UDIPI-BORN-ORPHAN-IS-NOW-MEMBER-OF-PARLIAMENT-IN-SWITZERLAND

ఉడిపిలో అనాథ.. నేడు స్విస్‌ పార్లమెంటేరియన్‌

బెంగళూరు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):ఇది దాదాపు 40 సంవత్సరాల క్రితం నాటి మాట.. 1970వ సంవత్సరం మే ఒకటో తేదీ.. ఉడిపీలోని బసేల్ మిషన్ ఆసుపత్రిలో ఓ మహిళ పండంటి బాబుకు జన్మనిచ్చింది. కారణాలు ఏవో గానీ.. ఎవరూ లేని సమయం చూసి బాబును ఆసుపత్రిలోనే వదిలేసి ఆ తల్లి వెళ్లిపోయింది. ఆ తల్లి కోసం వెతికి, కావాలనే వదిలేశారనే నిర్ణయానికి వచ్చేసిందా మిషనరీ. కేరళలోని కన్నూరు జిల్లాలో థలస్సెరీలో ఓ అనాథ శరణాలయాన్ని నిర్వహించే వారికి ఈ విషయం తెలిసి ఆ బాబును తమ వద్దకు తెచ్చుకుంది. స్విడ్జర్లాండ్‌కు చెందిన ఫ్రిట్జ్ గుగ్గర్, ఎలిజబెత్ గుగ్గర్ దంపతులు ఎప్పటి నుంచో ఆ అనాథ శరణాలయ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకుని, ఆ బాబును దత్తత తీసుకుని తమ స్వదేశమయిన స్విడ్జర్లాండ్‌కు తీసుకెళ్లారా దంపతులు. 

కర్ణాటకలోని పవిత్రస్థలం ఉడిపిలోని మిషన్‌ ఆసుపత్రిలో 4 దశాబ్దాల క్రితం ఓ తల్లి వదిలేసిన అనాథ శిశువు అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ పార్లమెంటేరియన్‌ స్థాయికి చేరారు. నిక్లాస్‌ నిక్‌ శామ్యుయేల్‌ గుగ్గర్‌ (47) స్విట్లర్లాండ్‌లో ఇవాంజిలికల్‌ పీపుల్స్‌ పార్టీ(ఈపీపీ) అభ్యర్థిగా 2017 నవంబరు 27న నేషనల్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఎన్నికయ్యారు. స్విట్జర్లాండ్‌ పార్లమెంటులో ప్రవేశించిన అతి చిన్నవయస్కుడిగా, తొలి భారతీయుడిగా నిక్లాస్‌ రికార్డు సృష్టించారు. ఆయన 2018 ఆరంభంలో భారత్‌కు వస్తున్నారు.
 
‘పుట్టి కొన్ని గంటలకు కూడా గడవకముందే నా తల్లి నన్ను వదిలేసిందని నాకు తెలుసు. ఎంతో బలమైన కారణం ఉంటే కానీ ఏ తల్లయినా ఇంతటి కఠిన నిర్ణయానికి రాదు. నా తల్లికి కూడా అప్పుడు అలాంటి కష్టమే వచ్చిందనుకుంటా. అందుకే నన్ను పురిట్లోనే వదిలేసింది. నన్ను కన్న తల్లి ఎవరో, ఎక్కడ ఉంటోందో కనుక్కునే ప్రయత్నం నేను చేయను. నేను అలాంటి ప్రయత్నాలు చేసి ఆమెను కలిస్తే అప్పుడు తాను చేసిన పనికి ఇప్పుడు బాధపెట్టాల్సి వస్తుంది. లేదా ఆమె కుటుంబంలో కొత్త సమస్యలు రావచ్చు. కనకపోయినా.. విదేశీయులయినా నన్ను కడుపులో పెట్టుకుని పెంచారు. వాళ్లే నాకు నిజమైన అమ్మానాన్నలు..’ అని శామ్యుయేల్‌ గుగ్గర్‌ అంటున్నారు. ఆయన తండ్రి ఫ్రిట్జ్ గుగ్గర్ ఇప్పటికీ కేరళలోని థలస్సెరీలోని అనాథ శరణాలయంతో సత్సంబంధాలను నెరుపుతున్నారు. ఇండియా- స్విడ్జర్లాండ్ ఫ్రెండ్‌షిప్ సెలబ్రేషన్ 70వ వార్షికోత్సవంలో శామ్యుయేల్ గుగ్గర్ పాలుపంచుకోనున్నారు.