Telugu-woman-became-Amezon-Directer

మనింటి ప్రతిభాశాలిని

అమెజాన్‌లో ఏదైనా కొనుక్కోవచ్చు. కలలను మాత్రం కొనుక్కోలేము. కానీ, కడప లాంటి పట్టణంలో పుట్టిన శాలినీ పుచ్చలపల్లి.. తన కలను అమెజాన్‌లో వెదుక్కున్నారు. ఏకంగా ఆ కంపెనీ (అమెజాన్‌ బిజినెస్.కామ్‌)కి డైరెక్టర్‌ అయ్యారు. చిన్నప్పుడు అమ్మానాన్నలు ‘నువ్వు పెద్ద చదువులు చదవాలి’ అన్న కలను ఆమె కళ్లముందు నిలిపారు. దాన్ని ఆమె నిజం చేసి చూపెట్టారు. దేశ విదేశాలలో పని చేస్తూ.. మరోవైపు సామాజికసేవలోను అమ్మకు చేదోడువాదోడుగా నిలుస్తున్నారు.

 
అమెజాన్‌లో ఏదైనా కొనుక్కోవచ్చు. కలలను మాత్రం కొనుక్కోలేము. కానీ, కడప లాంటి పట్టణంలో పుట్టిన ‘శాలినీ పుచ్చలపల్లి’.. తన కలను అమెజాన్‌లో వెదుక్కున్నారు. ఏకంగా ఆ కంపెనీ (అమెజాన్‌ బిజినెస్‌.కామ్‌)కి డైరెక్టర్‌ అయ్యారు. చిన్నప్పుడు అమ్మానాన్నలు ‘నువ్వు పెద్ద చదువులు చదవాలి’ అన్న కలను ఆమె కళ్లముందు నిలిపారు. దాన్ని ఆమె నిజం చేసి చూపెట్టారు. అందుకోసం ఆమె మద్రా్‌సలో ఐఐటీ చదివారు. ఫ్రాన్స్‌లో ఏంబీఏ పూర్తి చేశారు. రకరకాల ఉద్యోగాలు ఆమెను వరించాయి. బహుళజాతి సంస్థ పెప్సికో ఆధ్వర్యంలోని లెహర్‌ఫుడ్స్‌కు సీఈవో పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలో నలభైదేశాలు తిరిగారు శాలిని. ఇటీవలే అమెజాన్‌ బిజినె్‌స.కామ్‌కు డైరెక్టర్‌ అయిన ఆమె.. మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
 
‘‘పురుషులు తమ ఉద్యోగంలో ఒక లక్ష్యం కోసం శ్రమిస్తారు. మహిళలు అయితే ఆ ఉద్యోగబాధ్యత తమకు ఎంత సంతృప్తినిస్తోంది.. అందులో నుంచి ఎలాంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలిగాము అన్నది చూస్తారు..’’ అంటారు శాలిని పుచ్చలపల్లి. ఆమె వ్యక్తిత్వానికి అద్దం పట్టే మాట అది. ఆమె జీవితం అప్పట్లో గొప్ప గొప్ప విద్యావకాశాలు లేని కడపలో మొదలైంది. ఉద్యోగంలో సంతృప్తినీ, కొత్తదనాన్నీ వెదుక్కుంటూ.. నలభై దేశాలు తిరిగారామె. అన్నిచోట్ల ఉన్నత పదవులు అధిరోహించారు. ఆ ప్రస్థానం వెనక అమ్మానాన్నల స్ఫూర్తితో పాటు.. ఒక మహిళ సొంతంగా ఎదగాలన్న పట్టుదల కనిపిస్తుంది. శాలిని కడప వాస్తవ్యురాలు. నాన్న శ్రీనివాసులురెడ్డి వైద్యులు. అమ్మ సంధ్య విద్యావేత్త. చిన్నప్పటి నుండి అమ్మ ప్రభావంతో పెరిగారు.
 
