NRI-woman-Saila-Thalluri-helps-to-school-children

ప్యూర్లీ విద్యార్థుల సేవ!

‘‘సోషల్‌ మీడియా ద్వారా బాల్య మిత్రులం కలిశాం. నలుగురికీ ఉపయోగపడే పనేదైనా చేద్దాం అనుకున్నాం. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నాం. ‘ప్యూర్‌’ అనే సంస్థను స్థాపించి పిల్లలు చదువుకోవడానికి ఉన్న ఆటంకాలను తొలగిస్తున్నాం. చదువుకోసమే కాకుండా అమ్మాయిల శానిటరీ హైజీన్‌ గురించి కూడా పనిచేస్తున్నాం. రెండు తెలుగు రాష్ర్టాలతో పాటు, అమెరికాలో కూడా మా సంస్థ ద్వారా ఈ పనులు చేస్తున్నాం’’ అంటున్నారు సోషల్‌ ఎంట్రప్రెన్యూర్‌ శైల తాళ్లూరి. ‘ప్యూర్‌’ ఫౌండర్‌, డైరెక్టర్‌ అయిన ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నప్పటికీ ఇక్కడ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

‘ప్యూర్‌’(పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌) ఏర్పాటు విచిత్రంగా జరిగింది. నాలుగైదేళ్ల క్రితం నుంచి వాట్సా్‌పలో స్కూల్‌, కాలేజి గ్రూపులు ఏర్పాటుచేసుకునే ట్రెండ్‌ బాగా మొదలైంది కదా. అలా మా చిన్ననాటి స్నేహితులంతా కలిసి 2015లో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ‘ప్యూర్‌’కి చైర్మన్‌గా ఉన్న విజయరామిరెడ్డి మా ముందు ఒక ప్రపోజల్‌ పెట్టాడు. ‘మనమందరం బాగానే స్థిరపడ్డాం. కానీ మన స్నేహితుల్లో కొందరు సెటిలవ్వలేదు. ఓ ఆర్గనైజేషన్‌లా ఏర్పాటై వాళ్లకు ఏదైనా సాయం చేస్తే బాగుంటుందేమో’ అన్నాడు. ఆ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన వాళ్లలో నేనే మొదటి దాన్ని. ఎందుకంటే మేమంతా అటుఇటుగా ఒకే ఏజ్‌ గ్రూప్‌లో ఉన్నాం. అందరికీ ఓపిక ఉంది. ఫ్రీగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ల అవసరాలను గుర్తించి నైపుణ్యాలను పెంచే సాయం కావాలంటే చేద్దాం, ‘అవకాశాలు కల్పిద్దాం’ అన్నాను. దానికి అందరూ ఓకే అన్నారు.
 
పొగరుగా మాట్లాడా అనిపించింది
గ్రూప్‌ ఏర్పాటు చేసుకున్న ఏడాది తరువాత ఒక రోజు రాత్రి పది గంటల ప్రాంతంలో మా అమ్మ నుంచి నాకో మెసేజ్‌ వచ్చింది. దాని సారాంశం - ‘ఒక స్కూల్‌లో 210 మంది పిల్లలున్నారు. వాళ్లకి నోట్‌బుక్స్‌ ఇస్తావా’ అని. మా స్నేహితుల వాట్సాప్‌ గ్రూప్‌లో అమ్మ పంపిన మెసేజ్‌ పెట్టాను. సాయం చేసేందుకు ఐదుగురు ముందుకు వచ్చారు. అంతలోనే అమ్మ నుంచి ఇంకో మెసేజ్‌. - ‘వాళ్లకి స్టీల్‌ ప్లేట్స్‌ కూడా కావాలట’ అని. అప్పుడు నేనే మూడ్‌లో ఉన్నానో తెలియదు.
 
‘ఎన్ని అడుగుతారు. ఏదో ఒకటి అడగమను’ అనేసి నిద్రపోయా. నా మాటలను వాళ్లకు చెప్పారు అమ్మ. ఆ స్కూల్‌ వాళ్లు ఎనిమిదో తరగతి పిల్లల్ని ‘‘మనకు ఏదో ఒకటి మాత్రమే సాయం చేయగలరట. పుస్తకాలా? ప్లేట్లా? ఏవి అడుగుదాం’’ అని అడిగారట. దానికి పిల్లలు ‘ప్లేట్లు ఉన్నవి వాడుకుందాం. పుస్తకాలు ఇవ్వమ’నండి అన్నారట. నేను పొద్దున్నే లేచి అమ్మకి ఫోన్‌ చేసి రాత్రి ఏదో చిరాకులో అలా మాట్లాడానని చెప్పబోతుంటే... అమ్మ ‘ఆ 210 మంది పిల్లలు స్కూల్‌కి వచ్చి చదువుకుంటున్న మొదటి తరం గిరిజన విద్యార్థులు. ఆ పిల్లలు మధ్యాహ్నం స్కూల్లో తిన్నదే భోజనం.
 
