Telugu-woman-success-story-in-America

రెండు ప్రాజెక్ట్‌లు... ఒక అరుదైన గౌరవం

ఆంధ్రజ్యోతి, 02-04-2018: అమెరికాలో వైద్య విద్య... ఊపిరి సలపని పని! అయినా తనను ఈ స్థాయికి తెచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే సంకల్పం! వెరసి... ప్రతిష్ఠాత్మకమైన ‘డేవిడ్‌ సి. లీచ్‌’ అమెరికా జాతీయ పురస్కారం ఆమెని వరించేలా చేశాయి. ఆ అమ్మాయి... మన తెలుగమ్మాయి డాక్టర్‌ శ్రీలక్ష్మి వల్లభనేని! అమెరికాలో ఉన్న శ్రీలక్ష్మిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరిస్తే...

మాది ఏలూరు. నా చదువంతా హైదరాబాద్‌, విజయవాడల్లోనే సాగింది. ఇంటర్‌ పూర్తవగానే మెడికల్‌ ఎంట్రన్స్‌ రాశాను. 802వ ర్యాంకు వచ్చింది. మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీలో 2011లో మెడిసిన్‌, హౌస్‌ సర్జన్‌ పూర్తి చేశాను. మెడిసిన్‌లో ఉండగానే కాలేజీ తరఫున అమెరికాకు వచ్చి ఇక్కడ క్యాన్సర్‌ సెంటర్‌లో రీసెర్చ్‌ చేశాను. 2014లో ఇంటర్నల్‌ మెడిసిన్‌ పూర్తి చేశాను. ఇది మూడేళ్ల కోర్సు. 2017లో కోర్సు పూర్తి చేసిన తర్వాత కార్డియాలజీ ఫెలోషిప్‌లో చేరాను. చదువులో ఒక్కో మెట్టూ కష్టపడి కాదు, ఇష్టపడి ఎక్కాను. ఈ ఇష్టం నాకు పుట్టుకతోనే వచ్చిందని చెప్పాలి. ఇందుకు కారణం మా తాతగారే! ఆయన ఏలూరు సిఆర్‌ రెడ్డి కాలేజీలో రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌. ఆయన స్కూలు నడిపేవాళ్లు. ఆయన తర్వాత మా అమ్మానాన్నా ఆ బాధ్యత తీసుకున్నారు. అలా చదువులమ్మ ఒడిలో పెరిగాను కాబట్టి చదవాలనే ఆసక్తి స్వతహాగానే ఉండేది. నా ఆసక్తికి అమ్మ సుజాత, నాన్న వల్లభనేని సత్యరామ ప్రసాద్‌, అన్నయ్య వల్లభనేని శ్రీకర్‌, అక్క అనురాధల ప్రోత్సాహం తోడైంది. దాంతో నా చదువంతా సజావుగా సాగింది.
 
మొట్టమొదటి విదేశీ వైద్యురాలిని!
నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడు పేషెంట్‌ కేర్‌ పెరగడానికి కొన్ని ప్రాజెక్టులు చేశాను. బాల్టిమోర్‌లో నేను చదివే యూనివర్శిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా డేవిడ్‌ సి. లీచ్‌ అవార్డుకు నన్ను నామినేట్‌ చేశారు. మన దేశంలో ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఉన్నట్టే ఇక్కడ (అమెరికాలో) ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌’ ఉంటుంది. వాళ్లు దేశంలోని ఫెలోషిప్‌ రెసిడెంట్ల కోసం ఈ అవార్డు ఏర్పాటు చేశారు. ఫెలోషిప్‌ రెసిడెంట్లు చేస్తున్న పని, ప్రాజెక్టుల ఆధారంగా అమెరికా మొత్తం నుంచి ముగ్గురు లేదా నలుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అలా ఈ ఏడాదికి ఎంపికైన నలుగురిలో నేనూ ఒకదాన్ని. ఇంతవరకూ ఒక్క విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ కూడా ఈ అమెరికన్‌ అవార్డుకు ఎంపికవ్వలేదు. ఇలా ఎంపికైన మొట్టమొదటి విదేశీయురాలిని నేనే! ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ వైద్యురాలినీ నేనే! మార్చి మొదటి వారంలో ఫ్లోరిడాలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నా.
 
