NRI-doctor-helps-to-own-village-from-America

కన్నఊరికి కంటిరెప్ప!

అమెరికాలో స్థిరపడిపోయినా మూలాలు మరవని వైద్యుడు

కడపజిల్లా అనంతయ్యగారిపల్లె అభివృద్ధికోసం 20ఏళ్లుగా కృషి
చీకటి దారుల్లో దీపం పెట్టాడు..ఉచితంగా మందులు, క్యాంపులు
గ్రామం కోసం మినరల్‌ ప్లాంట్‌
పేదపిల్లలను తన ఖర్చులతో చదివిస్తున్న డా. సంజీవరెడ్డి

కొత్త లోకాలు చూడాలని, కొత్తగా సాధించాలని కన్న ఊరు వదిలిపెడతారు. ఎంచుకొన్న రంగంలో బాగా ఎదుగుతారు. కోరుకొన్నదేశంలో కుటుంబంతోపాటు స్థిరపడిపోతారు. తిరిగి చూసుకొంటే, తన ఊరు తాను వదిలిపెట్టిన చోటే ఉంటుంది. ‘చల్లగా ఉండు బాబూ’ అంటూ తన నిస్వార్థపు ప్రేమను కురిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఊరుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అమెరికాలో డాక్టర్‌గా రాణిస్తూ, కుటుంబంతో అక్కడే జీవిస్తున్న కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతయ్యగారిపల్లె గ్రామానికి చెందిన టంగుటూరి సంజీవరెడ్డిని 20 ఏళ్ల క్రితం మెలిపెట్టిన ప్రశ్న ఇది.
 
అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలు సంజీవరెడ్డికి తన ఊరు అనంతయ్యగారిపల్లెకి చేరుకొనే దారిని చూపాయి. ఇన్నేళ్లుగా బడి, నీళ్లు, విద్యుత్‌ కాంతులు.. ఇలా అనేక ఆలోచనలకు ఆయన రూపం ఇస్తున్నారు. తాను సంపాస్తున్న సొమ్ములో కొంత దీనికోసం వెచ్చిస్తున్నారు.
 
 
ఊరికి వెలుగులు
కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో అనంతయ్యగారిపల్లె ఉంది. బయట ఊళ్లకు పోయిన వాళ్లు హైవేలో దిగి ఏదో ఒక బండి పట్టుకొని ఊరు చేరుకొనేవారు. బాగా పొద్దుపోయిన తరువాత ఈ ఊరికి వాహనాలు తిరిగేవికావు. అలాంటప్పుడు హైవే నుంచి ఊళ్లోకి నడవకతప్పదు. కాయకష్టం చేసేవారికి ఇదేమంత పెద్ద దూరం కాదు. కానీ, ఆ దారిలో ఒక్క విద్యుత్‌ లైటూ లేకపోవడంతో, చీకట్లోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి! ఒకసారి గ్రామానికి వచ్చిన సంజీవరెడ్డికి ఈ విషయం తెలిసింది. జిల్లా అధికారులతో ఆయన చర్చించారు. వారి సూచనలతో రూ.నాలుగు లక్షలకుపైగా తన డబ్బులు ఖర్చు చేసి హైవే రోడ్డు నుంచి గ్రామానికి సోలార్‌ బల్బులను ఆయన ఏర్పాటుచేయించారు.
 
తల్లి నాడి పట్టి..
అమెరికాలో తాను పెద్ద డాక్టర్‌. తన ఊరుని చూస్తేనేమో చిన్న చిన్న రోగాలకు సైతం మందు దొరక్క గ్రామస్థులు ఇబ్బంది పడుతుండేవారు. దీనిపై తన సహచరుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డితో సంజీవరెడ్డి సమాలోచనలు చేశారు. ఆయన సహకారంతో ‘నాటా’ అనే సంస్థ ద్వారా తన గ్రామంలోనే కాక, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు మెడికల్‌ క్యాంపులను నిర్వహించడం మొదలుపెట్టారు. తన వైద్యం తన ఊరుకు ఉపయోగపడటం పట్ల సంజీవరెడ్డి సంతోషానికి మేర లేదు. అనంతయ్యగారిపల్లెలో పిల్లలు తరచూ జాండిస్‌ బారిన పడుతుండటాన్ని ఆయన గమనించారు. తన సొంత ఖర్చులతో పిల్లలందరికీ హెపటైటిస్ బీ మందులను వేయించారు. అలాగే, జిల్లా కేంద్రమైన కడప రిమ్స్‌లో రోగులకు మినరల్‌ వాటర్‌ను అందించడం కోసం ప్రత్యేకంగా వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు.
బడికి వందనం..
పుల్లంపేట ఎస్‌బీవీడీ సభా హైస్కూల్‌లో సంజీవరెడ్డి చదువుకున్నారు. కనీస సౌకర్యాలు లేని రోజుల్లో సాగిన తమ చదువుల తీరుని భావితరాలకు వారసత్వంగా అందించరాదని ఆయన నిర్ణయించుకొన్నారు. తన డబ్బులతో ఈ స్కూలుకు కంప్యూటర్లు అందజేశారు. మంచి సౌకర్యవంతమైన డెస్క్‌లను తరగతి గదుల్లో ఏర్పాటు చేయించారు. అవే వసతులను తన ఊరులోని పాఠశాలకు కూడా కల్పించారు. అంతేకాదు, గ్రామంలో పేదరికం కారణంగా చదువుకు దూరమయిన పిల్లలను గుర్తించి.. వారి విద్యకు అయ్యే ఖర్చును సంజీవరెడ్డే భరిస్తున్నారు. తాను గ్రామానికి వచ్చినప్పుడల్లా..పేద కుటుంబాలకు ఎంతోకొంత సాయం అందిస్తుంటారని గ్రామస్థులు గుర్తు చేసుకొన్నారు.
 
- కడప, ఆంధ్రజ్యోతి