Telugu-woman-elect-in-America-mid-term-elections

అమెరికా అసెంబ్లీలోకి మన పద్మ

వరంగల్‌ ఆర్‌ఈసీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌

సామాజిక సేవలోనూ చురుకైన పాత్ర
నిట్‌ క్యాంపస్ (కాజీపేట), వాషింగ్టన్‌, నవంబరు 8: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇండో-అమెరికన్లు మంచి ఫలితాలు సాధించారు. ముఖ్యంగా రాష్ర్టాల స్థాయిలో జరిగిన ఎన్నికల్లో కొత్తవారు సైతం గెలిచారు. తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో సంబంధమున్న పద్మ కుప్ప వీరిలో ఒకరు. డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి అయిన ఈమె... మిచిగాన్‌ రాష్ట్రంలో విజయం సాధించారు. 1965 అక్టోబరు 8న భిలాయ్‌లో ఓ హిందూ సంప్రదాయ కుటుంబంలో ఈమె పుట్టారు.
 
మైసూరులో కొంతకాలం పెరిగిన పద్మ... నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లారు. ఆమె అమెరికా తూర్పు తీరంలోని స్టోనీబ్రూక్‌, న్యూయార్క్‌ నగరాల్లో పెరిగారు. అనంతరం 15 ఏళ్ల వయసులో తిరిగి భారత్‌ వచ్చి విద్యాభాస్యం చేశారు. వరంగల్‌లోని రీజినల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (ఆర్‌ఈసీ... ఇప్పుడు నిట్‌) నుంచి 1984-85లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. తర్వాత అమెరికా వెళ్లిపోయారు. బాల్యం నుంచి పలు ప్రాంతాల్లో తిరగడం వల్ల విభిన్న సంస్కృతి, సంప్రదాయాలపై ఆమెకు మంచి అవగాహన ఏర్పడింది. వివాహిత అయిన పద్మకు భర్త, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
వీరు కూడా గెలిచారు
రాష్ట్రస్థాయిలోని ప్రతినిధుల సభకు పద్మతోపాటు పలువురు ఇండో-అమెరికన్లు కూడా ఎన్నికయ్యారు. వీరిలో తొలిసారిగా ఎన్నికైన నీమా కులకర్ణి, మజ్‌తబా మొహమ్మద్‌, రామ్‌ విల్లివాలమ్‌, అమీష్‌ షా, కెవిన్‌ థామ్‌స(వీరంతా డెమోక్రాట్లు) ఉన్నారు. కాగా, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జోష్‌ కౌల్‌... రిపబ్లిక్‌ అభ్యర్థి బ్రాడ్‌ షీమెల్‌ను ఓడించి... రాష్ట్ర అటార్నీ జనరల్‌గా విజయం సాధించిన రెండో ఇండో-అమెరికన్‌గా రికార్డు సాధించారు. కాగా, అరిగాన్‌ రాష్ట్రంలోని ముల్నోమా సిటీ కమిషన్‌కు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి సుశీలా జయపాల్‌ గెలిచారు. అమెరికా ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమీలా జయపాల్‌కు ఈమె సోదరి.
 
సత్తా చాటిన మహిళలు
రసవత్తరంగా సాగిన అమెరికా ప్రతినిధుల సభ మధ్యంతర ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో 98 మంది మహిళలు విజయం సాధించారు. మరో రెండు స్థానాల్లో ఫలితం రావాల్సి ఉంది. అయితే ఇందులోనూ మహిళలే పరస్పరం పోటీ పడుతున్నారు. దీంతో, ఈ సారి కనీసం 100 మంది ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ సంఖ్య 85గా ఉండేది. సభలో మహిళల ప్రాతినిధ్యం పెరగ్గా వీరిలో 33మంది కొత్తవారే కావడం విశేషం.