Special-article-Miss-India-world-wide-Madhuvalli

మధురాతి మధురం

అమెరికా న్యూజెర్సీ నగరం... రాయల్‌ ఆల్బర్డ్స్‌ ప్యాలెస్‌. ఆహూతులతో కిక్కిరిసిపోయింది. అందరి మోముల్లో ఆతృత.. అంతకుమించిన ఉత్కంఠ. ఎదురుగా వేదికపై పదివేల ఓల్టుల విద్యుత్‌ కాంతులు... వాటిని తలదన్నేలా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నవయవ్వన కాంతలు. వయ్యారాలొలికించి... మెరిపించి మురిపిస్తుంటే... మధ్యలో ఓ ‘హిప్‌ హాప్‌’ బ్యూటీ సొగ‘సిరి’లతో లేజర్‌ కిరణంలా వెలిగిపోతోంది. ఇంతలా ‘చెలి’గింతలు పెట్టిన ఆ నగుమోము ఎవరని మదిలో మెదులుతుండగానే... ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ మధువల్లి‘ అంటూ చుట్టూ ఉన్న సౌండ్‌ బాక్సుల్లో రీసౌండ్‌! ఒడిశాలోని బాలాసోర్‌ కుటుంబానికి చెందిన భారత సంతతి సుందరి మధువల్లి... అమెరికాలోనే పుట్టిపెరిగింది. సౌందర్య రాశిగానే కాదు... హిప్‌ హాప్‌ కళాకారిణిగానూ ఖ్యాతికెక్కింది.

ఆత్మవిశ్వాసానికి పట్టుదల తోడైతే లక్ష్యం ఎంత పెద్దదైనా చిన్నదే అవుతుంది. ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ 2017’ కిరీటాన్ని దక్కించుకున్న భారత సంతతి అమ్మాయి మధువల్లి కూడా ఎంచుకున్న రంగాల్లో విజయమే లక్ష్యంగా అంకితభావంతో కృషి చేసింది. ఓ వైపు హిప్‌ హాప్‌ కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా... అంతటితో ఆగలేదు. ఇంకా సాధించాలనే తపనే అందాల వేదికపైకి నడిపించింది. ఈసారి మొత్తం 18 దేశాలకు చెందిన అందగత్తెలు ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌’ ఫైనల్స్‌లో పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కు నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది ఇరవై ఏళ్ల మధు. ఫ్రాన్స్‌ బ్యూటీ స్టీఫెనీ మాధవనె ఫస్ట్‌ రన్నరప్‌గా, గయానా భామ సంగీత బహదూర్‌ సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు.
 
సంగీతమంటే మక్కువ...
‘సినిమాలంటే నాకెంతో ఇష్టం. భవిష్యత్తులో హాలీవుడ్‌-బాలీవుడ్‌కు ప్రధాన వారధిగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ అందాల కిరీటం వచ్చిన సందర్భంగా మధు తన మనసులో మాట చెప్పింది. హిప్‌ హాప్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించిన ఈ భామ... గతంలో ‘మిస్‌ ఇండియా యూఎస్‌ఏ‘ కిరీటాన్నీ దక్కించుకుంది. ఈమెకు సంగీతమంటే అమితమైన మక్కువ. ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే సంగీత సాధన చేస్తోంది. రికార్డింగ్‌ ఆర్టిస్టు కావాలన్నది ఆమె కల. వర్జీనియా సొంత పట్టణం. అక్కడి జార్జ్‌ మాసన్‌ విశ్వవిద్యాలయంలో క్రిమినల్‌ లా చదువుతోంది.
 
