Nri-got-warrior-award-who-fight-for-schools

వెరైటీ పోరాటం.. మంచి సమాజం కోసం!!

మన వ్యవస్థ కుళ్లిపోయింది అని అందరిలా అంటూ కూర్చోలేదు ఆ ఎన్నారై. అమెరికా వెళ్లినా సరే సొంతూరి కోసం ఆలోచించాడు. బడికోసం, పక్కూరి చెరువుకోసం, ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పుకోసం అమెరికానుంచే ఆన్‌లైన్‌లో పోరాటమే చేశాడు. సామాజిక సేవలో ప్రత్యక్షంగా ఆటుపోట్లు ఎదురైనా సరే ఎదురుగా నిలబడ్డాడు. సర్కారు బడి బావుండాలనే ఉద్దేశంతో ‘టీ విత్‌ హెడ్‌మాస్టర్‌’ అనే వినూత్న కార్యక్రమంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు జలగం సుధీర్‌. ఆయన కృషికి మెచ్చి జాతీయస్థాయిలో ‘వారియర్‌ అవార్డ్‌’ వరించింది. ఆయన జీవన ప్రయాణం విశేషాలు..

కళ్ల ముందు అవినీతి, అక్రమాలు కనిపిస్తే నేను ప్రశ్నిస్తాను. ఈ ప్రశ్నించే గుణం మా తాతయ్య ద్వారా అలడిందేమో! నా చిన్నప్పుడు మా తాతయ్య రచ్చబండపై కూర్చుని తీర్పులు చెప్పేవారు. సమస్యను చాలా డిప్లమాటిక్‌గా పరిష్కరించేవారు. మా నాన్న రైతు. సాయం చేసే గుణం ఆయనలో మెండు. అలా తాతయ్య, నాన్న నుంచి కొన్ని మంచి లక్షణాలు వచ్చాయి. మాది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వెంకట్రామపురం. ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతున్నప్పుడు.. సర్కారు బడిలో చేర్పించమన్నాను మా నాన్నతో. ‘చదువు బాగోదు బిడ్డా’ అన్నారాయన. బిటెక్‌ తర్వాత ఎంబిఎ చేసి సాఫ్ట్‌వేర్‌ కొలువు సంపాదించా. ఆపై అమెరికా వెళ్లాను. మంచి జీతం, మ్యారేజ్‌, పిల్లలు. అయినా ఏదో మనసులో వెలితి వెంటాడేది.
 
అనుభవమే ఆలోచనగా..
అమెరికాలో ఐదేళ్లు పడ్డాకే ప్రభుత్వ పాఠశాల్లో చదవటానికి అర్హత ఉంటుంది. నా పెద్దకొడుకు దేవాన్ష్‌ను గతేడాది స్కూల్‌లో చేర్పించటానికి మేం వెళ్లాం. అక్కడ ప్రభుత్వ పాఠశాల బిల్డింగ్స్‌, క్రమశిక్షణ, టీచింగ్‌ మెథడ్స్‌ చూశా. మన ప్రభుత్వ పాఠశాలలు నా కళ్ల ముందు మెదిలాయి. ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలిసాయి. లోకల్‌ మున్సిపాలిటీకి వచ్చిన డబ్బుల్లో కొంత ప్రభుత్వ పాఠశాలల మెరుగుదలకు కేటాయిస్తారని ఆయన చెప్పారు. ‘కాఫీ విత్‌ ప్రిన్సిపాల్‌’ అనే కార్యక్రమం ఉందన్నారు. ఏంటని అడిగితే.. ఆసక్తిగా చెప్పారాయన. ఈ కార్యక్రమం నెలకు ఓసారి జరుగుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఎలాంటి టీచింగ్‌ మెథడ్స్‌ను బోధించాలో టీచర్లకు చెప్పాలి. బడిలో ప్లంబర్‌ వర్క్‌, ఎలక్ట్రికల్‌ వర్క్‌, కిచెన్‌లో సమస్యలు, ఉదయాన ఫలానా సిగ్నల్స్‌ దగ్గర జాగ్రత్తగా పిల్లలను స్కూల్‌ బస్సులో ఎక్కించటానికి వాలెంటీర్ల అవసరం.. ఇలాంటి సమస్యలు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ చెబుతారు. వెంటనే ఎవరికి వారు వాలెంటరీగా పనులు చేయటానికి ముందుకొచ్చి సమస్యల్ని పరిష్కరిస్తారు. ఇలా తల్లిదండ్రులు ఇన్వాల్స్‌ కావటం వల్ల స్కూల్‌కు బడ్జెట్‌ మిగులుతుంది. ఆ మిగిలిన బడ్జెట్‌ను రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌కు వెచ్చిస్తారు’ అని ప్రిన్సిపల్‌ చెప్పుకొచ్చారు. ఇదేదో బావుందనిపించింది. ఇలాంటి కార్యక్రమాన్ని మా ఊళ్లో చేయాలనుకున్నా. దానికి ‘టీ విత్‌ హెడ్‌మాస్టర్‌’ అనే పేరు పెట్టాను.
 
