Telugu-woman-successful-story-in-UK

నృత్య రాగసుధ.. బ్రిటన్‌లో భారతీయ వనిత

బ్రిటన్‌కీ, భారతదేశానికీ విద్యావిధానాల్లో, బోధన ప్రణాళికలో చాలా తేడాలున్నాయి. భారతదేశంలో అరటిపండు ఒలిచి, చేతిలో పెట్టినట్టు చదివిస్తూ ఉంటాం విద్యార్ధుల్ని. కానీ, బ్రిటన్‌లో అవగాహన ప్రక్రియ అంతా పరిశోధన, పరిశీలన ఆధారంగా ఉంటుంది.

ఇంటి పని... వంట పని... ఆఫీసు పని... ఇష్టమైన సొంత పని... ఇన్నీ విసుగూ విరామం లేకుండా చేయడం మహిళలకే చెల్లిన మల్టీ టాస్కింగ్‌! ఏ దేశమేగినా... ఎందుకాలిడినా... భారతీయ వనిత ఈ మల్టీ టాస్కింగ్‌కి మచ్చుతునకే! కావాలంటే... లండన్‌లో ఉంటున్న ప్రవాస తెలుగు వనిత వింజమూరి రాగసుధను కలవండి. ఆమె డబుల్‌ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌... భరతనాట్య కళాకారిణి... యూనివర్సిటీలో అధ్యాపకురాలు... స్కూళ్ళలో పిల్లలకు వర్క్‌షాపుల నిర్వాహకురాలు... మూడొందల ఏళ్ళ క్రితం నాటి ప్రాచీన తెలుగు పత్రాల గ్రంథాన్ని బ్రిటీషు లైబ్రరీ నుంచి బాహ్యప్రపంచంలోకి తెచ్చిన శోధకురాలు... బ్రిటీషు పార్లమెంట్‌ హౌస్‌లలో ఇప్పటికి ఏడుసార్లు నృత్య ప్రదర్శన ఇచ్చి, రికార్డుకెక్కిన సాంస్కృతిక తేజం... పధ్నాలుగేళ్ళ క్రితం విదేశాలకు వెళ్ళినా, మూలాలు మర్చిపోని ఈ సంప్రదాయ సంగీత, సాహిత్య, నృత్య రాగసుధామయి ఆంధ్రజ్యోతితో పంచుకున్న ముచ్చట్లు...
 
నేను పెరిగింది, చదువుకున్నది, కొన్ని సంవత్సరాలు అధ్యాపకురాలిగా ఉద్యోగం చేసింది అంతా హైదరాబాదులోనే. దేశానికి రాణియైునా తల్లికి ముద్దుబిడ్డే అన్నట్లు, పన్నెండేళ్ళుగా లండన్‌లో ప్రవాసం అయినా, నాకు ఇప్పటికీ తెలుగుగడ్డ మీద, తెలుగు భాష మీద మమకారం తగ్గలేదు. సన్నిహితులు, బంధువులు అంతా ఇక్కడే. అందుకే, ఇప్పటికీ తరచుగా ఇండియాకు వస్తూనే ఉంటా.
 
చిన్నప్పటి నుంచి...
బ్రిటన్‌ లోనూ ఇవాళ నా గురించి చెప్పుకుంటున్నారంటే... ఇదంతా మన సంప్రదాయ లలిత కళల పుణ్యమే. మన కళలంటే నాకున్న ఇష్టమే నన్ను ఈ స్థాయికి తెచ్చింది. మా నానమ్మగారు వీణ, సంగీతం టీచరు. చిన్నతనం నించి నాకు సంగీత జ్ఞానం కొంత అలా అలవడింది. మా నాన్న గారికేమో నాట్యం మీద ఎక్కువ మక్కువ. అందుకని నన్ను మ్యూజిక్‌ కాలేజీలో భరతనాట్యంలో చేర్పించారు. అలా ఎనిమిదో ఏట నుంచి నృత్యం నేర్చుకుంటూ వచ్చా. మా నాన్నగారి పెదనాన్నగారైన వింజమూరి వరాహ నరసింహాచారి గారు కూడా సంగీతంలో దిట్ట. ఆయన తాళ లక్షణం లాంటి ముఖ్యమైన పుస్తకాలు ప్రచురించారు. కుటుంబ సభ్యులు లలితకళల్లో రాణించడం వల్ల వాటి పట్ల నా అభిరుచి నాతో పాటు పెరిగింది. రోజురోజుకీ బలపడింది.
 
