Telugu-woman-in-America-cricket-team

మన ‘సింధు’వు.. అమెరికా బంధువు

ప్రపంచ మహిళల క్రికెట్‌ కప్‌లో మనోళ్లు అదరగొడుతున్న సమయం ఇది. ఆ ఆనందానికి మరో తీపి కబురు తోడైంది. అమెరికా పచ్చిక మైదానం నుంచి ఎగిరొచ్చిన ఓ వార్త తెలుగు క్రికెట్‌ ప్రియుల మనసు దోచుకుంది! అన్నిరంగాల్లో అగ్రరాజ్యమైన అమెరికాకు.. క్రికెట్‌ ఆడేవాళ్లు లేరు. ప్రపంచమంతా దుర్భిణి వేసి గాలించి.. ఒక కొత్త మహిళా క్రికెట్‌ బృందాన్ని రూపొందించుకుంది. ఆ దేశపు మిశ్రమ సంస్కృతిలాగే.. ఈ బృందంలోనూ పలు దేశాల క్రీడాకారులు చేతులు కలిపారు. అందులో ఒకరు మన తెలుగు అమ్మాయి సింధుజారెడ్డి. మన సింధువు ఇప్పుడు అమెరికాకు బంధువు అయింది.

 
సింధుజది క్రికెట్‌ వీరాభిమానుల కుటుంబం. ఆ విషయాన్నే వాళ్ల నాన్న స్ఫురందర్‌రెడ్డి గుర్తు చేసుకుంటూ ‘‘మాది నల్లగొండ జిల్లా ఆమన్‌గల్‌. ముందు నుంచీ వ్యవసాయ కుటుంబం. 1956లోనే మా నాన్నకు క్రికెట్‌ అంటే అపరిమిత అభిమానం. ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగినా సరే.. రేడియోను వదిలితే ఒట్టు. బౌండరీలు కొట్టినా.. వికెట్లు కూలినా.. ఇంటిల్లిపాదికీ ఆయనే పెద్ద కామెంటేటర్‌. నాన్న వల్లే మాకందరికీ క్రికెట్‌ పట్ల మోజు పెరిగింది’’ అని చెప్పారా పెద్దాయన. చదువుకునే రోజుల్లో వరంగల్‌లోని సికెఎమ్‌ కళాశాలకు కెప్టెన్‌గా చేశారు. ‘‘వరవరరావు గారు మా కాలేజీకి తెలుగు లెక్చరర్‌. జయశంకర్‌ సారు కూడా అదే కాలేజీలో అధ్యాపకులు. వారివల్ల మాకు చదువూ అలాగే అబ్బింది. క్రీడల్లోనూ అంతే ప్రోత్సాహం లభించింది’’ అని పాతరోజులను నెమరేసుకున్నారు. ఇద్దరు పిల్లల చదువురీత్యా ఆయన తన భార్య శ్రీలక్ష్మితో పాటు హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది.
 
అన్నతో పాటు వెళుతూ..
సింధుజ చదువులో ఎంత చురుకైనదో ఆటల్లో అంతకంటే ఉత్సాహవంతురాలు. అన్న రామలింగ మొహిందర్‌ రోజూ గ్రౌండ్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడేవాడట. ఒక రోజు నాన్నతో ‘‘అన్నతోపాటు నన్ను కూడా తీసుకెళ్లండి. నేనూ క్రికెట్‌ ఆడతాను. ఆడపిల్లలు ఆడకూడదా ఏం?’’ అంటూ సింధుజ మొండికేసింది. సింధుజ తల్లి శ్రీలక్ష్మి అదే సంగతిని చెబుతూ ‘‘అప్పట్లో మా కొడుకు, కూతురును చిక్కడపల్లి నుంచి సికింద్రాబాద్‌లోని మెహబూబ్‌ కాలేజీకి తీసుకెళ్లేవాళ్లం. రెండు బస్సులు మారాల్సి వచ్చేది. చలికాలంలో అయితే వణికిపోయేవాళ్లం. అయినా సరే, మా అమ్మాయి క్రికెట్‌ను వదల్లేదు. మొండి పట్టుదలతో నేర్చుకుంది’’ అన్నారు. పన్నెండేళ్ల నుంచి క్రికెట్‌ను సీరియస్ గా తీసుకుంది సింధుజ. కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ అయ్యేవరకు క్రికెట్టే తన లోకం. ఆ విషయాన్నే సింధుజ చెబుతూ ‘‘ప్రతి రోజూ కనీసం నాలుగైదు గంటలు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. మరో వ్యాపకం ఏదీ ఉండేది కాదు. ఎప్పుడైనా నేషనల్‌ టీమ్‌కు ఆడాలన్నదే లక్ష్యంగా ఉండేది..’’ అంది. రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌విమన్‌ అయిన సింధుజ ఇండియాలో ఓపెనర్‌గా వికెట్‌ కీపర్‌గా రాణించింది. అండర్‌ 16, అండర్‌ 19, రంజీలతో గుర్తింపు వచ్చింది. ఒక మ్యాచ్‌లో బంతి తగిలి వేలికి తీవ్ర గాయం అవ్వడంతో.. జాతీయ క్రికెట్‌ జట్టుకు ఎంపిక కాలేదు. ‘‘ఇండియా తరఫున మా అమ్మాయి ఆడుతుంది అన్న కల ఫలించలేదు. బీటెక్‌ చేశాక రెండేళ్ల కిందట పెళ్లి చేశాం. అల్లుడు సిద్ధార్థ్‌తో కలిసి తను అమెరికా వెళ్లింది. అక్కడ క్రికెట్‌ కొనసాగించడం, మానడం తన ఇష్టం అనుకున్నాం’’ అన్నారు ఆమె తల్లితండ్రులు స్ఫురంధర్‌, శ్రీలక్ష్మి.
 