టాప్‌ బిజినెస్‌ స్కూల్లో..
తల్లితండ్రులు ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో.. శాలిని చదువుసంధ్యలు ఉన్నతంగానే సాగాయి. మద్రాసులో ఐఐటీ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారామె. ఆ తరువాత హ్యూమన్‌ రిసోర్సెస్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఐఐటీ నుంచి ఇటు రావడంపై ‘‘ఎందుకో ఈ కోర్సు ఇష్టం లేకపోయినా చేరాను. అందుకనే మళ్లీ ఫ్రాన్స్‌లోని ఇన్‌సీడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌ విద్య అభ్యసించాల్సి వచ్చింది..’’ అన్నారు శాలిని. ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఐదు బిజినెస్‌ స్కూళ్లలో అదొకటి. చదువు పూర్తయిన తరువాత - బెల్జియంలో ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి దేశ దేశాలు చుట్టేశారు. కార్పొరేట్‌ ఫైనాన్స్‌, సప్లయి చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్‌ డెవల్‌పమెంట్‌.. ఇలా పలు రంగాల్లో విశేష అనుభవం గడించారు. ‘‘కెరీర్‌లో భాగంగా సుమారు ఆరున్నరేళ్లు యూర్‌పలోనే గడిచిపోయింది. భర్తతో కలిసి అక్కడే ఉండిపోయను. తిరిగి ఇండియాకు రావాలన్న ఆలోచన కలిగినప్పుడు.. పెప్సికో కంపెనీ లెహర్‌ఫుడ్స్‌లో సీఈవోగా అవకాశం వచ్చింది. అందులో భాగంగా భారత్‌కు వచ్చేశాను’’ అన్నారామె. కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో కొంత కాలం పని చేశారు. ఏడాది కిందట అమెజాన్‌లో చేరారు. ఇటీవలే అమెజాన్‌ బిజినె్‌స.కామ్‌లో డైరెక్టర్‌ హోదాకు చేరుకున్నారు. షాలినికి మూడేళ్ల కిందటే ఎకనమిక్‌ టైమ్స్‌, స్పెన్సర్‌ స్టువర్ట్‌లు నిర్వహించిన ప్రభావశీలుర మహిళల జాబితాలో చోటు దక్కింది. రెండేళ్ల కిందట ‘వరల్డ్‌ ఎనకమిక్‌ ఫోరం’ అందించే యంగ్‌లీడర్‌ అవార్డూ ఆమెను వరించింది.
 
అడ్డంకుల్ని అధిగమిస్తేనే..
నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారు. అందివచ్చిన అవకాశాలతో ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళల కెరీర్‌కు సంబంధించి శాలిని మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు కడపలాంటి చిన్న పట్టణంలో మాకు అన్ని అవకాశాలు లేవు. చాలామంది ఆడపిల్లలు కాలేజీ చదువు పూర్తవుతూనే.. పెళ్లిళ్లు చేసుకుని.. కుటుంబంలో స్థిరపడిపోయేవారు. మరో ఆలోచన ఉండేది కాదు. అయితే మా అమ్మానాన్నలు చదువుకున్నారు కాబట్టి వాళ్ల దృష్టి మొత్తం మా ఇద్దరు ఆడపిల్లల (అక్కాచెల్లెళ్లు) చదువు మీదే ఉండేది. నేను, నా చెల్లి పెద్ద పెద్ద చదువులు చదివి.. ఉన్నతస్థానాలకు వెళ్లాలన్నది పెద్దల ఆలోచన. అందుకే మాలో పట్టుదల పెరిగి మంచి చదువులు చదువుకున్నాం..’’ అన్నారు. అప్పటికీ ఇప్పటికీ ఆడపిల్లల చదువుల పట్ల సమాజంలో ఎంతో మార్పు వచ్చిందన్నది ఆమె అభిప్రాయం. తన అనుభవాన్నే గుర్తు చేసుకుంటూ ‘‘నేను మద్రాస్‌‌లో ఐఐటీ చదివేప్పుడు యాభై మంది పురుషులకు గాను కేవలం ముగ్గురంటే ముగ్గురే ఆడపిల్లలం తరగతి గదిలో ఉండేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి చాలా మారింది. కారణం - అన్ని కాలేజీల్లో ముప్పయిశాతం సీట్లు విద్యార్థినులకు కేటాయిస్తుండటం. దానివల్ల అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉన్నత చదువుల్లోకి వస్తున్నారు..’’ అని పేర్కొన్నారు శాలిని. నేటి మహిళా ఉద్యోగుల పట్ల తనకున్న అభిప్రాయాన్ని చెబుతూ ‘‘మహిళలు రకరకాల రంగాల్లోకి వస్తున్నారు. కానీ, కెరీర్‌లో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను అధిగమించి కొందరే నాయకత్వస్థానాల్లోకి చేరగలుగుతున్నారు..’’ అన్నారు. ‘‘భిన్నమైన ప్రొఫెషన్లు రావడం వల్ల చాలామంది అమ్మాయిలు ఉద్యోగాలు చేయడానికే ఇష్టపడుతున్నారు. ఐటీ రంగం అందుకు నిదర్శనం. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు ఐటీ ఉద్యోగాలు అమ్మాయిలకు మరింత సౌకర్యవంతంగా అనిపిస్తున్నాయి’’ అన్నది శాలిని అభిప్రాయం.
 