రోగుల శ్రేయస్సే పరమావధి
ఈ అవార్డు రావడం వెనక కృషి గురించి కొంత చెప్పాలి. కార్డియాలజీ విభాగంలో ఎంతో పని ఒత్తిడి ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా రోగులకు మేలైన సేవలందించే మార్గాల గురించే ఆలోచిస్తూ ఉంటాను. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దేన్‌ క్యూర్‌’ అనే నానుడి ఉంది కదా! అలా జరగాలి అంటే వ్యాధుల గురించి, వాటి నుంచి రక్షణ గురించి, వైద్య విధానం గురించి తెలుసుకోవాలి. కానీ సాధారణ ప్రజలకు ఈ విషయాల మీద అంతగా అవగాహన ఉండదు. వైద్యులు సూచించే పరీక్షలు చేయుంచుకోవడం, వైద్యులు రాసిన మందులు వాడడం, ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం మాత్రమే చేయగలరు. కానీ ఏ మందులు ఎందుకు వాడుతున్నారు? మందులు మారితే... అవి ఎందుకు మార్చాలి? ప్రయోజనం ఏంటి? అనే విషయాల మీద వాళ్లకు అవగాహన ఏర్పరచగలిగితే ఆరోగ్యం పట్ల వారికి మరింత శ్రద్ధ పెరుగుతుంది.
 
దాంతో ఇంకాస్త జాగ్రత్తగా మందులు వాడతారు. ఇలా జరగాలంటే ఆస్పత్రి నుంచి పేషెంట్‌ను డిస్చార్జి చేసేటప్పుడు, ఆ రిపోర్టులో రాసిన మందుల గురించి వైద్యులు తప్పక వివరించాలి. ఇదే నేను చేసిన ‘వన్‌ పేజ్‌ పేషెంట్‌ డిస్చార్జ్‌ సమ్మరీ’ ప్రాజెక్టు. దీంతోపాటు ఆస్పత్రుల్లో సూచించే కొన్ని రక్త మార్పిడులు అన్ని సార్లూ ప్రతి రోగీ చేయించుకోవలసిన అవసరం ఉండదు. ఇలా అవసరం లేకపోయినా చేయించుకోవడం వల్ల ఎంతో డబ్బు, సమయం వృథా అవుతూ ఉంటాయి. ఈ నష్టాన్ని నివారించడం కోసం ‘ఆర్‌బిసి ట్రాన్స్‌ఫ్యూజన్‌ థ్రెషోల్డ్‌ ప్రాజెక్ట్‌’ మాడ్యూల్‌ తయారుచేశాను. ఏ పరిస్థితుల్లో రక్త మార్పిడి చేయాలి? ఎలాంటి సందర్భాల్లో అవసరం ఉండదు, ఎవరికి చేయకూడదు? అనే విషయాల మీద రెసిడెంట్లు వైద్య సిబ్బందికి ఈ మాడ్యూల్‌ ఉపయోగపడుతుంది. ఇవి రెండూ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టులు.
 
సమాజానికి తిరిగివ్వాలి
మా అమ్మ నాతో ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటుంది. ‘సమాజం మనకిచ్చింది తిరిగి వెనక్కివ్వాలి’ అని. ఈ మాటని నేను మనసారా నమ్ముతాను. నా పరిధి మేరకు, తోచినంత సహాయం చేస్తూ ఉంటాను. ప్రస్తుతం మనదేశంలో, ఘనాలో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నా. వాళ్లకి ప్రతి నెలా నా అకౌంట్‌ నుంచి 60 డాలర్లు వెళుతూ ఉంటాయి. ముందు ముందు మరింత సమాజ సేవ చేయాలని ఉంది. మన దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. వాటిని నివారించడం కంటే రాకుండా నియంత్రించడం ఎలాగో అందరికీ అవగాహన కల్పించాలని ఉంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా ఉండే ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడం గురించి కూడా తెలియచేయాలని ఉంది. కేవలం వైద్యానికే పరిమితమవకుండా కొంత సమయాన్ని ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన పెంచడం కోసం కేటాయించాలని ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నా.
 
మన దేశంలో ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఉన్నట్టే ఇక్కడ (అమెరికాలో) ‘అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌’ ఉంటుంది. వాళ్లు దేశంలోని ఫెలోషిప్‌ రెసిడెంట్ల కోసం ఈ అవార్డు ఏర్పాటు చేశారు. ఫెలోషిప్‌ రెసిడెంట్లు చేస్తున్న పని, ప్రాజెక్టుల ఆధారంగా అమెరికా మొత్తం నుంచి ముగ్గురు లేదా నలుగురిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అలా ఈ ఏడాదికి ఎంపికైన నలుగురిలో నేనూ ఒకదాన్ని. ఇలా ఎంపికైన మొట్టమొదటి విదేశీయురాలిని నేనే! ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ వైద్యురాలినీ నేనే!