ఇరవై పాఠశాల్లో...
ప్రభుత్వం ఒక సర్కారు బడిలో చదివే పిల్లవాడికి సంవత్సరానికి పుస్తకాల దగ్గరనుంచి, బట్టలు, మధ్యాహ్న భోజన పథకం, మాస్టారు నెలజీతం వరకూ.. మొత్తం కలిపి 28 వేలు ఇస్తుందని తెలిసి షాకయ్యాను. కొన్నాళ్ల తర్వాత మా ఊరి హెడ్‌మాస్టర్‌తో ‘కాఫీ విత్‌ హెడ్‌మాస్టర్‌’ మన ఊరిలో ప్రారంభిద్దామని ఫోన్‌ చేసి చెప్పాను. ‘అక్కడలా ఇక్కడ కుదరద’న్నారు. పిల్లల తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడాను. ‘మాకెందుకూ ప్రభుత్వం చూసుకుంటుంది’ అన్నారు. ఎమ్‌ఇ, డిఈఓ, కలెక్టర్‌ కు కూడా ఈ కాన్సెప్ట్‌ చెబితే అందరూ బావుందన్నారు. వాళ్లంతా ముందుకు తీసుకెళ్లటానికి నిత్యం మెయిల్స్‌, ఫోన్స్‌తో కన్విన్స్‌ చేశా. గతేడాది కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగానికి సెలవు పెట్టి జూలైలో మా ఊరికి వచ్చాను. మా వేదాన్ష్‌ను ఊళ్లోని సర్కారు బడికి పంపించాను, మా అబ్బాయి అక్కడ సమస్యలను ఓ కాగితంపై రాశాడు. నాకొచ్చి చెప్పాడు. వెంటనే బడికి రంగులు వేయించా. టీవీలు కొనిచ్చాను. ప్రహారీగోడను నిర్మించాను. బడి బాగుకోసం లక్షా పాతికవేలు ఖర్చుపెట్టాను. 2016 నవంబర్‌లో ‘టీ విత్‌ హెడ్‌మాస్టర్‌’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం మా ఊరి బడిని పట్టించుకుంది. ఇపుడు ‘టీ విత్‌ హెడ్‌మాస్టర్‌’ కార్యక్రమానికి తల్లిదండ్రులు కొంతమంది వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. సొంత పనిలా బడి పనుల్లోనూ భాగస్వాములవుతున్నారు. ప్రస్తుతం వివిధ జిల్లాల్లోని 25 పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలవుతోంది.
 
ఇంటి మీదకి వచ్చారు!
పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాన్ని చేయటం బావుందని కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల కలెక్టర్లు కితాబు ఇచ్చారు. మా ఊరి స్కూల్‌ దగ్గర బెల్ట్‌షాప్‌ వద్దని పోరాడాను. కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. సమాజంపై రాజకీయ ప్రభావం చూసి బాధేసింది. నేను అమెరికాలో ఉండే సమస్యలపై పోరాడుతుంటే కొందరు మా ఇంటికొచ్చి మానాన్నను తిట్టి, బెదిరించి, వార్నింగులు ఇచ్చారు. దీంతో ‘ఇవన్నీ మనకెందుకూ’ అని మా నాన్న బాధపడ్డారు.
 