విదేశానికి వెళ్ళిన కొత్తల్లో...
నేను 2003లో బ్రిటన్‌కు వెళ్ళాను. అక్కడే స్థిరపడ్డా. ఇప్పుడు నాది బ్రిటీషు పౌరసత్వమే. మొదట్లో మాంచెస్టరులో ఉండేవాళ్ళం. అప్పట్లో అక్కడ తక్కువ మంది తెలుగువాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పటితో పోలిస్తే. కొత్త ముఖాలు, కొత్త ప్రాంతం. మొదట్లో ఇబ్బంది పడ్డాను. క్రమంగా అక్కడ గుజరాతీ వాళ్ళతో అనుబంధం ఏర్పడింది. తద్వారా భారతీయ విద్యాభవన్‌లో పిల్లలకు నాట్యం చెప్పే అవకాశం వచ్చింది. అలా అలా అంచెలంచెలుగా పెరుగుదలకు అవకాశం లభించింది.
 
బ్రిటన్‌ పార్లమెంట్‌లో భారతీయ నృత్యం
బ్రిటీషు పార్లమెంటులోని కమిటీ రూముల్లో వివిధ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా సంఘాలు, సంస్థలు రకరకాల అంశాలపై చర్చలు నిర్వహిస్తుంటాయి. అందుకు అనుమతి ఇస్తుంటారు. అలా కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రత్యేక విషయాలపై నన్ను నాట్యం చెయ్యమని కోరారు. అలా బ్రిటిషు పార్లమెంటులోని ఎగువ సభ (హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌, దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) రెండింటిలోనూ నాట్యాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం వచ్చింది. అలా ఇప్పటి దాకా బ్రిటీషు పార్లమెంటులో మూడేళ్ళలో ఏడుసార్లు నృత్య ప్రదర్శన చేశా. అది ఒక రికార్డు. అందుకే, (నవ్వుతూ...) అది నేను కొద్దిగా గర్వించే విషయమే.
 
అలాగే, 2012 అక్టోబరులో ఐక్యరాజ్య సమితి వారి జీవ వైవిధ్య సదస్సు (సి.బి.డి)కు భారతదేశం ఆతిథ్యమిచ్చింది. అదీ హైదరాబాదులో! అప్పుడు నేను బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ సాంస్కృతిక సమన్వయకర్తగా వ్యవహరించా. అంతేకాకుండా, స్వయంగా నోవాటెల్‌ ప్రాంగణంలో గ్రీన్‌ యాత్రలో భాగంగా నాట్యం కూడా చేశా. ఎదురుగా ప్రేక్షకులలో ఐక్యరాజ్యసమితి సి.బి.డి. కార్యనిర్వాహక కార్యదర్శి అయిన బ్రెజిల్‌ దేశానికి చెందిన డాక్టర్‌ బ్రౌలియో ఫెరైర్రా దియాస్‌ లాంటి ముఖ్యులున్నారు. వాళ్ళు మెచ్చుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చింది.
 
 
నృత్యంలో... వైద్యం, సాధికారత
నేను లండనులో సంస్కృతి సెంటరు అనే సంస్థ ద్వారా భరతనాట్యం, జానపద నృత్యాలలో తర్ఫీదు ఇస్తూ ఉంటాను. ఈ క్రమంలో నాట్యపరంగా వైవిధ్యమైన అంశాలపై శ్రద్ధ చూపిస్తే పాశ్చాత్యులకు అర్థమయ్యేలా మన సంస్కృతిని ప్రదర్శించవచ్చని నాకు అనుభవమైంది. అలా నాకు తృప్తి కలిగించిన విషయం ఏమిటంటే... ఆయుర్వేదం ప్రాధాన్యం, వైద్య చికిత్సలో సంగీత - నృత్య ప్రాధాన్యం, మహిళా సాధికారత లాంటి అంశాలను ప్రదర్శించడం. ఈ అంశాలను నేను ఎంచుకోలేదు. సందేశాత్మకంగా ఉండేలా నాట్యాన్ని ప్రదర్శించండి అని నిర్వాహకులు అడిగారు. నిజానికి ఒక క్షేత్రయ్య పదానికో, అన్నమాచార్య కీర్తనకో నాట్యం చెయ్యమంటే తేలికయ్యేదేమో! కానీ, వీటి గురించి నృత్యం అంటే పెను సవాలే. అందుకే, ఆయుర్వేదం పైన ఎలాంటి సంగీతంతో, ఏ విధంగా నృత్యాన్ని ప్రదర్శించాలని ఆలోచనామథనం చెయ్యాల్సి వచ్చింది. చివరికి ధన్వంతరి మంత్రాన్ని నేపథ్యంగా తీసుకుని ఆయనను విష్ణువు అవతారంగా చూపిస్తూ ఆయుర్వేదం ఎలా ఉద్భవించిందో ఒక కథలా చూపించా. వైద్యచికిత్సలో సంగీతం ఎలా ఉపయోగపడుతుందో నాట్యం ద్వారా చూపించడం కష్టమే. దానికి కూడా వేణునాదాన్ని నేపథ్యంగా తీసుకుని శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః అనే సందేశంతో నాట్యాన్ని మొదలుపెట్టాను.
 