బ్యాట్‌ లేకుండా అమెరికా వెళ్లదు..
పెళ్లయి అమెరికా వెళ్లాక - సింధుజ మనసంతా క్రికెట్‌ మీదే ఉంది. తను హైదరాబాద్‌ నుంచి వెళుతూ వెళుతూ పచ్చళ్లను పట్టుకెళ్లలేదు కానీ.. క్రికెట్‌ కిట్‌ మాత్రం మరిచిపోకుండా తీసుకెళ్లింది. ‘‘రెండ్రోజుల కిందటే మాకు ఫోన్‌ చేసింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన బ్యాట్‌ విరిగిపోయిందట! వెంటనే కొత్త బ్యాట్‌ను పార్శిల్‌లో పంపమని చెప్పింది. ఇప్పుడు ఆ పనిమీదే ఉన్నాం’’ అంటూ కూతురు గురించి చెబుతున్నప్పుడు.. ఆ తల్లితండ్రుల కళ్లలో చెప్పలేనంత సంతోషం కనిపించింది. కాలిఫోర్నియాలో ఇల్లు వెతుకున్నాక.. దగ్గర్లోని మైదానం వెళ్లింది సింధుజ. ‘‘ఇక్కడ చలికాలంలో మంచు పడుతుంటుంది. మన దేశంలో ఉన్నట్లు పొడి మైదానాలు ఉండవు.   కాబట్టి అమెరికన్స్‌ ఎక్కువగా ఇండోర్‌ స్టేడియమ్‌లలోనే క్రీడలు ప్రాక్టీస్‌ చేస్తారు. నేను కూడా ఇండోర్‌ స్టేడియమ్‌లోనే క్రికెట్‌ ఆడేదాన్ని. నా భర్త సిద్ధార్థ్‌కు నేను క్రికెట్‌ ఆడటమంటే చాలా ఇష్టం. ఆయనే కొన్ని క్లబ్స్‌కు వెళ్లి.. అమెరికా నేషనల్‌ విమెన్‌ క్రికెట్‌ టీమ్‌ ఎంపిక ప్రక్రియ గురించి వాకబు చేశారు’’ అంటూ అమెరికా నుంచి ‘నవ్య’తో చెప్పింది సింధుజ. ఆమెకు కర్ణాటక క్రికెట్‌ ప్లేయర్‌ సింధు అశోక తోడైంది. ఆమె కూడా అమెరికాలోనే ఉంటోంది. ఇండియాలో క్రికెట్‌టోర్నీలప్పుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఒక రోజు సింధు అశోక ఫేస్‌బుక్‌లో ‘ఏం చేస్తున్నావు’ అంటూ సింధుజను కదిపింది. అమెరికాలో తాను ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ‘‘అయ్యో! నేను కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నానే. అయితే ఇద్దరం హాయిగా క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చుగా’’ అంది. అలా ఇద్దరూ కలిసి క్రికెట్‌ ఆడేవాళ్లు. అమెరికా తొలి మహిళా క్రికెట్‌ టీమ్‌ను తయారుచేస్తోందన్న విషయం తెలిసి.. ఇద్దరు దరఖాస్తు చేశారు. క్వాలిఫైయింగ్‌ మ్యాచ్‌లు చాలా ఆడాక, ఇద్దరూ అమెరికన్‌ జట్టుకు ఎంపికవ్వడం విశేషం. ‘‘అంతా ఆన్‌లైన్‌లోనే చకచకా జరిగిపోయింది. అప్లయి చేశాక కొన్ని మ్యాచ్‌లు ఆడిపించారు. నేను భారత్‌లోలాగే అక్కడ కూడా ఓపెనింగ్‌ బ్యాట్స్‌విమెన్‌తో పాటు కీపర్‌ను. నా ఆటతీరు నచ్చి జాతీయ టీమ్‌కు ఎంపిక చేశారు’’ అంది సింధుజ. ‘‘ప్రతి రోజూ జరిగే మ్యాచ్‌ల గురించి ఫోన్‌లో చెప్పందే మా అమ్మాయికి నిద్రపట్టదు. అమెరికా టీమ్‌కు ఎంపికయ్యాక మేము చాలా ఆనందపడ్డాం. ఎలాగూ భారత్‌టీమ్‌లో చోటు దక్కలేదు. కనీసం అమెరికా తరఫున అయినా ఆడుతోంది. సంతోషం! వరల్డ్‌క్‌పలో సింధుజ కనిపిస్తే చాలు’’ అని ఆమె తల్లితండ్రులు తమ కల చెప్పుకొచ్చారు.
 
