:: Welcome to NRI - Article ::

అమెరికాలో తెలుగు యువకుడి ఘనత

ఉప్పునీటిని మంచినీటిగా మార్చొచ్చు

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 5: తక్కువ ఖర్చుతో ఉప్పునీటిని తాగునీటిగా మార్చవచ్చని అమెరికాలోని ఓ హైస్కూలు విద్యార్థి నిరూపించాడు. ఈ ఆవిష్కరణతో పెద్ద పెద్ద కంపెనీలు, యూనివర్సిటీల దృష్టిని ఆకర్షించిన ఆ విద్యార్థి పేరు చైతన్య కారంచేడు.. భారత సంతతికి, అందులోనూ తెలుగువాడు కావడం విశేషం! అమెరికాలోని పోర్ట్‌లాండ్‌లో చైతన్య తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. స్థానిక జెసూట్‌ హైస్కూల్‌లో చదువుతున్నాడు. సైన్స్‌ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా ఈ వినూత్న పద్ధతిని కనుగొన్నాడు. ప్రపంచంలో తాగునీటి సమస్యను లేకుండా చేయాలనే ఆలోచనే తనకీ స్ఫూర్తినిచ్చిందని చైతన్య చెబుతున్నాడు. ‘‘ఈ విశ్వంలో 70 శాతం నీరే ఉన్నా.. భూమ్మీద ఉన్న ప్రతీ ఎనిమిది మందిలో ఒకరికి పరిశుభ్రమైన తాగునీరు దొరకడం లేదు. ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్న నీటిలో ఎక్కువ శాతం సముద్రపు నీరే! ఈ ఉప్పునీటినే తాగునీరుగా మారిస్తే సమస్య తీరిపోతుంది కదా అనుకున్నాను. అయితే, ఇప్పటికే ఈ తరహా పరిశోధనలు జరిగాయి. పరిష్కారమూ దొరికింది.

 కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనికి చవకైన, తేలికైన పరిష్కారం కోసం చేసిన ప్రయత్నమే ఈ ఆవిష్కరణ’’ అని చెప్పాడు. సాధారణంగా సముద్రపు నీటిలో కేవలం పది శాతం పూర్తిస్థాయిలో ఉప్పుతో నిండిపోయిందని, మిగతా 90 శాతం ఫ్రీ గానే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఇప్పటి దాకా జరిగిన పరిశోధనలు మాత్రం కేవలం ఈ పది శాతం నీటిని మంచినీటిగా ఎలా మార్చాలనే ఆలోచనతోనే జరిగాయి తప్ప మిగతా 90 శాతాన్ని పట్టించుకోలేదని చైతన్య వివరించాడు. ఉప్పు నీటితో పూర్తిగా కలిసిపోయిన నీటిని వదిలేసి మిగతా నీటిపై దృష్టిపెట్టడంతో తనకీ పరిష్కారం లభించిందని తెలిపాడు. ఈ ఆవిష్కరణకుగానూ చైతన్య యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ నుంచి 10 వేల డాలర్ల రివార్డును అందుకున్నాడు. ఎంఐటీ నిర్వహించిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెయిర్‌లో ఈ ప్రాజెక్టు ద్వితీయ స్థానం దక్కించుకుంది. కాగా, ఈ పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగించడానికి అవసరమయ్యే ఆర్థిక సాయం అందిస్తామంటూ పెద్ద పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయట!

 

Loading...