలను ఝళిపిస్తున్నవారు మరొకరు. ఈ నేలపైనే ఉంటూ సామాన్యుల సమస్యలని, స్త్రీల జీవితాల్లోని భిన్న పార్శ్వాలను అక్షరీకరిస్తున్న వారు మరికొందరు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన రచయిత్రులతో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చటించింది. ఇవిగో ఆ విశేషాలు..!

సాహిత్యానికి గండపెండేరం
అమెరికాలోని క్యాలిఫోర్నియా నుంచి వచ్చి ఈ సభల్లో పాల్గొన్నందుకు, నా కవిత్వం వినిపించినందుకు మహదానందంగా ఉంది. ఈ ప్రపంచ మహాసభలు, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. జనం ఉత్సాహం, సాహిత్యజీవులకు లభించిన గౌరవం చూస్తుంటే, ఈ సభలు సాహిత్యానికి గండపెండేరం తొడిగినట్టు అనిపిస్తోంది. సాహిత్యం పట్ల అభిమానం ఉన్న వ్యక్తి పాలకుడు కావడం వల్లే భాషకూ, సాహిత్యానికీ ఇంత పెద్దయెత్తున ఉత్సవాలు జరగడం సాధ్యమైంది. తెలంగాణ భాష, సాహిత్య చరిత్రలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని ఈ సభలు పెట్టుకున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్య సాహిత్యకారులను కూడా పిలిచి, వారికీ ఇందులో భాగస్వామ్యం కల్పించడం బాగుంది. ‘తెలంగాణ చారు పెడుతూ, అందులో కరివేపాకులా ఆంధ్ర ప్రాంతపు ప్రాతినిధ్యం కల్పించార’ని ఒక వ్యాఖ్య వచ్చింది. అయితే, వేదికపై మరెవరో అన్నట్లుగా ఆంధ్ర ప్రాంతపు ప్రాతినిధ్యం ఈ వంటలో ఉప్పు లాంటిది. ‘ఎంత నలభీమపాకమైనా ఉప్పుంటేనే రుచి’ అని భాస్కర శతకకారుడి మాట. ఆ ప్రాంత సాహిత్యకారులకూ, దాదాపు నలభై రెండు దేశాల నుంచి నాలుగొందల యాభై మంది ప్రవాస భారతీయులకూ ప్రాతినిధ్యం కల్పించడంతో ప్రపంచ తెలుగు మహాసభలన్న పేరు సార్థకమైంది. కవిత్వమనేది కవి నుంచి పాఠకుడికి చేరినప్పుడే అది సంపూర్ణమైనట్లు అంటారు. ఈ సభల వల్ల అది నెరవేరిందనిపిస్తోంది.
- డాక్టర్‌ కె. గీత, కవయిత్రి, అమెరికా

అప్పుడే మంచి రోజులొస్తాయి!
తెలుగు భాష, సాహిత్యం గురించి చర్చించాల్సిన అవసరం ఉందని గుర్తించడం ముదావహం. ‘కథ, నవల ఎంత కాలం ఉంటుంది?’ అన్న సందేహంతో ఉన్నామనిపిస్తోంది. తొలితరం అక్షరాస్యులకు జ్ఞాన దాహం ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ ఆంగ్ల పోకడలకు దూరంగా, అలాంటి జిజ్ఞాస కలిగిన వారు మారుమూల పల్లెల్లో ఎంతో మంది ఉన్నారు. వారందరికీ సాహిత్యం చేరాలంటే ఎంత చిన్న గ్రామంలోనైనా పెద్ద గ్రంథాలయం ఉండాలి. దానికి కావాల్సిన నిధులన్నీ ప్రభుత్వం సమకూర్చాలి. ఆ పని చేయగలిగితే సాహిత్యం బతుకుతుందనడంలో సందేహం లేదు. ‘రచయితలం! ఇంట్లో కూర్చుంటాం’ అనుకుంటే సరిపోదు! ఒక్కసారి గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొమర్రాజు లక్ష్మణరావు వంటి వారు ఆనాడు సాహిత్యాన్ని ప్రజలకి చేరువ చేయడంకోసం ఎలా పనిచేశారన్నది జ్ఞప్తికి తెచ్చుకోవాలి. వారి స్ఫూర్తితో మనం కూడా సాహిత్యాన్ని ప్రజల చెంతకి చేర్చే కార్యకర్తలుగా పనిచేయగలిగితే సాహిత్యానికి మంచి రోజులొస్తాయని భావిస్తాను. ప్రతి శాస్త్రంతోనూ సాహిత్యానికి వున్న సంబంధం, మొత్తం మానవజీవితానికి సాహిత్యంతో వున్న సంబంధం అర్థంచేసుకొని, వాటి నుంచి కథలు, నవల్ని విస్తృతంగా రాసి రచయితలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది.  
-ఓల్గా, ప్రముఖ స్త్రీవాద రచయిత్రి
 