అంతమంది పిల్లలకు 40 ప్లేట్స్‌ మాత్రమే ఉన్నాయి. ఆకలి తట్టుకోలేక ఒకరిద్దరు పిల్లలు కలిసి ఒకేసారి, ఒకటే ప్లేట్లో తింటున్నారట’ అని చెప్పారు. అది విన్నాక ఆ ముందు రోజు ఎంత పొగరుగా మాట్లాడానో అర్థమైంది. తరువాత వాట్సాప్‌ గ్రూపులో అదే విషయం పెట్టాను. వాళ్లడిగిన పుస్తకాలు, ప్లేట్స్‌ ఇవ్వడమే కాకుండా ఆ స్కూల్‌కి పెయింట్స్‌ వేయించాం. బెంచీలు, ఎలక్ర్టిసిటీ ఏర్పాటు చేయించాం.
 
ఈ మధ్య డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ ఏర్పాటు చేసి రూమ్స్‌ కట్టించి, గ్రిల్స్‌ పెట్టించాం. ఇంతకీ ఆ స్కూల్‌ పేరు, అదెక్కడ ఉందో చెప్పనే లేదు కదూ! ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో బాసిత్‌గనర్‌ స్కూల్‌. కొన్నాళ్లకు ఆ స్కూల్‌ సమీపాన ఉన్న రింగిరెడ్డిపాలెం స్కూల్‌ నుంచి రిక్వెస్ట్‌ వచ్చింది. అప్పుడు నేను మిత్రులను ‘‘సంస్థ ఏర్పాటుచేద్దాం అన్నారు కదా. ఇప్పుడు మొదలుపెడదామ’’ని అడిగాను. ఆరుగురు ముందుకొచ్చారు. మేము ఓ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసుకున్నాం.
 
ప్యూర్‌తో అక్కడా... ఇక్కడా...
ఆలోచన అయితే వచ్చింది కానీ ఎలా ఏర్పాటుచేయాలో తెలియలేదు. నేను యుఎస్‌ సిటిజన్‌ కావడం వల్ల అధికారికంగా ఇండియాలో ఏమీ చేయలేను. చెప్తే నాటకీయంగా అనిపించొచ్చు కానీ.. రాత్రింబవళ్లు ఎలా ఏర్పాటుచేయాలని నెట్‌లో జల్లెడ పట్టాను. దాని గురించి చర్చల మీద చర్చలు చేసేవాళ్లం. ఆ చర్చల్లో కొందరు సమయం కేటాయించలేమని విరమించుకున్నారు. మిగిలిన వాళ్లం మొదలుపెట్టాం. వాళ్లంతా భారతీయ పౌరసత్వం ఉన్న వాళ్లే. అక్కడ ఉంటున్న వాళ్లే. కేవలం రవాణా ఖర్చులు మాత్రమే తీసుకుని పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ‘ద్రోణ’ అనే పేరు అనుకున్నారు. ఎందుకో ఆ పేరుతో అంతగా కనెక్ట్‌ అవ్వలేకపోయాను. ట్రైబల్‌ పిల్లలకోసం చేస్తున్న పనికి ఆ పేరు బాగోదు అనిపించింది.
 
