NRI-Help-to-his-own-village-people

జన్మనిచ్చిన గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్న ఎన్నారై

సుమారు రూ.కోటి మేర అభివృద్ధి పనులు

మల్లాపూర్‌, కరీంనగర్, ఫిబ్రవరి 18: జన్మనిచ్చిన గ్రామాభివృద్ధికి రూ. కోటికి పైగా వెచ్చించి అభివృద్ధికి తోడ్పడుతున్న ఆ ఎన్నారై సాతారాం శ్రీమంతుడు. అమెరికాలోని క్రౌన్‌పోర్ట్‌ ప్రాంతంలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.  తాను పుట్టిన గడ్డను కాస్తా..కూస్తో అభివృద్ధి చేయాలనుకుని దృష్టి సారిస్తున్న గండ్ర విద్యాధర్‌రావు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానిక సమస్యలపై గ్రామ పెద్దలతో చర్చించి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. స్థానికంగా విద్య అవసరాలను, సీసీ రహదారులను, శుద్ధి తాగు నీటిని అందిస్తున్నారు. రోగాల బారిన పడకుండా తన గ్రామస్థులకు ఉచితంగా శుద్ధి నీటిని, విద్యార్థులకు అవసరమైన తరగతి గదులను, కంప్యూటర్‌, ప్రొజెక్ట్‌ పరికరాలను అందించారు. విద్యలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సీసీ రోడ్లను నిర్మించి రహదారుల అభివృద్ధికి విశేష కృషి జరుపుతున్నారు. 
 
పాఠశాలకు ఇల్లు అప్పగింత...: 
సాతారాం గ్రామంలో తన ఇంటిని ప్రభుత్వ పాఠశాలకు అప్పగించారు. ఖాళీ స్థలంలో అదనపు తరగతి గదులను నిర్మింపజేశారు. విద్య అవసరాలను తీర్చుతునే హరితహారం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. నాటిన మొక్కల రక్షణ కోసం ట్రీ గార్డులను అందజేశారు.
 
కంప్యూటర్‌ విద్య ...: 
డిజిటల్‌ భోధనకుగాను అవసరమైన కంప్యూటర్లను అందించడమే కాకుండా ప్రొజెక్టరును పాఠశాలకు ఉచితంగా పంపిణీ చేశారు. వీటికి అవసరమైన ఇన్వర్టర్‌ను కూడా ఇచ్చారు. అలాగే పలు పరికారాలను అందిస్తూ విద్యార్థులకు కంప్యూటర్‌ విద్యలో పరిజ్ఞానాన్ని ఇస్తున్నారు.
 
సీసీ రహదారుల నిర్మాణం..:  పాపయ్య, సాతారాం 
గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి సీసీ రోడ్లను వేయించారు. అవసరమైన తాగునీటిని అందిస్తున్నారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటూ సాతారాం శ్రీమంతుడిగా పేరుగాంచుతున్నాడు.
 
కనిపిస్తున్న దేవుడు...: నర్సింగరావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
అమెరికాలో రోగులకు సేవలందిస్తూ.. సాతారాం గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న గండ్ర విద్యాధరరావ్‌ కనిపిస్తున్న దేవుడు. తన ఇంటిని పాఠశాలకు ఇచ్చి, విద్యార్థుల అవసరాలను తీర్చుతున్నారు. ప్రతిభ పురస్కారాలను అందిస్తున్నారు.