:: Welcome to NRI - Article ::

ఫిన్‌ల్యాండ్‌లో మన వాణి

ఆంధ్రజ్యోతి, 18-07-2017: ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని గాఢంగా నమ్మిన వ్యక్తుల్లో వాణీరావు ఒకరు. విదేశాంగ శాఖలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి తాజాగా ఫిన్‌ల్యాండ్‌ రాయబారిగా నియమితులయిన వాణీరావు పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో. ఒక దేశానికి రాయబారిగా నియమితురాలయిన తొలి తెలుగు మహిళ కూడా వాణీరావే! ఫిన్‌ల్యాండ్‌కు వెళ్లే ముందు హైదరాబాద్‌కు వచ్చిన వాణీరావును ‘నవ్య’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

 
‘‘నేను పుట్టింది.. పెరిగింది.. చదివింది- అంతా హైదరాబాద్‌లోనే. మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్నలకు మేము ముగ్గురం. నాన్నది గుత్తి అనే గ్రామం. చాలా కష్టపడిపైకి వచ్చారు. నాన్న చిన్నప్పుడు స్కూలుకు వెళ్లటానికి చెప్పులు కూడా ఉండేవి కావట. మాకు అన్ని కష్టాలు తెలియవు కానీ ఖర్చు పెట్టడానికి పెద్దగా డబ్బులుండేవి కావు. సంవత్సరానికి రెండు మూడు డ్రస్సులు.. అప్పుడప్పుడు సినిమాలు.. ఏవైనా ఊరు వెళ్లాలంటే థర్డ్‌ క్లాస్‌లో రైలు ప్రయాణం. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు ఆంధ్రప్రదేశ్‌లోని టూరిస్ట్‌ ప్రాంతాలన్నీ తిప్పి చూపించారు. అమ్మ దృష్టి అంతా మా ముగ్గురి మీదే ఉండేది. తను గ్రాడ్యుయేషన్‌ దాకా చదివింది. అయినా మా చదువుల కోసం ఉద్యోగంలో చేరలేదు. మా అవసరాలు చూడటానికి ఇంట్లోనే ఉండిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్‌ని. ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఫ్రెండ్స్‌ కూడా ఎక్కువ ఉండేవారు కాదు. బాగా చదివేదాన్ని. అందువల్ల టీచర్లకు నేను ఫేవరెట్‌ని. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌ ‘సెయింట్‌ పాయి్‌స’లో హైస్కూలు దాకా చదివా. ఆ తర్వాత సెయింట్‌ ఫ్రాన్సి్‌సలో చదివా. నాన్నకు నన్ను డాక్టర్‌ను చేయాలని ఉండేది. కానీ నాకు హ్యుమానిటీస్‌ అంటే ఇష్టం. అందుకే డిగ్రీలో బి.ఏలో చేరా. ఆ తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఏ చేశా. నాన్న ప్రోత్సాహంతో సివిల్‌ సర్వీసెస్‌ రాశా. ఐఏఎస్‌ మూడు ర్యాంకుల్లో తప్పిపోయింది. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌‌) వచ్చింది. మా ఇంటి మొత్తం మీద సివిల్‌ సాధించింది నేను ఒక్కతినే. నాకు ఐఎఫ్‌ఎస్‌ రావటానికి కారణం- నా తెలివితేటలు ఒకటే కాదు. అమ్మానాన్న, ఫ్రెండ్స్‌, చుట్టాల ప్రోత్సాహం కూడా ఉంది. ఈ విషయం ఎప్పుడు గుర్తుతెచ్చుకుంటూనే ఉంటా!
 
అమెరికా అధ్యక్షుడి థ్యాంక్స్‌!
నేను సర్వీసులో చేరే సమయానికి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయి మూడేళ్లు అయింది. నా మొదటి పోస్టింగ్‌ మెక్సికోలో! అది కూడా మనలాంటి దేశమే. సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ- ఇలా అన్నీ మన దేశంలో మాదిరిగానే ఉండేవి. అందువల్ల నాకు పెద్దగా కల్చర్‌ షాక్‌ అనిపించలేదు. ఆ తర్వాత స్వీడన్‌ వెళ్లా. యూర్‌పలో ధనిక దేశాల్లో ఇది కూడా ఒకటి. వారికీ బలమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. కానీ కన్జ్యూమరిజమ్‌ చాలా ఎక్కువ. వారిలో ఏదో ఒకటి కొత్తగా కనిపెట్టాలనే తపన కూడా ఎక్కువ. పేదరికం తక్కువ. మన దేశంలో పేదరికం రకరకాల రూపాల్లో ఉంటుంది. దీనిని చూసిన నాకు షాక్‌ తగిలింది. మన దేశానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన మరింత బలపడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌లో డిప్యూటీ అంబాసిడర్‌గా, ఢిల్లీ హెడ్‌ ఆఫీసులో ఆసియాన్‌ డెస్క్‌లో, యూఎస్‌, కెనడా డెస్క్‌ డైరక్టర్‌గా, ఓవర్‌సీస్‌ ఇండియన్‌ ఎఫైర్స్‌ ఇన్‌ఛార్జిగా పనిచేశా. వీటిలో మర్చిపోలేని అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నేను యూఎస్‌, కెనడా డెస్క్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ఒబామా పర్యటన నిర్వహణ బాధ్యత నాపై పడింది. ఆ పర్యటనలో భారత్‌-అమెరికాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల రూపకల్పనలో పాల్గొనటమే కాకుండా- ఒబామా, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ల మధ్య జరిగిన సమావేశంలో నేను కూడా పాల్గొన్నా. ఒబామా తిరిగి వెళ్లిపోయిన తర్వాత- నాకు ఒక రోజు ఆయన దగ్గర నుంచి- ఏర్పాట్లు బాగా చేసినందుకు థ్యాంక్స్‌ చెబుతూ ఒక ఉత్తరం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు నాకు ఉత్తరం రాయటం పెద్ద సర్‌ప్రైజ్‌! అలాంటి మరొక అనుభవం ఇజ్రాయెల్‌ ఒకప్పటి అధ్యక్షుడు షిమాన్‌ పిరెస్ ను కలవటం! ఇలాంటి అవకాశాలు నాకు వ్యక్తిగతంగా వచ్చినవి కావు. నా హోదా వల్ల వచ్చినవి. ఆ హోదాలో నేను ఉండటం అదృష్టమనే చెప్పాలి కదా.
 