అంతర్జాతీయంగా కూడా కనెక్ట్‌ అయ్యేలా ఉండాలనిపించింది. అప్పుడు పుట్టిందే ‘ప్యూర్‌ - పీపుల్‌ ఫర్‌ రూరల్‌ అండ్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌. సంస్థ అయితే ఏర్పాటు చేశాం. కానీ అందరికీ ఎవరి ఉద్యోగాలు వాళ్లకి ఉన్నాయి. అందుకని నిర్వహణ బాధ్యతలు చూడమని మా అమ్మని అడిగాం. మేం నెల్లూరులో ఉన్నప్పుడు ‘విశ్వభారతి’లో టీచర్‌గా పనిచేసింది అమ్మ. వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పడింది కూడా అక్కడి బాల్య స్నేహితులతోనే. అందుకని ఆవిడని అందరం కలసి ‘రెండేళ్లు ప్యూర్‌ సంస్థకి పనిచేయమ’ని అడిగాం. అలా ఆమెను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పెట్టాం. యుఎ్‌సలో నలుగురు డైరెక్టర్లతో జూన్‌లో రిజిస్టర్‌ చేశాం. మేము పెట్టుకున్న మొదటి నియమం ఎవరినీ నేరుగా ఫండ్స్‌ అడగకూడదు.
చేయాలనుకుంటున్నది మంచి పని. ఎంతోమందికి సాయం చేయాలని ఉంటుంది. కానీ ఎలా? ఎక్కడ? చేయాలో తెలియక ఆగిపోయి ఉండొచ్చు. వాళ్లందరినీ కలిపేందుకు సోషల్‌ మీడియాను ఉపయోగించాలనుకున్నా. అవసరం గురించిన వివరాలతో ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నా. దానికి ఎవరు కనెక్ట్‌ అయితే వాళ్లు ముందుకొచ్చి సాయం చేస్తారనే కాన్సెప్ట్‌. నా ఫేస్‌బుక్‌ నెట్‌వర్క్‌ పెంచుకున్నా. ప్యూర్‌కి నిధులు నా ఫేస్‌బుక్‌ వాల్‌ మీద నుంచే 95 శాతం వరకు సేకరిస్తున్నా.
 
మా వంతు ప్రయత్నం
డబ్బులు రావడం ఆలస్యం అదే వారంలో పని మొదలవుతుంది. అందుకే రెండేళ్లలో పాతికవేల మంది పిల్లల్ని, 150 స్కూల్స్‌ని చేరుకోగలిగాం. ప్యూర్‌ సక్సెస్‌లో నాకెంత క్రెడిట్‌ ఉందో... అమ్మ సంధ్యా గోళ్లమూడిది కూడా అంతే ఉంది. మొదట్లో తెలంగాణలోనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చేస్తున్నాం. మా లక్ష్యం ఒకటే... పిల్లలు స్కూల్‌కెళ్లి చదువుకునేందుకు ఎదురయ్యే అడ్డంకులను తొలగించడమే.
అదెలాగో ఒక ఉదాహరణ చెప్తా - మహబూబ్‌నగర్‌ జిల్లా తాడిపర్తి గ్రామంలోని స్కూల్‌లో 40 మంది పిల్లలు పక్క ఊళ్ల నుంచి రోజుకి ఐదు కిలోమీటర్లు నడిచి వస్తారు. వాళ్లకి సైకిళ్లు ఇప్పించాం. అలానే మొగిలిచర్లలో కూడా సైకిళ్లు ఇప్పించాం.
 
ఆ సైకిళ్లను పదో తరగతి పూర్తయ్యాక స్కూల్‌లోనే ఉంచితే తరువాత వచ్చే పిల్లలకు ఉపయోగపడతాయని అనుకున్నారట వాళ్లంతా. ఆ నిర్ణయం ఎంత గొప్పదో కదా! సర్కిల్‌ ఆఫ్‌ గివింగ్‌. అలాగే కాలేజీలో చదువుకోవాలనుకునే అనాథ పిల్లలకి, ఒంటరి తల్లుల పిల్లలకి నెలవారీ ఖర్చులు ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పుడు 71 మంది పిల్లలు ‘ప్యూర్‌’ స్పాన్సర్‌షి్‌పలో ఉన్నారు. వాళ్లలో ఒక అబ్బాయి ఎంబిబిఎస్‌ చదువుతున్నాడు. ఇద్దరు ఇంజనీరింగ్‌, మిగతా వాళ్లు డిగ్రీ చదువుతున్నారు. ఐదుగురు దివ్యాంగులకి ఇంపోర్టెడ్‌ బయో ప్రొస్తటిక్‌ లింబ్స్‌ పెట్టించాం.
 
అవగాహన ముఖ్యం
పిల్లల చదువుతో పాటు అమ్మాయిల మెనుస్ర్టువల్‌ హైజీన్‌ కోసం ‘ప్యూర్‌ ఫెమ్మె’ కార్యక్రమాన్ని చేపట్టాం. మా సంస్థ మొదలుపెట్టిన రోజుల్లో ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది కదా. ఎందుకని మన దేశంలో అమ్మాయిలు తగ్గిపోతున్నారు’’ అంటున్నారని అడిగాను. అప్పుడు నా మనసుపై చెరిగిపోని సమాధానం చెప్పారు.
 
