Vizag-Village-man-as-scientist-in-Beijing

గొండుపాలెం టు బీజింగ్

 

గ్రామీణ ప్రాంతంలో పుట్టి... చైనాలో శాస్త్రవేత్తగా
ప్రతిభ చూపుతున్న తెలుగు యువకుడు
పలు అంశాలపై దేశవిదేశాల్లో పరిశోధనలు
ప్రముఖ విద్యా సంస్థల్లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా విధులు
2015లో చైనా నుంచి ఆహ్వానం
బీజింగ్‌లోని రీసెర్చి ప్రాజెక్టులో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్‌ బండారు సతీష్‌ 

గొండుపాలెం(కె.కోటపాడు), విశాఖపట్టణం, మార్చి 4:మండలంలోని గొండుపాలెం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అతను, ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తిచేశారు. ఇంటర్‌, డిగ్రీ అనకాపల్లిలో చదివారు. ఆర్గానిక్‌ కెమిస్ట్రిలో పీజీ చేసి, నెట్‌ ద్వారా ఐఐటీకి ఎంపికై పీహెచ్‌డీ పూర్తి చేశారు. తరువాత ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇండో యూరోపియన్‌ ప్రాజెక్ట్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా చేరారు. అనంతరం దేశ, విదేశాల్లో పేరెన్నికగన్న ఉన్నత విద్యా సంస్థల్లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేస్తే, పరిశోధనలు నిర్వహించారు. ఐరన్‌ ఆక్సైడ్‌తో సోలార్‌ ప్యానల్స్‌ను ఉపయోగించడంపై చేసిన పరిశోధన వివరాలను చైనా ప్రభుత్వానికి పంపారు. 2015లో ఆ దేశం ఆహానం మేరకు బీజింగ్‌లోని రీసెర్చి ప్రాజెక్టులో శాస్త్రవేత్తగా చేరారు. ప్రస్తుతం అక్కడే పనిచేస్తే, సెలవుపై స్వగ్రామానికి వచ్చిన  డాక్టర్‌ బండారు సతీష్‌ను ‘ఆంధ్రజ్యోతి’ కలిసింది. బాల్యం, విద్యాభ్యాసం, పరిశోధనలు, చైనా ఆహ్వానం, అక్కడ శాస్త్రవేత్తగా పనిచేయడంపై అనుభవాలు ఆయన మాటల్లోనే.... 
 
మాది గొండుపాలెం. నాన్న బండారు వెంకన్నపాత్రుడు, అమ్మ వెంకటలక్ష్మి. నేనొక్కడినే సంతానం. మాది సాధారణ రైతు కుటుంబం. ప్రాథమిక విద్య స్వగ్రామంలో, ఉన్నత విద్య కె.కోటపాడు జడ్పీ హైస్కూల్‌లో పూర్తిచేశాను. ఇంటర్‌, డిగ్రీ(బీఎస్‌సీ) అనకాపల్లిలో పూర్తి చేశాను. 2000వ సంవత్సరంలో ఆసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఏయూలో ఆర్గానిక్‌ కెమిస్ర్టీలో చేరాను. 2002లో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) ద్వారా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో పీహెచ్‌డీలో చేరాను. ఇది పూర్తయిన తరువాత జర్మనీలో డాడ్‌ (డీఏఏఏడీ) ప్రాజెక్ట్‌లో చేరాను. 2010లో భారత్‌కు తిరిగి వచ్చి, ఏడాదిపాటు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇండో యూరోపియన్‌ ప్రాజెక్ట్‌లో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పనిచేశాను. 2011లో జర్మనీలోని యూనివర్సిటీలో, 2012లో ఐర్లాండ్‌లోని యూనివర్సిటీలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా పని చేశాను. ఐర్లాండ్‌ యూనివర్శిటిలో పనిచేస్తున్న సమయంలోనే పెట్రోల్‌కి బదులుగా కెమికల్‌ మెథడ్స్‌ ద్వారా హైడ్రోజన్‌ గ్యాస్‌ను ఇంధనంగా వినియోగించవచ్చు అనే అంశంపై ప్రయోగం చేశాను. 2014లో ఇండియాకు తిరిగివచ్చి ముంబై ఐఐటీలో బయోమెటల్‌ ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌పై ప్రొఫెసర్‌ సి.పి.రావుతో కలిసి పరిశోధనల్లో పాలుపంచుకున్నాను. తక్కువ ఖర్చుతో ఐరన్‌ ఆక్సైడ్‌తో సోలార్‌ ప్యానల్స్‌ను ఉపయోగించడంపై చేసిన పరిశోధన ప్రాజెక్టును చైనా ప్రభుత్వానికి పంపాను. బీజింగ్‌లోని రీసెర్చి ప్రాజెక్టులో శాస్త్రవేత్తగా పనిచేయాలని 2015లో చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. అప్పటి నుంచి  అక్కడే సైన్‌టిస్టుగా పనిచేస్తున్నాను. పరిశోధనలకు సంబంధించి ఇప్పటి వరకు 35 జర్నల్స్‌ ప్రచురితం అయ్యాయి. నేను చేస్తున్న పరిశోధనలకుగాను 2017-18 సంవత్సరానికి అంతర్జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డుతోపాటు రూ.40 లక్షల నగదు పురస్కారాన్ని అందజేసింది.