స్త్రీవాద కవిత్వానికి చోటెక్కడ..! 
ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్యానికి అగ్రస్థానం ఇవ్వడం బావుంది. తోటి కవయిత్రులందరి సమక్షంలో కవిత చదవడం, సదస్సులో పాల్గొనడం... ఇవన్నీ ఉత్తేజాన్ని ఇచ్చాయి. అమెరికాలో కూడా తెలుగు సంఘాలు నిర్వహించే కవి సమ్మేళనాలు, సాహిత్య సమావేశాల ద్వారా ఆర్నెల్లకోసారి రచయితలం, కవులం కలుస్తుంటాం. ‘వాకిలి’, ‘ఈ మాట’, ‘మధురవాణి’, ‘సుజనరంజని’ తదితర అంతర్జాల సాహిత్య పత్రికలన్నీ అమెరికా నుంచే వస్తున్నాయి. అవి మాకు మంచి వేదికగా నిలుస్తున్నాయి. అక్కడ సీరియ్‌సగా సాహిత్య కృషి చేసే రచయితలు 50మందికి పైగా ఉన్నారు. వారందరి ద్వారా నిత్యం సాహిత్య సృజనతో పాటు లోతైన చర్చలుకూడా జరుగుతుంటాయి. 2013, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక అవసరం అనే ఉద్దేశంతో నేను, అఫ్సర్‌, రాజ్‌ కారంచేడు కలిసి ‘సారంగ’ అంతర్జాల వారపత్రికను ప్రారంభించాం. ‘అమెరికాలో ఉంటూ తెలుగులో సాహిత్య వారపత్రిక తీసుకురాడం సాధ్యమేనా!’ అన్న భయంతో మా ప్రయత్నం మొదలైంది. ప్రారంభమైన ఏడాదికే మా పత్రిక లక్షమందికి చేరువ కావడం ఉత్తేజాన్నిచ్చింది. ఆ వేదిక ద్వారా తెలుగు రచయితలకు స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పించగలిగాం. ‘సారంగ’ ద్వారా కొత్త రచయితలు, కొత్త పాఠకులు వచ్చారని చెప్పవచ్చు. తద్వారా మేం సఫలీకృతమయ్యాం. మొదట్లో ‘‘మాకు రాయడం రాదు. ఆన్‌లైన్‌లో ఎలా చదవాలి?’’ అని పెద్ద రచయితలు సైతం అన్నారు. తర్వాత వారే స్వయంగా ఆ సాంకేతికపరమైన అంశాల్ని తెలుసుకొని, నేర్చుకొని రాసిన వాటిని టైప్‌ చేసి- యూనికోడ్‌లో మాకు పంపించారు. నవలలు, కథలు, కవిత్వం, అనువాద నవలలు, వ్యాసాలు, విమర్శ వంటి అన్ని ప్రక్రియలకు చోటిచ్చాం. పేరుకు అది సాహిత్య పత్రికైనా, రాజకీయ, సాంస్కృతిక అంశాలకూ స్థానం ఇచ్చాం. చరిత్ర, పరిశోధనా వంటి వాటిని చర్చించడానికి ‘సారంగ’ వేదికగా నిలిచింది. వృత్తి, ఉద్యోగ జీవితాల్లో తీరిక తగ్గడం వల్ల ఈ ఏడాది జనవరి 19న ఆ పత్రికను తాత్కాలికంగా ఆపేశాం. త్వరలోనే మళ్లీ ‘సారంగ’ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. స్త్రీల కవిత్వానికి ఈ సభల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనిపిస్తోంది. స్త్రీవాద సాహిత్యం, ముస్లిం స్త్రీవాద సాహిత్యానికి సంబంధించిన ఒక్క కవయిత్రిని కూడా భాగస్వామ్యం చేయకపోడం బాధగా అనిపించింది. 
-కల్పనా రెంటాల, రచయిత్రి, అమెరికా
 
