NRI-youth-excellent-talent-in-Telugu

అమెరికా అవధాని.. ప్రవాస తెలుగు కిరణం

ఆ అబ్బాయి పుట్టింది... అమెరికాలో. పెరుగుతోందీ... అమెరికాలోనే. కానీ, మూలాలను మర్చిపోలేదు. మాతృభాషనూ, సంస్కృతినీ విడిచిపెట్టలేదు. తెలుగు మాట్లాడడం, రాయడమే కాదు... ఏకంగా అక్కడ నుంచి అంతర్జాలంలోనే అవధాన విద్య నేర్చాడు. తల్లితండ్రుల ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులతో ఇప్పుడు అష్టావధానాలూ చేస్తున్నాడు. ఆధునిక సాంకేతికతను మన ప్రాచీన మూలాల పునరుద్ధరణకు వాడుకోదగ్గ విధానానికి... లేటెస్ట్‌ ఎగ్జాంపుల్‌... గన్నవరపు లలిత్‌. ఈ పదహారేళ్ళ టీనేజర్‌ను కదిలిస్తే... అదొక పద్యాల ప్రవాహం...
 
‘‘మా పూర్వీకులది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట. తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అమ్మ శైలజ, నాన్న మారుతీశశిధర్‌. 1996లో ఉద్యోగరీత్యా న్యూయార్కు(కనెక్టివిటీ)లో స్థిరపడ్డారు. అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ తెలుగుభాషమీద, సంస్కృతం మీద మక్కువతో పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలు, భాషను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. అమ్మా, నాన్న ఇంట్లో తెలుగే మాట్లాడుతుంటారు. సాహిత్యంపట్ల ఆసక్తి ఉన్న కుటుంబం మాది.
 
నాకు చిన్నప్పటి నుంచి తెలుగుభాష అంటే అభిమానం. స్కూల్లో ఉన్నంతసేపూ ఇంగ్లీషు, ఇంటికొచ్చాక తెలుగు మాట్లాడేవాడిని. బంధువుల దగ్గరకు వెళ్లినప్పుడు తెలుగే మాట్లాడుకునేవాళ్లం. నాన్నకు పద్యాలంటే ఇష్టం. సుమతీశతకం, వేమన పద్యాలు ఇంట్లో పాడుకుంటూ ఉండడంతో నాకు అభిరుచి పెరిగింది. నాక్కూడా సంస్కృతం నేర్పించారు. రాజమహేంద్రవరానికి చెందిన పండితుడు డాక్టర్‌ ధూళిపాళ్ల మహాదేవమణి ఆన్‌లైన్‌లో అష్టావధానం నేర్పించారు. ఇలా 2013 నుంచి గ్రంథాలు చదవడం మొదలుపెట్టాను. మనుచరిత్రలో కొంతభాగం, భారతంలోని విరాటపర్వం, రామాయణంలోని ఉత్తరకాండ, రఘువంశం, కుమారసంభవం గ్రంథాలు చదివాను. దీంతో పద్యాలమీద కూడా మక్కువ ఏర్పడింది.
 
ఆన్‌లైన్‌లోనే నేర్చుకున్నా...
రాజమహేంద్రవరానికి చెందిన సంస్కృత అధ్యాపకులు రాయప్రోలు వెంకట కామేశ్వరశర్మ ఆన్‌లైన్‌లో పరిచయమయ్యారు. ఆయన ద్వారా సంస్కృతం నేర్చుకున్నాను. ఇటీవల రాజమహేంద్రవరంలో సంస్కృతం అష్టావధానంలో మెలకువలు నేర్చుకోడానికి వచ్చి, అనుకోకుండా ఓ ప్రదర్శన ఇచ్చాను. వాట్స్‌పలో నాకు గురువుగారు సమస్యలు, దత్తపదులు పంపుతారు. వాటిని పూరిస్తుంటాను. వాటిల్లో మెలకువలు ఆ విధంగానే నేర్పారు. నేను రాజమహేంద్రవరం వచ్చినపుడు గురువుగారి వద్ద వారగణనం, ఘంటావధానం నేర్చుకున్నాను.
 
