TANA-precedent-elect-Jayasankar-serves-in-Khammam

సొంతగడ్డకు కొంత మేలు

తానా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జయశేఖర్‌ సేవలు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఏజెన్సీ ప్రాంతంలో జన్మించి.. కష్టపడి ఉన్నత విద్య చదివి.. అమెరికా వెళ్లి.. స్థిరపడినా ఆయనకు సొంతగడ్డపై మమకారం మాత్రం చెదరలేదు. తనతోపాటు కుటుంబసభ్యులను కలుపుకొని సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. అంతేకాదు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో కీలక పాత్ర పోషిస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయనే.. తానా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ జయశేఖర్‌ తాళ్లూరి. 2019 జూలైలో వాషింగ్టన్‌ డీసీలో జరిగే ఉత్సవాల్లో తానా అధ్యక్ష బాధ్యతలను చేపట్టబోతున్నారు. రెండేళ్లపాటు అంటే 2021 వరకు తానా అధ్యక్షుడిగా కానసాగనున్నారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్‌ ట్రస్టు ద్వారా భద్రాద్రి ఏజెన్సీతో పాటు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో ఎనలేని సేవలందిస్తున్నారాయన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరివెండికి చెందిన తాళ్లూరి జయశేఖర్‌ అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడగా.. ఆయన తల్లిదండ్రులు పంచాక్షరయ్య, భారతీదేవి ఇరవెండిలో నివాసం ఉంటున్నారు. వ్యవసాయ కుటుంబంనుంచి వచ్చిన జయశేఖర్‌ తన తండ్రి కృషితో, సోదరుడు తాళ్లూరి రాజా శ్రీకృష్ణ సహకారంతో విదేశాలకు వెళ్లి రాణించారు. వీరిద్దరూ తమ తండ్రి తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్‌ ట్రస్టు ద్వారా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బూర్గంపాడులోని 44 పాఠశాలలకు డిజిటల్‌ తరగతులకు అవసరమైన పరికరాలు పంపిణీ చేశారు.
 
స్వగ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధితోపాటు మోతెగడ్డ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కూడా ఆర్థికంగా సాయం అందజేశారు. ఆరేళ్లుగా ఏటా భద్రాద్రి బాలోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక కళా నైపుణ్యానికి పదును పెడుతున్నారు. ఏటా జరిగే భద్రాద్రి కళాభారతి నాటకోత్సవాలకు ట్రస్టు ద్వారా సహకారం అందిస్తున్నారు. భద్రాద్రి కప్‌ క్రికెట్‌ పోటీల నిర్వహణలోనూ సహకారం అందించారు. యటపాకలోని వృద్ధాశ్రమానికి సేవలు అందించడంతో పాటు వారికి వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి సహకారంతో సారపాకలో వైద్యశిబిరాలు నిర్వహించి కేన్సర్‌ రోగులకు సహాయం అందిస్తున్నారు. 
 ఖమ్మం జిల్లాలో కూడా ప్రభుత్వ పాఠశాలలకు పలుచోట్ల డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ ఏర్పాటు చర్యలు తీసుకున్నారు. తమ ట్రస్టు ద్వారా 25మంది విద్యార్థులకు పూర్తిగా ఫీజులు చెల్లిస్తూ చదివిస్తున్నారు. పేద పిల్లలకు దుస్తులను పంపిణీ చేస్తున్నారు. కాగా, తానా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని జయశేఖర్‌ తాళ్లూరి పేర్కొన్నారు.