మాతృభాషకి పట్టం!
తెలంగాణ అంటే ఉద్యమమే కాదు, ఉత్సవం కూడా. అస్తిత్వ పోరాటం నుంచి మన భాషకి పట్టంకడుతున్న సందర్భంలోకి మనం పయనిస్తున్నాం. అవహేళనలు, అవమానాలకు గురైన భాష, యాస, సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం గొప్పగా ఉంది. ప్రభుత్వమే దగ్గరుండి భాషాపరమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా, పరభాషా వ్యామోహం ఎక్కువైన ఈ రోజుల్లో ప్రజల్లో మాతృభాషపై ఓ చర్చ మొదలవుతుంది. తెలంగాణ బిడ్డగా ఈ వేడుకల్లో పాల్గొన్నందుకు గర్వంగా భావిస్తున్నాను. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వేడుకలకి తెలుగు ప్రాంతాలనుంచే కాక, విదేశాల్లోని తెలుగు బిడ్డలందరినీ ఆహ్వానించడం అభినందనీయం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోడం కోసం పండుగలు, ప్రత్యేక రోజుల్లో దుబాయ్‌లోని తెలుగువారందరం ఓ చోట కలుస్తాం. ఆ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దుబాయ్‌లో తెలుగు సాహిత్య చర్చలు, సమావేశాలకు పెద్దగా అవకాశం ఉండదు. ఈ మహాసభల స్ఫూర్తితో తప్పనిసరిగా అక్కడ సాహిత్య సమావేశాలు ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తాం. 
- బండారి శైలజ, కవయిత్రి, దుబాయ్‌
వచ్చేసారి ఆ అవకాశం ఇవ్వాలి!
నేను పాల్గొంటున్న తొలి ప్రపంచ తెలుగు మహాసభలివి. మాది మహబూబ్‌ నగర్‌ జిల్లా కురుమిద్ద గ్రామం. ముప్ఫై ఎనిమిదేళ్ళ క్రితం అమెరికాకు వెళ్ళా. ఇప్పుడీ సభలకు వచ్చి, ఇంతమంది సాహిత్యాభిమానుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియా స్టేట్‌లోని జార్జ్‌ మేసన్‌ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెలిజియస్‌ స్టడీ్‌సలో పనిచేస్తున్నా. తెలుగు గడ్డ మీద శైవ సంప్రదాయం, చరిత్ర మీద... అందులోనూ శ్రీశైలం మీద నా ప్రధానమైన దృష్టి. నా పరిశోధనలో భాగంగా మధ్యయుగాల నాటి పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్ర, బసవపురాణం లాంటి ప్రాచీన తెలుగు శైవ గ్రంథాలెన్నో చదవడమే కాక, వాటిలోని కొన్ని భాగాలను ఇంగ్లీషులోకి అనువదిస్తున్నా. అలా అనువదించిన తొలి తెలుగు వ్యక్తిని నేనే. అలాగే, స్కంధపురాణంలోని శ్రీశైలఖండమనే కొంత భాగాన్ని సంస్కృతం నుంచి ఇంగ్లీషులోకి చేశా. దాదాపు నా పదేళ్ళ శ్రమ, పరిశోధన ఫలితంగా రౌట్లెజ్‌... ఆక్స్‌ఫర్డ్‌ ప్రెస్‌ వాళ్ళు సంయుక్తంగా ‘హిందూ పిలిగ్రిమేజ్‌’ అంటూ శ్రీశైలంపై ఒక పుస్తకం ప్రచురించారు. క్రీస్తు శకం పన్నెండు నుంచి పదిహేడో శతాబ్దం దాకా తెలుగునాట ఉన్న యోగ, తాంత్రిక సంప్రదాయాలపై నా రెండో పుస్తకం ‘యోగా అండ్‌ తంత్ర’ త్వరలోనే వెలికి రానుంది. తెలంగాణ వచ్చాక ఇవే మొదటి సభలు కావడం, ఇక్కడ వాళ్ళందరినీ కలుపుకొని చేయాలనుకోవడం, ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడంతో వీటిని ఎకడెమిక్‌ కాన్ఫరెన్స్‌లా చేయడం కుదిరినట్లు లేదు. కానీ, వచ్చేసారి చేస్తున్నప్పుడు పరిశోధకులకూ, విదేశాల్లో విశేష కృషి చేస్తున్నవారికీ ప్రత్యేకంగా ఆ అంశాలు చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ఇప్పటి దాకా ఐడెంటిటీ క్రైసిస్‌ ఉన్న తెలంగాణ సామాన్య జనం కూడా ఈ సభలు జరుగుతున్నందుకు, తమ ప్రాంతపు సాహిత్యానికీ, వ్యక్తులకూ గుర్తింపు వస్తున్నందుకూ సంతోషంగా ఉన్నారు! 
- డాక్టర్‌ ప్రభావతి సి. రెడ్డి, ప్రొఫెసర్‌, అమెరికా
 
