:: Welcome to NRI - Article ::

సౌదీలో తెలుగువారికి సాయపడుతున్న తెలుగింటి ఆడపడుచు!

  •  ఎడారి దేశంలో నర్సాపురం ఆడపడుచు సాయం
  • సౌదీలో క్షమాభిక్షకు 7 వేల దరఖాస్తులు
 
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో అమలవుతున్న క్షమాభిక్ష పథకం కింద ఎలాంటి జరిమానాలు, జైలు శిక్షలు లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు క్యూ కడుతున్న తెలుగు ప్రవాసీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే గతంతో పోలిస్తే అది చాలా తక్కువ. ఇప్పటి వరకు 7.77వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకోగా వారిలో సగం మందది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నట్టు భారత ఎంబసీ వర్గాలు పేర్కొన్నాయి. జెద్దా, రియద్, దమ్మాం నగరాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే విమానాల్లో ఆమ్నెస్టీ ప్రవాసీ కార్మికులకు ప్రత్యేక రాయితీ కింద తక్కువ ధరకు టికెట్లను విక్రయిస్తున్నట్టు ఏపీ  ఎన్నార్టీ ప్రతినిధి రావి రాధాకృష్ణా తెలిపారు. 
 
యాజమానుల నుంచి పారిపోయిన సుమారు 10 వేల మంది కార్మికుల అసలు పాస్‌పోర్టులను భారతీయ దౌత్య కార్యాలయాలకు  సౌదీ అధికారులు అప్పగించగా వాటిని పరిశీలించి తిరిగి వెళ్తున్న వారికి అందిస్తున్నారు. పాస్‌పోర్టులు లేని అత్యధికులు మాత్రం ఇ.సికి దరఖాస్తు చేసుకుంటున్నారు. దాన్ని జారీ చేయడానికి నాలుగు నుంచి వారం రోజుల వ్యవధి తీసుకుంటున్నారు.  గురువారం అత్యవసర పరిస్థితుల్లో ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అలీ అమీర్ ఖాన్ అనే వ్యక్తి హైదరాబాద్ తిరిగి వెళ్లడానికి రియాద్‌లో భారతీయ ఎంబసీ 2 గంటలలోపు ఇ.సి. ప్రత్యేకంగా జారీ చేసింది.  అనారోగ్యంతో బాధపడుతున్న తమను వీలయినంత త్వరగా స్వదేశానికి పంపించాలంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన భూమని సంగయ్య, విశాఖపట్టణానికి బలం గోపాలకృష్ణలు గురువారం దమ్మాంలో రాధాకృష్ణను కలిసి కోరారు. 
దమ్మాం, రియాద్ నగరాల్లో ప్రతి రోజు అనేక మంది తెలుగు ప్రవాసీయులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి వస్తుండగా తెలుగు సామాజిక కార్యకర్తలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు వారికి సాయమందిస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చుంటున్న భారతీయులందరికీ తూర్పు గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఆర్. లక్ష్మి దీపిక నీళ్ల బాటిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నారు. తెలుగు భాష అనువాదంతో పాటుగా ఆంగ్లంతో అభ్యర్ధుల దరఖాస్తులను కూడ అమె నింపుతున్నారు. 
 

 

Loading...