ఆమన్‌గల్‌ ఆడబిడ్డ..
అమెరికాలో ఇంట్లో వంట వండుకోవడమే మహా యజ్ఞం. మళ్లీ ఉద్యోగం చేయడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సింధుజ ఆ రెండింటితో పాటు.. అమెరికా పిల్లలకు క్రికెట్‌ కోచింగ్‌ కూడా ఇస్తోంది. ‘‘రోజూ నేను ప్రాక్టీస్‌ చేస్తూనే ఇవన్నీ చేస్తున్నాను. ఇన్నాళ్లూ ఇండియా నుంచి మా వద్దకు వచ్చిన అత్తమ్మ రుచికరమైన వంటలన్నీ వండిపెట్టేది..’’ అంటూ ఈ క్రికెట్‌ కోడలు ఆనందం వ్యక్తం చేసింది. ఆమెకు అత్తింటి ప్రోత్సాహం అపారం. వంటింట్లో గరిటె తిప్పే కోడలు కంటే.. మైదానంలో బ్యాట్‌ తిప్పే కోడలంటే ఎవరికి ఇష్టం ఉండదు? సింధుజ గెలుపు కథ విన్నాక - తెలంగాణలోని ఆమన్‌గల్‌.. అమెరికాకు క్రికెట్‌ కొరత తీర్చడం ఒక అద్భుతం కదూ! ప్రపంచమంతా ఒక ఆటస్థలం అని ఊరికే అనలేదు.
‘‘క్రికెట్‌ అనేది మా ఇంటిపేరు అయ్యింది. అప్పట్లో పంకజ్‌రాయ్‌ అనే క్రికెటర్‌ ఉండేవాడు. కెప్టెన్‌గానూ చేశాడు. అతని పేరే మా పెదనాన్న కొడుక్కి పెట్టాం. మా పంకజ్‌ కూడా నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు అక్కడ కెప్టెన్‌. ఇక, చిన్నాన్న కొడుకు పేరు ప్రసన్న. అది కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ ఆఫ్‌ స్పిన్నర్‌ ఈరపల్లి ప్రసన్న పేరు. అయితే మా ప్రసన్నకు క్రికెట్‌ చూడటం తప్పిస్తే ఆడటం తెలియదు. అప్పట్లో నాకు మొహిందర్‌ అమరనాథ్‌ అంటే విపరీతమైన అభిమానం ఉండేది. ఆయన మీదున్న ప్రేమతో మా అబ్బాయికి రామలింగ మొహిందర్‌ అని నామకరణం చేశాను. మా ఇంటి దేవుడైన రామలింగేశ్వరుని పేరు ముందు పెట్టానంతే! ఇలా అందరికీ క్రికెట్‌ పేర్లు పెట్టాం. విచిత్రంగా సింధుజకు క్రికెటర్ల పేరు పెట్టలేదు. ఆఖరికి మా కుటుంబంలో అందరూ క్రికెట్‌ను వదిలేసినా.. ఇప్పుడు సింధుజ ఒక్కతే ఆడుతుండటం ఆశ్చర్యం!’’
- స్ఫురంధర్‌రెడ్డి, సింధుజ తండ్రి
 
‘‘నాకు ఇండియన్‌ క్రికెటర్‌ ధోనీ అంటే ఇష్టం. జులన్‌గోస్వామి బౌలింగ్‌ను కళ్లప్పగించి చూస్తుంటాను. మన దేశంలో మహిళల జాతీయ క్రికెట్‌ జట్టుకు ఎంపిక కాలేదన్న బాధ లేదు. ఇప్పుడు అమెరికా తరఫున ఐసిసి టి 20 ప్రపంచకప్‌ ఆడబోతున్నాను కనక ఆ కొరత లేదు. స్కాట్లాండ్‌లో జరగబోయే పోటీలో అమెరికా గెలిస్తే.. ఆ దేశం ప్రపంచకప్‌కు అర్హత సాధించినట్లే! ఎప్పుడైనా మన దేశంతో తలపడాల్సివస్తే.. పోటీగానే భావిస్తాను తప్పిస్తే మరోలా అనుకోను. ఏ జట్టు తరఫునా ఆడినా ఆట ఆటే కదా! ఒకప్పుడు నల్లగొండ జిల్లా మహిళల క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న నేను.. ఇప్పుడు అమెరికా టీమ్‌లో క్రికెటర్‌ కావడం అరుదైన అవకాశంగానే భావిస్తున్నాను..’’
- సింధుజారెడ్డి, క్రికెటర్‌, అమెరికన్‌ విమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌
 
- మల్లెంపూటి ఆదినారాయణ, ఫొటోలు: అశోకుడు