అలాగే, ప్రపంచ జలదినోత్సవాల సందర్భంగా మేము నాట్యం ద్వారా ‘జలాంజలి’ పేరిట నివాళి అర్పించాం. దీని వెనుక కథేమిటంటే... భారత ప్రధాని నరేంద్ర మోడీ నీటిని పరిరక్షించండి అని చేసిన విస్తృత ప్రచారంలో భాగంగా బ్రిటిషు పార్లమెంటులో నీటి పరిరక్షణ పైన సదస్సు ఏర్పాటు చేశాం. నీటిపై ఆధారపడే జనసమూహాల వ్యవహారాల శైలి పైన ఈ నృత్యాంశం ప్రదర్శించాం.
 
తాజాగా మరో మరపురాని అనుభవం ఎదురైంది. బ్రిటన్‌లో కార్నివల్‌ అనేది ప్రజాదరణ పొందిన ఉత్సవం. అందులో ప్రపంచ నృత్యరీతులు ఉంటాయి. బెల్లీడాన్సు నుంచీ సాంబా, ఫ్యూజన్‌, ఆఫ్రికన్‌ దాకా రకరకాల శైలులు ప్రదర్శిస్తారు. ఇవి చూడటానికి వేలమంది గుమిగూడతారు. ఈ సంవత్సరం నేను మన భారతీయ జానపద నృత్యం ప్రవేశపెట్టా.
 
అంతా గురువుల దయ!
ఇవాళ నాకు వచ్చిన ఈ గుర్తింపు, గౌరవం నాకు నాట్యం నేర్పిన గురువుల భిక్షే. మా గురువుగారు డాక్టర్‌ ఉమా రామారావుగారి గురించి ఏం చెప్పినా అతిశయోక్తి కాదు. కూచిపూడి, భరతనాట్య కళల్లో ఆరితేరిన విదుషీమణి ఆమె. ఆవిడతో నాకు పాతికేళ్ళకు పైగా అనుబంధం. వారి దగ్గర నాట్యాభ్యాసం చెయ్యడం కళలో లోతులు, మెలకువలు అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదం చేసింది. కొత్త విషయాల మీద నాట్యాన్ని ఎలా సమర్పించవచ్చో గురువు గారితో చర్చిస్తుంటే మేధస్సు పెరిగేది. కొన్నేళ్ళుగా వారితో కొన్ని పరిశోధనాంశాలపై కలిసి పనిచేశా. దాని ఫలితంగానే శ్రీనివాస గద్యం, కొన్ని శహాజీ మహారాజు గీతాలను నాట్యానికి అనుగుణంగా వెలువరించగలిగాం.
అలాగే, నాకు తృప్తినిచ్చిన మరో పని ఉంది. రామానుజుల వారి జీవితచరిత్రపై రాసిన లేఖనం తాళపత్రాల రూపంలో లండన్‌లో బ్రిటీషు లైబ్రరీలో దాదాపు డెబ్భై ఏళ్ళుగా ఉంది. అందరికీ అందుబాటులో లేని, ఆ ప్రతి మొత్తం అంతా ఎత్తి రాయడానికి మూడేళ్ళకు పైగా పట్టింది. దాన్ని గత ఏడాది పుస్తకరూపంలో తీసుకొచ్చాం. ఆ పుస్తకావిష్కరణ కూడా బ్రిటీషు పార్లమెంటులోనే జరిగింది. ప్రస్తుతం దాన్ని ఆంగ్లంలోకి అనువదిస్తున్నా.
 