మద్దతు కావాలి..!
తెలంగాణ ఉద్యమానికి కొంతమంది ఆంధ్ర రచయితలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర రచయితలు బేషరతు మద్దతుగా నిలిచారు. గతంలో సాహిత్య వేదికలన్నీ పూర్తిగా ఆంధ్ర వారితో నిండిపోయిన్న సందర్భం ఉంది. ఆ తర్వాత ఉద్యమ సమయంలో వేదికలన్నీ పూర్తిగా తెలంగాణ వారితో నిండిపోయిన్న సందర్భాలున్నాయి. ఆంధ్ర, రాయలసీమ వారందరితో కలిసి ఒకే వేదిక పంచుకుంటున్న వైనం ఈ సందర్భంలో కనిపిస్తోంది. మా ప్రాంతంలో సాహిత్య ఉద్యమ స్తబ్ధతని ప్రజా ఉద్యమ సాహిత్యంతో పూరించాల్సి ఉంది. ఏ ప్రాంతంలోని సమస్యలనైనా సాహిత్య వస్తువులుగా స్వీకరించడానికి ప్రాంతీయ బేధాలు ఉండకూడదు. తెలంగాణ ఉద్యమ పోరాటానికి కొంత మంది ఆంధ్ర రచయితలు మద్దతుగా నిలిచినట్టే, ఆ ప్రాంతంలోని ప్రజా ఉద్యమాలకు తెలంగాణ ప్రాంతం వారు మద్దతు తెలపాల్సి ఉంటుంది.
- డా. కె.ఎన్‌.మల్లీశ్వరి, రచయిత్రి, విశాఖపట్నం
 
 
లండన్‌లో బడి కోసం కొట్లాడుతున్నా!
నాకు తెలుగంటే చాలా ఇష్టం. నా స్వస్థలం నల్గొండ. ఉద్యోగరీత్యా 1970లో లండన్‌లో స్థిరపడ్డాను. ప్రస్తుతం లేబర్‌ పార్టీ నుంచి ‘లంబెథ్‌’కి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాను. 2014లో డిప్యూటీ మేయర్‌, 2016లో మేయర్‌గా కూడా పనిచేశాను. అక్కడ తెలుగు వారు చాలామంది ఉన్నారు. అక్కడ ‘‘ప్రభుత్వ ఉత్తర్వులు తమిళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ భాషల్లో తర్జుమా చేస్తారు. మరి తెలుగులో మాత్రం ఎందుకు అనువదించరు?’’ అని నేను అక్కడి ప్రభుత్వంతో కొట్లాడుతున్నాను. రాజకీయంగా నేను ఏ సమావేశానికి వెళ్లినా, అక్కడ మొదట నా మాతృభాషలో అందరినీ ‘‘నమస్కారం’’ అని పలకరిస్తాను. ఆ తర్వాత ఆ పదం విలువను వివరిస్తాను. నాకు తెలుగు భాష  అన్నా, సంస్కృతి అన్నా అంత ఇష్టం. మరో తెలుగు మహిళ గీత కూడా అక్కడ కౌన్సిలర్‌గా ఎంపికైంది. లండన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా తెలుగు పిల్లల కోసం తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించమని అడుగుతున్నాం. ఆ ప్రయత్నం త్వరలో సఫలీకృతమవుతుందని భావిస్తున్నాను. ‘బతుకమ్మ’, ‘దసరా’, ‘ఉగాది’ లాంటి పండుగల సందర్భంగా తెలుగువారందరూ కలుస్తారు. మహిళలందరం కలిసి ‘బతుకమ్మ’ వేడుకను ఘనంగా జరుపుకొంటాం. నేను పలు రేడియో కార్యక్రమాల్లో వ్యాఖ్యాత్రిగా పనిచేశాను. లండన్‌ రాజకీయాల్లో తెలుగువారి ప్రాతినిధ్యం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అక్కడ స్త్రీ, పురుష సమానత్వం ఉంటుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. నా సొంతూరికి వచ్చి, నా వాళ్లందరినీ కలవడం సంతోషం కలిగించింది. ఈ ఐదు రోజుల నుంచి ప్రతి కార్యక్రమాన్నీ వీక్షిస్తున్నాను. ఇన్ని పనుల ఒత్తిడిలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నన్ను గుర్తుపట్టి ప్రత్యేకంగా అభినందించడం ఆనందంగా ఉంది. ఈ సభలకు హాజరైనందుకు గర్వపడుతున్నాను. 
 -సలెహా జాఫర్‌, మాజీ మేయర్‌, లండన్‌
 
వెంకటేశ్‌, ఫొటోలు: రాజేష్‌ జంపాల