Srikakulam-district-man-business-man-success-story

అల్లెన టూ అమెరికా

వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన శ్రీకాకుళం జిల్లావాసి

2018 యువ పారిశ్రామిక వేత్త అవార్డుకు ఎంపిక
ఆదర్శంగా నిలుస్తున్న ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌, 
పల్సస్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్‌ శ్రీనుబాబు

పాలకొండ టౌన్‌, శ్రీకాకుళం, ఫిబ్రవరి 13: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అల్లెన గ్రామానికి చెందిన గేదెల శ్రీనుబాబు అమెరికా వరకు తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన ప్రభుత్వ పాఠశాలలో విద్యా భ్యాసం పూర్తి చేశారు. బయోటెక్నాలజీలో ఎంటెక్‌ పూర్తి చేసి మధుమేహాన్ని ముందే కనిపెట్టవచ్చు అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. అనంతరం 2008లో హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ, మైండ్‌ స్పెస్‌, దివ్య శ్రీఎన్‌ఎస్‌ సెజ్‌లలో ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌, పల్సస్‌ సంస్థలను ప్రారంభించారు. ఒమిక్స్‌.ఒఆర్‌జీ పేరుతో పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలు ప్రచురించారు. ఈయన ఇచ్చిన సలహాలు, సూచనలు విలువైనవి కావడంతో శాస్త్రవేత్తలు ఈయన వద్దకు రావడం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే ఢిల్లీ, చెన్నై ప్రాంతాలతో పాటు లండన్‌, సింగపూర్‌, పలు దేశాల్లో సంస్థను ఏర్పాటు చేసి, తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ విజయతీరాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం 3500 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. పల్సస్‌ ద్వారా ఏటా 40 దేశాల్లో 3వేల కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.  ఫార్మా సంస్థలు, మెడికల్‌ డివైజస్‌ సంస్థలు కొత్త ఉత్పత్తులను ఈ కాన్ఫరెన్సలలో ప్రారంభించేందుకు ముందుకువస్తున్నారు. వ్యాపారవేత్తగా, సైంటిస్టుగా దేశవీదేశాల్లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గ్రామస్థులకు అన్ని సమయాల్లోను చేదోడువాదోడుగా ఉంటున్నారు. 
 
2018 బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపిక
వాణిజ్య రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు, యువ పారిశ్రామికవేత్తలకు ఏటా బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందజేస్తుంటారు. దీనిలో భాగంగా 2018 ఏడాదికి గాను యంగ్‌ ఎండర్‌ ప్రెన్యూర్‌గా ఒమిక్స్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పల్సస్‌ గ్రూప్‌ డాక్టర్‌ గేదెల శ్రీనుబాబును జ్యూరీ ఎంపిక చేసింది. హైదరాబాద్‌ తాజ్‌కృష్ణలో  కేంద్రమంత్రి సుజనాచౌదరి చేతుల మీదుగా ఈ అవార్డును సోమవారం అందుకున్నారు. 2017లో దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో యువశాస్త్రవేత్త అవార్డుకు ఎంపికై సిక్కోలు ఖ్యాతిని దేశవీదేశాల్లో ఇనుమడింపచేశారు.