Nri-helps-to-village-youth-for-computer-education

ఎన్నారై సంకల్పం.. గ్రామమంతా కంప్యూటర్ మంత్రం..!

పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడానికి ఓ ఎన్నారై ముందుకు వచ్చారు.. ఆయన ఆశయానికి ఓ సంఘం కార్యాచరణ రూపొందించింది. గ్రామంలోని యువత ఆసక్తి కూడా తోడవడంతో నూరు శాతం కంప్యూటర్‌ పరిజ్ఞానం సాధించిన తెలుగు గ్రామంగా గుజ్జ ఘనతకెక్కింది.

నగదు లావాదేవీలైనా.. సమస్యలపై ఫిర్యాదులు చేయాలన్నా.. వాటి పరిష్కారానికైనా.. పాఠశాలల్లో ప్రవేశాలు.. స్కాలర్‌షిప్పులు.. ఉద్యోగాలు, పొందాలన్నా... భూముల రికార్డులు తెలుసుకోవాలన్నా... ఇలా రోజువారీ జీవితంలో ప్రతిదానికీ కంప్యూటర్‌ పరిజ్ఞానం ఎంతో అవసరమవుతోంది. పల్లెలు.. పట్టణాలు అనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకూ ఇది తప్పనిసరిగా మారుతోంది. ఈ క్రమంలో ప్రవాస భారతీయుడొకరు అందించిన సహాయ సహకారాలతో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామం సంపూర్ణ డిజిటల్‌ లిటరసీ గ్రామంగా ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది
 
ఇంటికొకరు...
యాదాద్రి భువనగిరి జిల్లా-నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామం గుజ్జ. ఈ గ్రామంలో జనాభా 4,738 మాత్రమే.. కుటుంబాలు 928. అన్ని వర్గాల ప్రజలూ కలసిమెలసి జీవనం సాగిస్తుంటారు.. ఈ గ్రామస్థుల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇప్పుడు ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లో కనీసం ఒక వ్యక్తి కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉండడం విశేషం. ఇటీవల ఈ సంపూర్ణ కంప్యూటర్‌ అక్షరాస్యత సాధించిన గ్రామంగా గుజ్జ రికార్డు సృష్టించింది.. దీనికి కారణం గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు మంచికంటి రాంబాబు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియా వాసి.
 
తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ అసోసియేషన్‌(టీటా) బృందం సభ్యులు అమెరికాలో పర్యటించినప్పుడు.... ఎన్నారైలు తమ గ్రామాలను దత్తత తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. దానికి రాంబాబు స్పందించారు. పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. ప్రస్తుత కాలంలో అక్షరాస్యతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరాన్ని ఆయన గుర్తించారు. గ్రామంలో ప్రతి కుటుంబానికి కంప్యూటర్‌ పరిజ్ఞానంకల్పించాలని టీటా నిర్వాహకులను కోరారు. దీనికి అవసరమైన ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు..
 
135 కుటుంబాల గుర్తింపు
రాంబాబు కోరిక మేరకు గుజ్జను సంపూర్ణ కంప్యూటర్‌ అక్షరాస్యత కలిగిన గ్రామంగా తీర్చిదిద్దడానికి టీటా సభ్యులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తయారుచేశారు. అందులో భాగంగా వాలంటీర్లు ప్రతీ ఇంటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఏ ఇంట్లో ఎంత మంది కుటుంబసభ్యులు ఉన్నారు.. వారిలో చదువుకున్న పిల్లలు ఉన్నారా, వారిలో ఎవరికైనా కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉందా, లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఏ మాత్రం లేని 135 కుటుంబాలను గుర్తించారు.
గ్రామంలోనే శిక్షణ కేంద్రం
గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక కంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొట్టమొదటగా 2016 ఆగస్టు 15న శిక్షణ ప్రారంభించారు. సెప్టెంబర్‌ 5 వరకు వంతుల వారీగా ప్రజలకు శిక్షణ ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 2017 జనవరి 18 నుంచి 29 వరకు శిక్షణ అందించారు. డిప్లమో ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌లో ఈ శిక్షణ సాగింది. దీంతోపాటు విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ ఫీచర్స్‌, రైతులకు ఈ-సాగు తదితర అంశాలపై కంప్యూటర్‌ ద్వారా పరిజ్ఞానం కల్పించారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ఈ -సర్టిఫికెట్లను ఇటీవలే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. దీంతో ప్రతి కుటుంబంలో కనీసం ఒక సభ్యుడు కంప్యూటర్‌ పరిజ్ఞానం కలిగి ఉన్న గ్రామంగా గుజ్జ ఆవిర్భవించింది.
గుజ్జుల కృష్ణారెడ్డి, పి. నర్సింహ
యాదాద్రి, సంస్థాన్‌ నారాయణపూర్‌
 
టెక్నాలజీ అభివృద్ధికి కృషి!
రాష్ట్రంలో టెక్నాలజీని మరింత అభివృద్ధి పరిచేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే ఎన్నారైలు తమ గ్రామాలను దత్తత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మా పిలుపునకు సంబంధించి ఎన్నారై రాంబాబు తన గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దీంతో గుజ్జ గ్రామంలో ప్రత్యేక క ంప్యూటర్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాం.. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని కుటుంబాలను గుర్తించాం. వారికి కంప్యూటర్‌ పట్ల పూర్తి స్థాయిలో అవగాహనకల్పించాం. అలా ఇప్సుడు గుజ్జ సంపూర్ణ కంప్యూటర్‌ అక్షరాస్యత సాధించిన గ్రామమైంది.
-సందీప్‌ మక్తాలా, టీటా వ్యవస్థాపకుడు
 
ఇక ఎవరి మీదా ఆధారపడక్కర్లేదు!
నాకు కంప్యూటర్‌పై పెద్దగా అవగాహన లేదు. మా గ్రామ పంచాయతీలో శిక్షణ కేంద్రాన్ని ఇటీవల ఏర్పాటు చేశారు. దానిలో శిక్షణ తీసుకుని కంప్యూటర్‌ గురించి అనేక విషయాలు నేర్చుకున్నా.. ఇప్పుడు నేను స్వయంగా కంప్యూటర్‌ ఆన్‌ చేసి... ఎవరిపైనా ఆధారపడకుండా సమాచారాన్ని పొందుతున్నాను. ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఎంతో మందికి కంప్యూటర్‌ పరిజ్ఞానం లభించింది. ప్రతి ఒక్కరికీ దీని అవసరం ఉంది.
- చిన్నం వినోద, సర్పంచ్‌, గుజ్జ