Vijayanagaram-Nri-service-to-own-Village

ప్రవాస ‘శ్రీమంతుడు’

పుట్టిన ఊరుపై విజయనగరం జిల్లా వైద్యుడి మమకారం

విదేశాల్లో ఉంటున్నా.. గ్రామ ప్రజల సంక్షేమానికి కృషి
35 లక్షలతో 110 గృహ నిర్మాణాలు

గరుగుబిల్లి(విజయనగరం), జనవరి 8: పుట్టిన ఊరు కన్నతల్లిలాంటిది అంటారు. మరి.. మన ఊరు కోసం ఏదైనా చేయాలనే తపన ఎంతమందికి ఉంటుంది? ఆయన మాత్రం దేశం కాని దేశంలో ఉంటున్నా.. పుట్టిన ఊరును మరిచిపోలేదు. ఎంత ఎత్తుకెదిగినా.. అక్కడి పేద ప్రజల కష్టాలు అతడి మనోఫలకం నుంచి పోలేదు. సొంతూరు అభివృద్ధికి అహరహం శ్రమిస్తున్నాడు. ఆయనే విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు ద్వారపురెడ్డి కృష్ణమోహన్‌. అమెరికాలో కార్డియాలజిస్టుగా స్థిరపడ్డారు. ఏడాదికోమారు భార్యాపిల్లలతో కలిసి తాను పుట్టిన కొత్తూరు కొస్తారు. అక్కడ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటారు.
 
కొత్తూరులో దళితులకు చెందిన ఇళ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో 2011లో రూ.35 లక్షలతో 110 కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారాయన. ఊళ్లో రెండు మందిరాల నిర్మాణాల కోసం రూ.5 లక్షలు, తాగునీటి పథకానికి 2 లక్షలు అందించారు. ఏపీలోనే కొత్తూరును మోడల్‌ గ్రామంగా తీర్చిదిద్దాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. కాగా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏటా పలు గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా చూస్తున్నారాయన. పుట్టపర్తిలో పేదలకు శస్త్ర చికిత్సలు కూడా చేస్తుంటారు.
 
 
పేదలకు సాయం చేస్తే గొప్ప సంతృప్తి
‘‘పెద్ద కుటుంబంలో జన్మించినా కొంతవరకు నేనూ పేదరికం అనుభవించాను. అందుకే పేదలంటే నాకు అభిమానం. మా చదువుల కోసం తల్లిదండ్రులు పడిన కష్టాలను మరిచిపోలేదు. పేదరికంలో ఉన్న వారికి సాయం అందించినప్పుడల్లా గొప్ప సంతృప్తి కలుగుతుంది’’
- డాక్టర్‌ కృష్ణమోహన్‌