గ్లాస్‌ సీలింగ్‌..
నేను సర్వీసె్‌సలో చేరినప్పుడు నా బ్యాచ్‌లో 16 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురం అమ్మాయిలం. అంటే మూడొంతుల మంది అమ్మాయిలే! విదేశాంగ శాఖలో ఇప్పటికీ ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. విదేశాంగ శాఖలో పురుషులకు, స్త్రీలకు ఒకే విధమైన అవకాశాలుంటాయి. వాటిని అందుకుంటామా? లేదా? అనేది మనపై ఆధారపడి ఉంటుంది. కావాలంటే క్లిష్టమైన ఎసైన్‌మెంట్స్‌ తీసుకోవచ్చు. లేకపోతే డెస్క్‌ జాబ్‌తోనూ సరిపెట్టుకోవచ్చు. స్త్రీ, పురుషుల మధ్య వివక్ష అయితే ఉండదు. అయితే చాలా సందర్భాలలో మేము పురుషులకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించటానికి మహిళలే ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. విదేశాంగ వ్యవహారాలలో నెట్‌వర్కింగ్‌ ఒక కీలకమైన అంశం. మహిళలు ఈ పని చేయగలరా? అనే ప్రశ్న కొందరిలో తలెత్తుతూ ఉంటుంది. కానీ నా దృష్టిలో ఇది కష్టం కాదు. ఢిల్లీలో ఉన్నప్పుడు నెట్‌వర్కింగ్‌ అవసరం ఉండదు. కానీ విదేశాల్లో తప్పనిసరి. విదేశాంగ శాఖలో మహిళలకు కొన్ని అదనపు అవకాశాలుంటాయి. ఉదాహరణకు ఇరవై మంది కూర్చున్న గదిలో ఒక్కరే మహిళ ఉందనుకుందాం. అప్పుడు అందరి దృష్టీ ఆమెపై తప్పనిసరిగా పడుతుంది. ఆమె చెప్పింది తప్పనిసరిగా వింటారు. ఇలాంటి సానుకూల దృక్పథంతో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విధంగా గ్లాస్‌సీలింగ్‌ను ఛేదించిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. చొకిలా అయ్యర్‌, నిరుపమా రావు వంటి వారు విదేశాంగ శాఖ సెక్రటరీలుగా బాధ్యతలు నిర్వహించారు. దీపా వాధ్వా కఠినమైన ఎసైన్‌మెంట్‌గా భావించే ఖతర్‌ అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వహించారు. లెబనాన్‌ రాయబారిగా అనితా నాయర్‌ వ్యవహరించారు. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు.
 
వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌
నాకు ఇల్లు, ఆఫీసు- ఈ రెండూ తప్ప వేరే వ్యాపకాలేమీ లేవు. ఢిల్లీలో హెడ్‌ ఆఫీసులో పనిచేస్తుంటే కొద్దిగా ఒత్తిడి తక్కువుంటుంది. ఇక విదేశాల్లో అయితే ట్వంటీఫోర్‌బై సెవన్‌. నా దృష్టిలో ఇల్లు, ఆఫీసు - వేర్వేరు! ఈ రెండింటినీ విడదీసి చూడాలి. వేరుగా సమయం కేటాయించాలి. నేను ఏ రోజూ ఆఫీసులో జరిగిన విషయాలేమీ ఇంట్లో మాట్లాడను. ఇది ఒక అలవాటుగా మారితే- దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలుంటాయి. నా భర్త నరసింగరావు- రెన్యూవబుల్‌ ఎనర్జీ సెక్టారులో పనిచేస్తారు. ఆయన నాకు చాలా సహకరిస్తారు. నా కెరీర్‌లో ఏవో సాధించేయాలనే అత్యాశ నాకు ఎప్పుడూ లేదు. చేసిన పని బాగా చేయాలి.. అది అందరికీ ఉపయోగపడాలని మాత్రమే భావిస్తాను. ఆయన కూడా అంతే! అందువల్ల మాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులూ లేవు. విదేశీ ఎంబసీల్లో పనిచేస్తున్నప్పుడు- మనం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాం. అందువల్ల కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు పండగలు జరిగితే సంప్రదాయ దుస్తులు ధరించాలి. కొన్నిసార్లు పార్టీలకు వెళ్లాలి.. ఇలాంటి వాటికి మా అమ్మాయి కూడా అలవాటుపడిపోయింది.
 
