Nri-behind-the-success-of-Mori-village

‘మోరి’ సూత్రధారి సాల్మన్‌!

ఆ ఊరి బిడ్డే ‘గ్రిడ్‌’ను తెచ్చారు.. టీవీ,నెట్‌, ఫోన్‌తో ఫైబర్‌ విప్లవం

ఏపీలో స్మార్ట్‌ విలేజ్‌లకు రూపకర్త.. విదేశాల్లో స్థిరపడ్డా, ఏపీకి సాయం
5జిల్లాలు.. 472గ్రామాల్లో శ్రీకారం
‘మోరి’ గుర్తుందా? ఫైబర్‌ గ్రిడ్‌ను అనుసంధానించిన తొలి గ్రామం ఇది! టీవీ, ఇంటర్నెట్‌, ల్యాండ్‌ ఫోన్‌లను రూ.149లకే అందుకొంటూ..ఐకాన్‌ విలేజ్‌గా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని ఈ గ్రామం వందశాతం నగదురహితం సాధించి.. స్మార్ట్‌ విలేజ్‌గానూ మెరిసింది. మారుమూల గ్రామం ‘మోరి’ని రాష్ట్రపటంలో నిలిపిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదికాగా, దీనివెనుక సూత్రధారి మాత్రం సాల్మన్‌ డార్విన్‌. ఈ గ్రామం నుంచి పదహారేళ్ల ప్రాయంలో విదేశాలకు వెళ్లిన డార్విన్‌.. ‘మోరి’ విజయంలో కీలక భూమిక పోషించడం విశేషం. అయితే, ఒక్క తన ఊరునే కాదు, పల్లెలన్నింటినీ పరుగులెత్తించే ప్రణాళికలతో డార్విన్‌ ముందుకెళుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశంతో ‘స్మార్ట్‌ విలేజ్‌’ ఫార్ములాను ఐదు జిల్లాల్లోని, 472 గ్రామాలకు విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.
 
ప్రతి అడుగులో స్మార్ట్‌..
మోరికి చెందిన నల్లి సాల్మన్‌, జెస్సీ దంపతుల కుమారుడు సాల్మన్‌ డార్విన్‌. తన తల్లిదండ్రులతోపాటు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అక్కడి బర్కిలీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. ఒక వ్యక్తి ఒక సంస్థను స్థాపించి సుదీర్ఘకాలంపాటు రాణించడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేసి ఇవ్వడంలో డార్విన్‌ది అందవేసిన చేయి. ఇప్పటికి 20దేశాలకు పైగా ఆయనను ఆహ్వానించి, వ్యాపార మెళుకువలపై సూచనలు పొందాయి. తాను పనిచేస్తున్న యూనివర్సిటీలో ఒబామా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టుకు డార్విన్‌ నాయకత్వం వహించారు.
 
సరిగ్గా ఇదే సమయంలో, కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పడ్డాయి. వారి నాయకత్వంలో అటు నగరాలు, ఇటు పల్లెల్లో సాంకేతిక చైతన్యం వెల్లివిరియడం మొదలయింది. బెంగళూరులోని ఒక యూనివర్సిటీలో ఒబామా ఫౌండేషన్‌ తరఫున స్మార్ట్‌ సిటీలపై డార్విన్‌ చేసిన ప్రసంగం అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుని ఆలోచింపజేసింది. డార్విన్‌ను వారు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. ఆ భేటీ ఫలితంగా భారత్‌లో స్మార్ట్‌ సిటీల భావన తలెత్తింది. తన జన్మభూమి ఏపీలో స్మార్ట్‌ సిటీల రూపకల్పనపై డార్విన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఐదు పట్టణాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు.
మలుపు తిప్పిన ఆలోచన..
స్మార్ట్‌ సిటీల అభివృద్ధిలో భాగంగా విశాఖ పట్టణాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించే బాధ్యతను డార్విన్‌ స్వీకరించారు. ఆ ప్రాజెక్టును కొనసాగిస్తున్న సమయంలో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ముఖ్యమంత్రిని కలుసుకొని తన ఆలోచనలను ఆయనతో పంచుకొన్నారు. ‘గో.. ఎహెడ్‌’ అంటూ సీఎం అందించిన ఉత్సాహంతో డార్విన్‌ గత అక్టోబరులో పనిపెట్టారు. అందులోభాగంగా రాష్ట్రంలో తొలిసారి ఆయన స్మార్ట్‌ విలేజ్‌లకు శ్రీకారం చుట్టారు. దానికోసం తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మోరి, మోరిపోడు గ్రామాలను ఎంచుకొన్నారు.
 
విశాఖపట్నం కేంద్రంగా ఈ గ్రామాలకు ఫైబర్‌ గ్రిడ్‌ను అనుసంధానంచేశారు. రూ.149కే టీవీ, ఇంటర్నెట్‌ కనెక్షన్‌, ల్యాండ్‌ ఫోన్‌తో గ్రిడ్‌ కనెక్షన్‌ను ఇచ్చారు. నిజానికి, గ్రిడ్‌ అనుసంధానానికి వేలాది కోట్ల రూపాయలు అవసరం. అలాంటిది చాలా తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం అందించేలా ఈ ప్రాజెక్టును డార్విన్‌ ప్రత్యేక శ్రద్ధతో రూపొందించారు. స్థానికంగా ఉన్న సబ్‌స్టేషన్లు, ఇతర సౌకర్యాలను వాడుకొని, ఈ ప్రక్రియను ఆయన పూర్తిచేశారు.
- అమలాపురం