:: Welcome to NRI - Article ::

కొత్త ‘రోబో’ను సృష్టించిన భారత సంతతి శాస్త్రవేత్త బృందం

ఆన్‌లైన్‌లో సూచనలిస్తే ఆపరేషన్‌ చేసేస్తుంది!

 
మెల్‌బోర్న్‌, అక్టోబరు 2: వైద్యులు దూరంగా ఎక్కడో ఉన్నా.. ఆన్‌లైన్‌లో సూచనలు ఇస్తే చాలు.. ఈ రోబోటిక్‌ యంత్రం ఎంచక్కా శస్త్రచికిత్స చేస్తుందట! దగ్గరుండి వైద్యులు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు వారికి హ్యాప్టిక్స్‌ టెక్నాలజీ ద్వారా ఇది ప్రత్యేక స్పర్శ అనుభూతిని కూడా కలిగిస్తుందట! అంటే.. కత్తెర్లు, ఇతర వస్తువులతో రోగి దేహాన్ని తడుముతుంటే.. స్వయంగా చేతులతో తడిమిన భావన కల్పిస్తుందన్నమాట! ఇలా స్పర్శ అనుభూతిని కలిగించే తొలి ‘రోబోటిక్‌ సర్జన్‌’ ఇదేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆసే్ట్రలియాలోని డేకిన్‌ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి ప్రొఫెసర్‌ సురేన్‌ కృష్ణన్‌, అమెరికాలోని హార్వార్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం ఈ రోబోటిక్‌ సర్జికల్‌ సిస్టమ్‌ను రూపొందించింది. ‘హీరోసర్జ్‌’ అనే ఈ రోబోటిక్‌ యంత్రం.. కీ హోల్‌ సర్జరీ(ల్యాపరోస్కోపీ)లో వైద్యులకు బాగా ఉపయోగపడుతుందని కృష్ణన్‌ తెలిపారు. వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న నిపుణుల సూచనలు పాటిస్తూ.. ఇది స్వతహాగా ఆపరేషన్‌ చేయగలదన్నారు. రోగి దేహాన్ని హై రెసొల్యూషన్‌ 3డీ చిత్రాల ద్వారా కంప్యూటర్‌లో చూపుతుందని, అందువల్ల రోగికి అధిక గాయం కాకుండా, రక్తస్రావం పెరగకుండా ఆపరేషన్‌ చేయవచ్చన్నారు. ప్రస్తుతం రోగి కణజాల పరిస్థితిని కచ్చితంగా తెలుసుకోవడం ఇబ్బందిగా ఉందని, హీరోసర్జ్‌తో ఆరోగ్యవంతమైన కణజాలం, అనారోగ్యానికి గురైన కణజాలం మధ్య తేడాను కచ్చితంగా గుర్తించవచ్చని తెలిపారు.

 

Loading...