మిడిల్‌ క్లాస్‌ల్లో తేడా..
ఒకప్పుడు మధ్యతరగతికీ.. ఇప్పటికీ తేడా ఉంది. అప్పుడు తల్లితండ్రులు తమకు ఏవో కొని ఇస్తారనే ఆశ పిల్లలకు ఉండేది కాదు. పిల్లల పట్ల కూడా తల్లితండ్రులకు అత్యాశలుండేవి కావు. ఇప్పుడు సాధారణ మధ్యతరగతి పిల్లలలో అవగాహన బాగా పెరిగింది. ఇంటర్నెట్‌ వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న రకరకాల సంస్కృతులు వారికి తెలుస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటి పిల్లలు- ప్రపంచ సంస్కృతిలో పెరుగుతున్నారు. దీని వల్ల కొన్ని లాభాలున్నాయి. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. పిల్లలకు ఒత్తిడి లేకుండా చూస్తూనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించాల్సిన బాధ్యత తల్లితండ్రులదే! ఇక సివిల్‌ సర్వీసెస్‌ విషయానికి వస్తే- ఉత్తర భారత దేశంలో ఈ ఉద్యోగాలపై అవగాహన ఎక్కువ. మన దగ్గర ఇంకా ఇంజినీరింగ్‌, మెడిసిన్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ వేతనాలుండేవి కాదు. పే కమిషన్లు వచ్చిన తర్వాత పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్ల మధ్య వేతనాల్లో పెద్దగా తేడా ఉండటం లేదు. అందువల్ల మన దగ్గర ఉన్న యువతీ యువకులు సివిల్‌ సర్వీసె్‌సపై దృష్టి పెడితే మంచిది. ప్రస్తుతం ఫిన్‌ల్యాండ్‌లో నాకు మూడేళ్లు పోస్టింగ్‌ ఉంది. ఆ తర్వాత మరో సారి వేరే దేశంలో రాయబారిగా పనిచేసే అవకాశం ఉంటుందేమో! ఆ తర్వాత మళ్లీ ఢిల్లీ వచ్చేస్తా. నా కెరీర్‌ పూర్తయిన తర్వాత సెటిల్‌ అయ్యేది మాత్రం హైదరాబాద్‌లోనే! ఎందుకంటే ఐ లవ్‌ హైదరాబాద్‌!
 
 నాకు స్ర్టెస్‌బస్టర్స్‌ నా కుటుంబం, స్నేహితులే! ఇంటికి సంబంధించిన విషయాలైతే నా భర్తతో చర్చిస్తా. ఇక వృత్తిపరమైన విషయాలైతే నాకు కొంత మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. వారితో చర్చిస్తా!

విదేశాలతో పోలిస్తే ఢిల్లీలో పనిచేయటమే కష్టం. ఎందుకంటే ఇక్కడ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అనుక్షణం ఏదో ఒక ఒత్తిడి ఉంటుంది.

ప్రవాస భారతీయులు ఎన్ని పెట్టుబడులు పెడుతున్నారు? ఎక్కడ పెడుతున్నారు? అనే కచ్చితమైన సమాచారం మన దగ్గర లేదు. ఈ సమాచారాన్ని సేకరించగలిగితే విధానపరమైన నిర్ణయాలలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఫిన్‌ల్యాండ్‌తో పాటుగా ఎస్టోనివా అనే దేశానికి కూడా నన్నే రాయబారిగా నియమించారు. నా పత్రాలు వచ్చే నెల ఫిన్‌ల్యాండ్‌ అధ్యక్షుడికి సమర్పిస్తాను. ఇప్పటి దాకా ప్రధాని మోదీ బాల్టిక్‌ దేశాలలో పర్యటించలేదు. నేను రాయబారిగా ఉన్న సమయంలో అక్కడికి వస్తే బావుండుననుకుంటున్నా. ఇక ఫిన్‌ల్యాండ్‌ అభివృద్ధి చెందిన దేశం. పరిశోధనల విషయంలో వారు చాలా ముందు ఉన్నారు. నోకియా వంటి కంపెనీలు అక్కడివే! మన కంపెనీలకు ఆ దేశంలో ఎలాంటి అవకాశాలున్నాయి? అక్కడ కంపెనీలకు మన దేశంలో ఉన్న అవకాశాలు ఎలా పరిచయం చేయాలనే విషయంపై దృష్టి పెడతా. దాంతో ఎంతటి ఒత్తిడైనా హుష్‌కాకి!
 
- సివిఎల్‌ఎన్‌, ఫోటోలు: రాజ్‌కుమార్‌

 

Loading...