NRI-arrange-free-food-to-students

సొంత ఊరిపై ఎన్నారై మమకారం

ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

విదేశాల్లో ఉంటూ స్వదేశంలో విద్యకు ప్రోత్సాహం

హిందూపురం అర్బన్‌, అనంతపురం, మార్చి 20:‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్న గురజాడ అప్పారావు మాటలను మదిలో పదిలపరుచుకున్నారాయన. తాను ఎక్కడ ఉన్నా తన సొంత ఊరికి ఏదైనా సాయం చేయాలని తలిచాడు. సొంతూరిలో పేద విద్యార్థులకు చేతనైన ప్రోత్సాహాన్ని అందించాలనుకున్నాడు.  అనుకున్నదే తడువుగా హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ముందుకొచ్చాడు.  ఈ నేపథ్యంలో గత ఏడు సంవత్సరాలుగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు దూపురానికి చెందిన ఎన్నారై, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తిరుమలేష్‌. 
 
పట్టణంలో నివాసం ఉంటున్న క్రిష్టప్ప సరస్వతమ్మల కుమారుడు తిరుమలేష్‌.  ప్రస్తుతం యూఎస్‌లోని సిప్కో కంపెనీలో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. తిరుమలేష్‌ చిన్నతనంలో చదువుకునే సమయంలో, ఇంటర్‌ చదువుతున్నపుడు తిండి సరిగా దొరకక ఇబ్బందులు పడ్డారు. తనలాగా ఏ విద్యార్థి చదువుకునే సమయంలో ఇబ్బందులు పడకూడదనుకున్నారు. 10వ తరగతి వరకు హిందూపురం నేతాజీ మున్సిఫల్‌ పాఠశాల, తరువాత ఇంటర్‌వరకు కర్ణాటకలోని గౌరిబిదనూరు నేషనల్‌ కళాశాలలో, బీటెక్‌ బెంగళూరులో చదివారు. తాను పడిన ఇబ్బందులు ఎవరూ పడకూడదన్న ఆలోచనతో ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించుకున్నాడు. కళాశాలకు ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారని, ఉదయాన్నే వారు కళాశాలకు వచ్చే సమయానికి ఇంటిలో అన్నం సిద్దంగా లేకపోవడంతో పస్తులుంటున్నారని తిరుమలే్‌షకు కళాశాల ప్రిన్సిపల్‌ శంకరయ్య తెలియజేశారు. దీంతో ప్రతి రోజు సన్న బియ్యంతో వండిన భోజనాన్ని దాదాపు 300 మంది విద్యార్థులకు అందజేస్తున్నారు.  కాగా నెలకు రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు విద్యార్థుల భోజనం కోసం నిధులు  అందజేస్తున్న తిరుమలేష్‌ నిజంగా సొంతూరి కోసం ఆరాటపడే ‘శ్రీమంతుడి’గా నిలుస్తున్నారు.
 
విద్యాదానం, అన్నదానం రెండూ గొప్పవే
తిరుమలేష్‌, ఎన్నారై
అన్ని దానాల్లోకెళ్ళా విద్యాదానం, అన్నదానం గొప్పవి. విద్యార్థులకు అన్నదానం చేసి వారి ఉన్నతికి దోహదపడటంలో ఎంతో సంతోషం ఉంది. విద్యార్థులు బాగా చదువుకుని వారుకూడా పుట్టిన గడ్డ అభివృద్ధికి సాయపడాలి. స్థోమతలేని వారికి ఏదోఒక సాయం అందిచే స్తాయికి విద్యార్థులు ఎదగాలి. వారు మరొకరికి సాయమందేచాలన్నదే తన లక్ష్యం.