చెరువు బాగు కోసం..
ఓసారి పనిపడి అమెరికానుంచి మా ఊరొచ్చినపుడు.. మా కోదాడ చెరువును చూశా. మనసు తరుక్కుపోయింది. ఆ చెరువు జాడంతా కనుమరుగైంది. కనీసం మిగిలిన చెరువు కబ్జా కాకుండా ఏదోటి చేయాలనుకున్నా. అమెరికానుంచే ఆన్‌లైన్‌లో సమాచారహక్కు చట్టం ద్వారా ప్రశ్నించాను. కోదాడలో 750 ఎకరాల చెరువుండేదని తెల్సింది. అందులో 250 ఎకరాల్లో పెద్ద బిల్డింగులు, రాజకీయపార్టీల ఆఫీసులు వెలిసాయనే విషయం అర్థమైంది. మెయిల్స్‌తోనే ప్రభుత్వంతో మాట్లాడాను. అప్పటి జిల్లా కలెక్టర్‌ స్పందించి వెంటనే చెరువును కాపాడమని ఆదేశించారు. అయినా సరే నాయకుల భయంతో అధికారులు దాని ఛాయలకు పోలేదు. కొందరు నాకు డబ్బులు ఆఫర్‌ చేశారు. మా నాన్నమీదకి భారీ ఎత్తున గొడవకు వచ్చారు. ఈసారి నేను దేనికీ బెదరలేదు. ఓ రోజు మంత్రి హరీష్ రావుగారితో ఓ చానెల్‌ లైవ్‌లో కోదాడ చెరువు గురించి మాట్లాడాను. ఆ తర్వాత 325 పేజీల డాక్యుమెంట్లు తయారు చేసి హరీష్ రావుగారికి ఇచ్చాను. దాంతో ప్రభుత్వం 5.5 కోట్ల రూపాయల్ని కోదాడ చెరువు చుట్టూ ట్యాంక్‌బండ్‌ కట్టడానికి మంజూరు చేసింది. విచిత్రమేంటంటే.. దాని కాంట్రాక్ట్‌ కోసం పొలిటీషియన్లు పోటీ పడ్డారు. దాన్ని నాసిరకంగా కడుతుంటే.. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. ఏం జరుగుతుందో చూడాలి?
 
ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఇదీ..
మా కోదాడ గవర్నమెంట్‌ ఆసుపత్రిలోని డాక్టర్లపై ఓ పోరాటమే చేశాను. వారు గవర్నమెంట్‌ ఆసుపత్రి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రికి కొందరిని రిఫర్‌ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఎందుకు రెఫర్‌ చేశారు అని అడిగాను. ఎవరూ స్పందించలేదు. దీంతో సీఎమ్‌ గారికి ఉత్తరం రాశాను. పదిరోజుల తర్వాత కలెక్టర్‌కి ఆదేశాలు ఇచ్చారాయన. వెంటనే గవర్నమెంట్‌ ఆసుపత్రిలో వసతులు మెరుగయ్యాయి.
అదే నా కల!
మిషన్‌ కాకతీయకోసం ఎన్నారైలు ఇచ్చిన సొమ్మును తినేశారు కొందరు. దీన్ని వదలిపెట్టలేదు. గట్టిగా పోరాడాను. ఆ తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం ఓ అకౌంట్‌ నంబర్‌ ఇచ్చి అందులో ఎన్నారైలు డబ్బులు వేయాలని చెప్పింది. ‘ఎమ్‌ఎల్‌ఏ టికెట్‌ ఆశించి ఇవన్నీ చేస్తున్నావా’ అని కొందరు నన్ను అడుగుతున్నారు.. సమాజం బాగుండాలనేదే నా స్వార్థం. నా పనులను చూసి ‘ఎన్నారై ఆఫ్‌ ది ఇయర్‌’ అనే అవార్డ్‌తో ప్రభుత్వం సత్కరించింది. ‘టీ విత్‌ హెడ్‌మాస్టర్‌’ కార్యక్రమాన్ని గుర్తించి ఓ సంస్థ ఇటీవలే ఢిల్లీలో ‘టీచర్‌ వారియర్‌’ అనే అవార్డుతో సన్మానించింది. ఈ అవార్డులు సామాజిక బాధ్యతను మరింత పెంచాయి. అందరికీ విద్య, వైద్యం అందాలి. సమాజం, ప్రశ్నించే సమాజం చూడాలన్నదే నా కల.
 
ప్రస్తుతం అమెరికాలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నా. నా భార్య సుష్మ సహకారం మరువలేనిది. నా పోరాటంలో ఇబ్బందులు వచ్చినా ‘మీరు తప్పుచేయలేదు. భయపడకండి’ అని ప్రోత్సహిస్తుంది. మాకిద్దరు పిల్లలు. పెద్దబ్బాయి వేదాన్ష్‌ రెండో తరగతి. రెండో అబ్బాయి జేష్ణవ్‌ కు మూడేళ్లు.
 
- రాళ్లపల్లి రాజావలి