ఎంత పేదరికంలో ఉన్నా అబ్బాయిని ప్రైవేటు స్కూల్‌కి పంపిస్తారు. అదే అమ్మాయిల్ని అయితే ఉచిత విద్య కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకి పంపిస్తారని చెప్పారు. వీళ్లకేం చేయగలం? అని ఆలోచించా. స్కూల్స్‌లో బాత్రూమ్‌లను ఏర్పాటు చేశాం. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మెనుస్ర్టువల్‌ క్లాత్స్‌ అందిస్తున్నాం. కొన్ని హైస్కూల్స్‌లో ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చాక బడికి రావడం మానేస్తున్నారు. నెలకి మూడు నుంచి ఐదు రోజులు గైర్హాజరు అవుతున్నారు.
 
ఇందుకు కారణాలనేకం... శానిటరీ ప్యాడ్స్‌, క్లాత్స్‌ అందుబాటులో లేకపోవడం. పోషకాహారం సరిగా అందక అధిక రక్తస్రావం కావడం వంటివి ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టి, వాట్సా్‌పలో మాట్లాడితే 20 మంది ఒక గ్రూపుగా ఏర్పడ్డాం. మేమంతా కలిసి మెనుస్ర్టుపిడియా బుక్స్‌ అందిస్తున్నాం. వెండింగ్‌ మెషిన్లు, నాప్‌కిన్స్‌ డిస్ర్టాయ్‌ చేసే ఇన్సినరేటర్లు ఏర్పాటుచేస్తున్నాం. చౌకగా శానిటరీ నాప్‌కిన్లు అందించడం... అవి కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా చూడడం వంటివి ‘ప్యూర్‌ ఫెమ్‌’ ద్వారా చేస్తున్నాం. శానిటరీ హైజీన్‌ గురించి టీచర్లలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లల కోసం ఇంటరాక్టివ్‌ వర్క్‌షాప్స్‌ ఏర్పాటుచేస్తున్నాం. ఫెమ్‌ అండ్‌ హైజీన్‌ తరపున 2020 లోపు రెండు తెలుగు రాష్ర్టాల్లో రెండున్నర లక్షల మంది అమ్మాయిలను చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.’’
 
నాకు దైవభక్తి ఎక్కువ. తిరుపతికి మెట్లుఎక్కి వచ్చి, డబ్బులిచ్చి మొక్కు తీర్చుకుంటా అనుకున్నాను. కానీ కర్నూలు వరదలు నాలో మార్పు తెచ్చాయి. అన్నీ ఉన్న దేవుడికి నేను ఇచ్చే డబ్బులతో అవసరం ఉందా! ఆ వరదల ప్రభావం మహబూబ్‌నగర్‌ మీద కూడా పడింది. రెండు లక్షల రూపాయల విలువ చేసే వస్తువులను హైదరాబాద్‌లో ప్యాక్‌ చేయించి పంపించాను.
 
నేను పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న బ్యాంకులో పనిచేసేవారు. అందుకని ఏ ఊళ్లో ఐదేళ్లకి మించి ఉండేవాళ్లం కాదు. అలా నెల్లూరులోని విశ్వభారతి స్కూల్లో నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు చదివాను. ఆ స్కూల్‌ స్నేహితులతో కలిసే ‘ప్యూర్‌’ ప్రారంభించాను. ఏడో తరగతి తరువాత హైదరాబాద్‌కి వచ్చేశాం. నాన్న ఢిల్లీ, కడప తిరిగినా మేము హైదరాబాద్‌లోనే ఉండిపోయాం.
 
ఈవ్‌ టీజింగ్‌ను తొమ్మిదో తరగతి నుంచే ఎదుర్కోవాల్సి వచ్చింది. నన్ను ట్యూషన్‌కి తీసుకెళ్లేందుకు అమ్మ బొడ్లో కత్తి పెట్టుకుని వచ్చేవారు. నా చదువు డిస్టర్బ్‌ కావడానికి అది కూడా ఒక కారణం. డిగ్రీ పూర్తవ్వగానే పెళ్లి చేశారు. 1998లో యుఎస్ కి వచ్చేశాను. అప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. సొంతంగా రెండు స్టార్టప్‌ కంపెనీలున్నాయి. నాకు ఇద్దరు పిల్లలు. మా ఆయన కూడా ఐటి మేనేజర్‌. వాళ్లది వరంగల్‌ జిల్లా ఖాజీపేట్‌.
 
-కిరణ్మయి