అక్కడ కూడా మనపద్ధతిలోనే...!
మేం అమెరికాలో ఉన్నా తెలుగు ఆచారాలను పాటిస్తాం. క్రమం తప్పకుండా గుడికి వెళతాను. పొద్దున, సాయంకాలం సంధ్యావందనం చేస్తాను. స్కూల్‌ నుంచి సుమారు మూడింటికి తిరిగొచ్చాక, సాయంత్రం ఒక గంట ఆడుకోవడం తప్పనిసరి. టెన్నిస్‌ ఆడటాన్ని బాగా ఇష్టపడతాను. సాయంత్రం మళ్లీ సంధ్యావందనం, పూజ చేసుకుంటాను. బయటకు వెళ్లినప్పుడు పాశ్చాత్య దుస్తులు ధరిస్తాను. గుడికి వెళ్లినప్పుడు, పూజ చేసే సమయంలో మాత్రం సంప్రదాయ దుస్తులే. ఇంట్లో అమ్మ తెలుగు వంటకాలు చేస్తుంది. నాకు ఆ వంటలంటేనే ఇష్టం.
మిత్రులు భారతీయులే
అమెరికాలో నా మిత్రుల్లో తొంభైశాతం మంది భారతీయులే. స్కూల్‌లో కంటే బయటే ఎక్కువమంది మిత్రులు ఉన్నారు. నేను సంస్కృతం నేర్చుకునే సమయంలో పరిచయం అయిన వారు ఉన్నారు. చాలామందికి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. కొంతమంది కచ్చేరీలు కూడా ఇస్తున్నారు. అమెరికాలో ఉన్నా సంస్కృతి, సంప్రదాయాలు ఆచరిస్తున్న వారే కనిపిస్తారు. నేను నెట్‌లో వారితోనే మాట్లాడుతుంటాను. అప్పుడప్పుడూ ప్రత్యక్షంగా కలుస్తుంటాను. వారికి సాహిత్యంలో అంతగా ప్రవేశం లేదు. కానీ నేను పద్యం చెప్పితే విని ఆనందపడుతుంటారు. అప్పుడప్పుడూ వారు అడిగిన అంశాల మీద కూడా పద్యాలు చెపుతుంటాను. సొంతంగా రాసిన పద్యాలను కూడా వినిపిస్తుంటాను.
 
చాలా ఇష్టం
అమెరికాలో పుట్టిపెరిగినా, తెలుగునేల అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రాంతంలో అడుగుపెట్టగానే ఆనందంతో ఉప్పొంగిపోతాను. మా బంధువులు అంతా ఇక్కడే ఉన్నారు. అందరితో గడపడం హాయిగా ఉంటుంది. వీడియోగేములు ఆడను కానీ, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ ఆడతాను. టెన్నిస్‌ అంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో ప్రతిరోజూ ఆటల కోసమే సమయం వెచ్చిస్తాను. ఫెదరర్‌ నాకు ఇష్టమైన ఆటగాడు. నెట్‌ని కేవలం వ్యాసాలు రాసుకోవడానికి, అక్కడ దొరికే కావ్యాలు చదవడానికి వాడుతుంటాను. పాత తెలుగు సినిమాలు బాగా చూస్తాను. నాకు ఇంగ్లీష్‌, తెలుగు, సంస్కృతంతో పాటు లాటిన్‌, స్పానిష్‌ భాషలు కూడా వచ్చు. అందరూ అభినందించే స్థాయికి చేరుకోవడానికి మరింత పట్టుదలతో కృషి చేయాలన్నదే నా ఆలోచన.’’ 
 
 
ఇది తొలిమెట్టు
‘‘ఇది ఈశ్వరానుగ్రహం. గురువుల దీవెన. ఇది మా అబ్బాయికి తొలిమెట్టు. వాడు మరింత కృషి చేయాలని ఆశిస్తున్నాం.’’
- శైలజ, మారుతీశశిధర్‌ (లలిత్‌ తల్లితండ్రులు)
 
 
ఆన్‌లైన్‌లోనే అవధాన విద్య
‘‘లలిత్‌కు ఆరు నెలలుగా ఆన్‌లైన్‌లో సంస్కృతం, తెలుగు భాషల్లో అవధాన ప్రక్రియ నేర్పాను. శ్రీ సూక్తం వంటివి కూడా నేర్పించాను. బాల వ్యాకరణం, ఛందోదర్పణం, ఘంటావధానం, డేట్‌ ఇచ్చి వారం చెప్పమనడం వంటివి నేర్పించాను. ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో (సదనం)లో సుమారు గంటన్నరసేపు అష్టావధానం జరిగింది. ఎనిమిది మంది పృచ్ఛకులు సమస్య, నిషిద్ధాక్షరి, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి వంటి విభాగాల్లో ప్రశ్నలు గుప్పించగా అలవోకగా అందరూ మెచ్చుకునే విధంగా అష్టావధానం నిర్వహించాడు.’’
- మహాదేవమణి(లలిత్‌కు అవధాన విద్య నేర్పిన గురువు)
 
రాజమహేంద్రవరం వచ్చినప్పుడు గోదావరిని చూసి ఒక పద్యం రాశాను. అది...గోదావరి తీరంబిది వేదంబులు తరగలందు వినబడుచుండున్‌ భూదేవతా తనూలత సాదర మేఖలయనంగ జలజలసాగున్‌
- ఎన్‌ఎన్‌ఎన్‌ సత్యనారాయణ, రాజమహేంద్రవరం