Telangana-man-helps-expats-in-Iraq

ఇరాక్‌లో ఆపద్బాంధవుడు

బాధితులకు అండగా మాటేటి కొమురయ్య 

66 మందిని భారత్‌కు పంపిన సామాన్యుడు 
‘తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్‌ ఆండ్‌ కల్చర్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో సేవలు

మంచిర్యాల, ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి: ఏజెంట్ల మోసాలు, కంపెనీ అధికారుల దాష్టీకాలకు బలై, దేశం కాని దేశం ఇరాక్‌లో అష్టకష్టాలు పడుతున్న తెలంగాణ బిడ్డలకు ఆపద్బాంధవుడిలా మారాడు మాటేటి కొమురయ్య. ‘తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్‌ ఆండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో స్వదేశం పంపేందుకు సాయం చేస్తున్నాడు. ఏకంగా 66 మందిని భారత్‌కు పంపించడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటికి వేలాది మంది గల్ఫ్‌లో భారీ జరిమానాల కారణంగా స్వదేశం రాలేక నరకయాతన అనుభవిస్తున్నారని కొమురయ్య చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ‘జ్యోతిరావుపూలే జాతీయ అవార్డు‘ను అందుకున్న కొమురయ్య, ఇరాక్‌లో పరిస్థితులు, 66 మందిని భారత్‌కు పంపించడంలో తాను పడ్డ శ్రమను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆయన తెలిపిన విషయాలు ఆయన మాటల్లోనే.. 

నా పేరు మాటేటి కొమురయ్య. మాది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలాపూర్‌. నేను ఐదు సంవత్సరాల క్రితం ఒక ఏజెంట్‌  ద్వారా ఉపాధి కోసం ఇరాక్‌ వెళ్లాను. అక్కడ డ్రైవర్‌గా ఒక కంపెనీలో పని చేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ఇరాక్‌లో పనులు మందగించాయి. దీంతో మనవాళ్లలో చాలా మంది రోడ్డునపడ్డారు. నేను డ్రైవర్‌గా పని చేయడం వల్ల చాలామందితో పరిచయం ఉండేది. దీంతో వారంతా తమ గోడు వెళ్లబోసుకునేవారు. చాలామందికి వీసాలు లేవు. చాలా పెద్దమొత్తంలో జరిమానా చెల్లిస్తేగానీ ఇంటికి వెళ్లే అవకాశముండదు. దీంతో చాలా మంది తిండికి కూడా కటకటలాడేవారు. వారిని చూస్తే చాలా బాధ కలిగేది. వారికోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నాను. బాధితుల వద్ద పాస్‌పోర్టు కాపీలు సేకరించి, పలుసార్లు భారత ఎంబసీకి వెళ్లాను. ఫలితం దక్కలేదు. అనంతరం తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం ఫోన్‌నంబర్‌ సంపాదించి కాల్‌ చేసి చాలాసార్లు చెప్పాను. అయినా లాభం లేకుండా పోయింది. 

కొద్ది రోజులకు గల్ఫ్‌ వెల్ఫేర్‌ ఆండ్‌ కల్చర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాటుకూరి బసంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి, విషయం చెప్పాను. ఆయన స్పందించి, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. ఇండియా ఎంబసీ ద్వారా 33 మందిని స్వదేశం పంపేందుకు అనుమతి లభించింది. 2016 నవంబర్‌లో వారిని హైదరాబాద్‌కు పంపించాను. ఈ విషయం తెలుసుకొని రోజూ చాలా మంది నా దగ్గరకు వచ్చి, తమను కూడా ఎలాగైనా భారత్‌కు పంపుమని కోరేవారు. దీంతో అలాంటి వారి వద్ద ఉన్న ఆధారాలు సేకరించి భారత దౌత్యకార్యాలయం వెళ్లి, అక్కడి అధికారి దీపక్‌ మిగ్లాని కలిసి చాలాసార్లు మాట్లాడాను. ఆయన ఇరాక్‌ ప్రభుత్వంతో మాట్లాడితే విజిట్‌ వీసాపై వచ్చినవారు తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పారు. దీంతో విషయాన్ని మరోసారి బసంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. ఆయన సలహా మేరకు అక్కడి ప్రభుత్వ కార్యాలయం ముందు 50 మందితో ఆందోళన నిర్వహించాం. జరిమానాకు డబ్బులు లేవనీ, ఎలాగైనా భారత్‌ పంపుమని ప్రాధేయపడ్డాం. దీంతో అనుమతి లభించింది. వీరిలో కొంతమందికి పనిదొరికి అక్కడే ఆగిపోగా, 33 మంది స్వదేశం వచ్చారు. ఇందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారుకాగా, ఒకరు పంజాబీ. మిగిలినవారంతా తెలంగాణవాసులే. 

వీరంతా ఇంటికి వచ్చాక జన్నారం మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన కోట కృష్టంరాజు ఇరాక్‌ జైలులో ఉంటే ఆయనను విడిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. పోలీస్‌స్టేషన్‌, జైలు, భారత ఎంబసీ చుట్టూ తిరిగాను. నేను భారత్‌ వచ్చాక ఆయనను ఆయనను వదిలిపెట్టారు. ప్రస్తుతం నేను ‘తెలంగాణ గల్ఫ్‌ వెల్ఫేర్‌ ఆండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌’కు రాష్ట్ర జాయింట్‌ సెక్రెటరీగా పనిచేస్తున్నాను. మా గ్రామానికి చెందిన ఒకాయన దుబాయ్‌లో చనిపోతే అప్పుడు బసంత్‌రెడ్డి దుబాయ్‌లో ఉన్నారు. ఆయనతో  మాట్లాడి ఆ మృతదేహాన్ని 13 రోజుల్లో ఇంటికి తెప్పించాం.  గల్ఫ్‌ వెళ్లి వచ్చిన వారి నుంచి రూ. 23,500 సేకరించి, బాధిత కుటుంబానికి అందజేశాం. తర్వాత దండేపల్లి మండలానికి చెందిన కోడి రాజయ్య ధర్మపురి మండలంలోని దొంతపూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు, కడెం మండలంలోని తరుపు గ్రామానికి చెందిన ఒక్కరు ఇరాక్‌ జైల్‌లో ఉంటే బసంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వారి కుటుంబీకులను ఢిల్లీ తీసుకెళ్లి సుష్మాస్వరాజ్‌ను కలిశాం. త్వరలోనే వారిని విడిపించేందుకు ఆమె ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఇరాక్‌లో వేలాది మంది తెలంగాణ బిడ్డలు పని లేక, ఇంటికి రాలేక నరకం అనుభవిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, వారిని స్వదేశం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.