తల్లి ప్రేరణతో..
అమ్మ ప్రస్తావన వచ్చినప్పుడు ‘‘మనం పుట్టిన గడ్డకు తిరిగి సహాయం చేసి.. మాతృభూమి రుణాన్ని తీర్చుకోవాలన్న ఆలోచన నాకు మా అమ్మ నుంచి వచ్చింది. నాలోని సేవాదృక్పథానికి కారణం మా అమ్మే! ఆమె ఇప్పటి వరకు కనీసం పదివేల మంది మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చి.. కొత్త జీవితాన్ని అందించారు. కడపలో ‘ఆర్తి’ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అనాథ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. నేను కూడా సేవలో భాగస్వామురాలిని అయ్యాను. యూరోపియన్‌ యూనియన్‌ నిధుల సహాయంతో బాలికల విద్యకు తోడ్పడ్డాను. అమ్మ సేవకు గాను యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా గ్లోబల్‌ విమన్‌ లీడర్‌షిప్‌ అవార్డు వచ్చింది..’’ అన్నారు శాలిని. స్వతంత్ర వ్యక్తిత్వం, అడ్డంకుల్ని అధిగమించి నాయకత్వ పాత్రను విజయవంతంగా పోషించడం, సామాజికసేవకు ప్రాధాన్యం ఇవ్వడం.. ఈ మూడు లక్షణాలూ శాలినిలో పుష్కలం. అందుకు పై ఉదంతాలే నిదర్శనం.
 
చిన్నప్పటి నుంచి పెద్ద కలల్ని కనడం.. వాటిని నిజం చేసుకునేందుకు కష్టపడటం.. అన్నవి శాలిని విజయానికి తోడ్పడ్డాయి. అందుకు తమ తల్లితండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది అంటారీ డైనమిక్‌ డైరెక్టర్‌! ఇంట్లో అమ్మానాన్నలు ప్రోత్సహిస్తే మరెంతోమంది శాలినీలు మనలో నుంచే వస్తారు!
 
శాలిని సక్సెస్‌ మంత్ర
నువ్వు ఏమి చేస్తావన్నది మాకు అనవసరం. నువ్వు ఎంచుకున్న పనిని సమర్థంగా చెయ్యగలిగితే చాలు. అప్పుడే నువ్వు అందులో సంతోషంగా ఉండగలవు..’’ మా తల్లితండ్రులు నన్ను ఇదే సూత్రం నూరిపోసి పెంచారు. నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇష్టమైన ప్రొఫెషన్‌లో గట్టి కృషి చేసేందుకు అమ్మానాన్నల మాటలు ప్రేరణను కలిగించాయి.
ఉద్యోగం, కుటుంబం, పిల్లలు, జీవితం.. వీటన్నిటినీ సమతుల్యపరుచుకుంటూ ముందుకు వెళ్లడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఆధునిక జీవనశైలిని అనుసరించే క్రమంలో - మనకు మనమే ప్రాధాన్యాలను నిర్దేశించుకోవాలి. ముందు ఏ పని అతి ముఖ్యమైనది, ఆ తరువాత ఏ పని ముఖ్యమైనది.. ఇలా ఎప్పటికప్పుడు ప్రాముఖ్యాల జాబితాను అనుసరిస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ఆఫీసుల్లో మనం ఎన్ని గంటలు ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఆ ఉన్నంతసేపూ ఎంత నైపుణ్యంగా పనులు చేశామన్నది ముఖ్యం. తక్కువ సమయంలోనే ఎక్కువ నాణ్యమైన పనిని అందివ్వడం అలవాటు చేసుకోవాలి.
నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాక.. చాలా రిలాక్స్‌ అవుతాను. ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం ఒక గంటసేపు ఏదో ఒక పుస్తకం చదువుతాను. తీరిక దొరికితే స్నేహితులు, కుటుంబ సభ్యులతోనే గడిచిపోతుంది.