ఇది మధురానుభూతి...
‘గత వారం ఎంతో ఉత్సాహంగా సాగింది. మిస్‌ ఇండియా యూఎస్‌ఏగా వేదికపైకి వచ్చి... మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌గా ఎంపికయ్యాను. ఈ విజయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. రన్నరప్స్‌ ఫ్రాన్స్‌, గయానా భామలకు నా అభినందనలు. జీవితంలో మరిచిపోలేని అతి మధురమైన, ఆనందాలు పంచిన వారమిది’ అంటూ తన ఆనందాన్ని ఫేస్‌బుక్‌లో పంచుకుంది వల్లి. ఎంతో మంది భారత సంతతి వారి మనసు గెలుచుకున్న మధు... భారత్‌-అమెరికాలు రెండింటినీ తాను ప్రేమిస్తానని చెప్పింది. తెలివితేటల్లోనూ మేటి అనిపించుకున్న ఈమె... అందాల కిరీటం గెలిచిన వెంటనే భావోద్వేగానికి లోనయింది. ‘నేను కన్న కలలు నిజమయ్యాయి. మమ్మల్ని ప్రేమిస్తూ... పాలిస్తూ... మా కలల్ని నెరవేర్చిన భగవంతుడికి కృతజ్ఞతలు’... అంటున్న మధు కళ్లలో విజయమిచ్చిన ఆనందం పెల్లుబికింది. వేల కిలోమీటర్ల ఆవల ఉన్నా భారతీయ సంస్కృతి ఇంకా సజీవంగా, సమోన్నతంగా ఉందని చాటిచెప్పడానికి ఇది వేదికగా నిలుస్తుందని ఆమె గర్వంగా చెప్పింది.
 
మహిళా సాధికారతకు కృషి...
హిప్‌హాప్‌ ఆల్బమ్‌లతో బిజీగా ఉంది మధు. ఇప్పుడు బ్యూటీ పోటీలో విజయం. దీంతో తనపై సామాజిక బాధ్యత కూడా పెరిగిందని ఆమె భావిస్తోంది. మహిళా సాధికారత కోసం భారత-అమెరికా మహిళలను కలుస్తానని చెప్పింది. వారిలో ఆశావహ దృక్పథాన్ని నెలకొల్పడానికి కూడా కృషి చేయాలన్నది ఆమె ఆలోచన. గతంలో బాలీవుడ్‌ స్టార్‌ ఆర్తీ ఛాబ్రియా, ఫెమినా మిస్‌ ఇండియా 1996 సంధ్యా చిబ్‌ తదితరులు ఈ కిరీటాన్ని గెలుచుకున్న ప్రముఖులు. గత ఏడాది అమెరికాకే చెందిన కరీనా కొహ్లీ విజేతగా నిలిచింది.
 
ఈ పోటీలో మొత్తం 4 విభాగాలు... ఈవెనింగ్‌ గౌన్‌, ఇండియన్‌ డ్రెస్‌, టాలెంట్‌, క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ ఉంటాయి. న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్‌ కమిటీ 1990లో మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ పోటీలను ప్రారంభించింది. మొత్తం 35 దేశాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. 17-27 ఏళ్ల మధ్య వయస్సుల భారత సంతతి యువతులు పోటీకి అర్హులు. అలాగే పెళ్లయిన భారత సంతతి మహిళలు ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌‘కు పోటీపడతారు. ఈ పోటీలను గత ఏడాదే ప్రారంభించారు.
 
‘మిసెస్‌’ సరిత...
ఇదే వేదికపై ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ 2017’ పోటీ ఫైనలిస్టులు కూడా కొలువుతీరారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సరితా పట్నాయక్‌ పన్నెండు మందిని జయించి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. నిషి సింగ్‌ (మారిషస్‌), రాధా షా (యూఏఈ) తరువాతి స్థానాల్లో నిలిచారు. సరిత ఇద్దరు పిల్లల తల్లి. ఇంటీరియర్‌ డిజైనర్‌. సామాజిక సేవ చేయాలన్నది ఆమె అభిలాష. తద్వారా మహిళా సాధికారత కోసం తన గళం నలు దిశలా వినిపించవచ్చని సరిత ఆకాంక్షిస్తున్నారు. ఈ పోటీల తొలి ఎడిషన్‌లో నమిత దాడ్‌వాడ్కర్వ్‌ (అమెరికా) విజేత.