సమయం వస్తే ఆపలేరు!
నేను ఇప్పుడు లండన్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ సండర్‌ల్యాండ్‌లో అధ్యాపకురాలిని. ఈ ఆధునిక సమాజంలో ఇప్పటికీ జాతి పరమైన వివక్ష, స్త్రీ పురుష లింగ వివక్ష గురించి విన్నప్పుడు బాధ అనిపిస్తుంది. మనం ఎంత చదువుకున్నా ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఒక స్థాయి తరువాత బ్రిటిషువారు మనల్ని పై స్థానాల్లోకి రానివ్వరు, చేరనివ్వరు అని తెలిసినవాళ్ళు అంటారు. ఇవి వాళ్ళకు అనుభవం నేర్పిన పాఠాలు అనుకోవచ్చు. కానీ, క్రమంగా ఈ దృక్పథం మారుతోంది. నేనైతే వీలైనంత సహనంగా ఉండాలంటా. దేనికైనా సమయం ఉంటుంది. అప్పుడు మన ఎదుగుదల ఎవరూ ఆపలేరు అని నా నమ్మకం.
 
మా పాపకు ఋణపడి ఉంటా!
నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే, అందుకు మా ఇంట్లో ప్రోత్సాహం కూడా కారణం. మా వారు వృత్తిరీత్యా ప్రాజెక్ట్‌ మేనేజర్‌. ఆయన మరాఠీ భాషీయులు. మేము ఇంట్లో హిందీలో మాట్లాడుకుంటాం. ఆయన నన్ను బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు పరోక్షంగానైనా. మా అమ్మాయికి ఆరేళ్ళు. (నవ్వుతూ...) మా ఇంట్లోనే బహుళ సాంస్కృతిక సమ్మేళనం అన్న మాట! నా పురోగతి విషయంలో మా వారి కన్నా మా పాపకు నేను ఎక్కువ ఋణపడి ఉంటా. నేనెప్పుడూ తీరిక లేకుండా పనుల్లో మునిగిపోవడం వల్ల తగినంత సమయం కేటాయించడం లేదని అప్పుడప్పుడు నేనే తప్పు చేసినట్లు భావిస్తుంటా.
 
సంకల్పబలమే సాధనం
ఎవరికైనా ఉండేది రోజుకి ఇరవైనాలుగు గంటలే! అందుకే సమయాన్ని ఎలా విభజించుకోవాలి అనేది ఒక కళ ఏయే విషయాలకు ముందస్తుగా ప్రాధాన్యం ఇవ్వాలో ఒక ప్రణాళిక వేసుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. వర్కింగ్‌ ఉమన్‌గా తోటివారికి నేనిచ్చే మొదటి సలహా... ఆందోళన పడవద్దు అనేదే! టెన్షన్‌ పడినంత మాత్రాన ఏదీ పరిష్కారం కాదు. సమస్య కొలిక్కి రాదు. ఇది నేను చెయ్యాలి అని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుంటే దానికి మనం సమయాన్ని కేటాయించాల్సిందే, దానికి ఉపాయం ఉండాల్సిందే. సంకల్పబలం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కొద్దో గొప్పో త్యాగాలు చేయాల్సి వస్తుంది. పెద్దలు చెప్పినట్లు... కష్టే ఫలి! ఎవరికైనా ఇదే విజయసూత్రం!
 
ఎప్పటికప్పుడు కొత్తదనం!
లండన్‌లో ఉన్నా... మాతృదేశాన్నీ, మాతృభాషనూ, సంస్కృతినీ మర్చిపోలేదు, మర్చిపోలేను. ఇప్పటికీ తెలుగులో చిన్న కథలు, కవితలు, వ్యాసాలు రాయడం అలవాటు. కొన్ని మంచి రచనల్ని ఇంగ్లిషులోకి అనువాదం చేస్తుంటా. ఎప్పటికప్పుడు పనిలో ఏదో ఒక కొత్తదనం ఎంచుకోవడం నాకిష్టం. ఆ మధ్య రెండు హాలీవుడ్‌ సినిమాలకు తెలుగు డైలాగ్‌ ఎడిటింగ్‌ సహాయం చేశా. ఒకటి వార్నర్‌ బ్రదర్స్‌ వారి బ్యాట్‌మ్యాన్‌ వర్సెస్‌ సూపర్‌మ్యాన్‌, ఇంకొకటి ఫెంటాస్టిక్‌ బీస్ట్స్‌ అండ్‌ వేర్‌ టు ఫైండ్‌ దెమ్‌. భాషాపాటవాన్ని రకరకాల రంగాల్లో ఉపయోగించచ్చు అనడానికి ఇదో ఉదాహరణ.