NRI-Acchayyakumar-Rao-special-interview

మరో వెయ్యేళ్ళు కాపాడుకుంటాం

 

రెండు వందల ఏళ్ళ క్రితం మలేసియాలో స్థిరపడ్డ కుటుంబం ఆయనది. అయినా అమ్మ భాషని మరిచిపోలేదు. ‘‘తెలుగువారిగా పుట్టాం. తెలుగువారిగా బతుకుతాం, తెలుగువారిగానే మరణిస్తాం’’ అని ఘంటాపథంగా చెబుతారు మలేసియా తెలుగు ప్రధాన సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ అచ్చయ్యకుమార్‌రావు. భాషకు ఎల్లలు లేవనీ, తెలుగువారం అందరం అన్నదమ్ములమనీ సగర్వంగా ఆయన చాటుతున్నారు. మలేసియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సుమారు వందమంది తెలుగువారు ప్రపంచ తెలుగు మహాసభలకోసం తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతితో అచ్చయ్యకుమార్‌రావు ప్రత్యేకంగా ముచ్చటించారు.
 
1955లోనే మలేషియాలో తెలుగు సంఘం
మలేసియాకు స్వాతంత్య్రం రాకముందు, 1955లోనే అక్కడ తెలుగు ప్రధాన సంఘం ఏర్పడింది. మలేసియా బ్రిటిష్‌ పాలనలో ఉన్నప్పుడే వారు తెలుగు కుటుంబాలు నివసించే ప్రాంతంలో ఒక తెలుగు టీచర్‌ను ఏరాఁటుచేసి తెలుగు నేర్పించేవారు. 1957 వరకు అక్కడ దాదాపు 45 తెలుగు పాఠశాలలు వీధి బడులుగా నడిచేవి.
 
మలేసియాకు స్వాతంత్య్రం వచ్చాక మలయా ప్రధాన భాష అయింది. అప్పటి నుంచి తెలుగు బడులను ఎవరూ పట్టించుకోలేదు. ‘పాఠశాలలను మేము నడపలేం, తరగతుల్లో చదువుకునేందుకు అవకాశం కావాలంటే ఇస్తాం’ అని మలేసియా ప్రభుత్వం చెప్పింది. కానీ అదీ సాధ్యంకాకపోవడంతో తెలుగు బడులు మూతపడ్డాయి.
 
ఇతర భాషల ప్రభావం ఎక్కువైపోయింది
మలేషియాలో చైనీస్‌, మలయ్‌, ఇంగ్లీష్‌ వంటి భాషలతోపాటు భారతదేశానికి చెందిన మళయాళం, పంజాబీ, తమిళం ఇలా చాలా భాషలున్నాయి. వాటి ప్రభావం తెలుగు మీద ఎక్కువగా ఉంది. పిల్లలు తెలుగు మాట్లాడడం తగ్గిపోతోంది. దీన్ని గుర్తించి మలేసియా తెలుగు ప్రధాన సంఘం ఆధ్వర్యంలో మాతృభాష పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. తెలుగుదనాన్ని భావి తరాలకు అందించాలనేది మా సంకల్పం.
 
అందుకే తెలుగు ఎందుకు నేర్చుకోవాలో అవగాహన కల్పిస్తూ, ప్రతి వారం తెలుగు తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఈ తరగతుల్లో 3500 మంది విద్యార్థులకు 45 మంది ఉపాధ్యాయులు తెలుగు నేర్పిస్తున్నారు. 200 సంవత్సరాలుగా మలేషియాలో తెలుగు భాషను కాపాడుతున్నాం.
 
మరో వెయ్యి సంవత్సరాలు కాపాడుకుంటాం. తెలుగు తరగతులను ఉచితంగానే నిర్వహిస్తున్నాం. తరగతుల నిర్వహణ సగం ఖర్చును మలేసియా ప్రభుత్వం భరిస్తోంది. అందుకు అక్కడి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. మేం నిర్వహిస్తున్న తెలుగు తరగతులకు వచ్చే విద్యార్ధుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి ప్రతి సంవత్సరం 20 మంది విద్యార్థులను మలేసియా నుంచి తెలుగు రాష్ర్టాలకు పంపిస్తున్నాం.
 
భాషతోనే సంస్కృతి ముడిపడి ఉంది
తెలుగు భాషతో మన సంస్కృతి ముడిపడి ఉంది. జానపద కళలు, ఉగాది, సంక్రాంతి, శ్రీరామనవమి వంటి పండుగలు మన సంస్కృతిలో ఇమిడి ఉన్నాయి. అందుకే మా సంఘం ఆధ్వర్యంలో ప్రతిపండుగను నిర్వహిస్తాం. ప్రసుత్తం బతుకమ్మ పండుగను కూడా జరుపుతున్నాం. తెలుగు ఫుడ్‌ ఫెస్టివల్స్‌ ద్వారా తెలుగు వంటలను అందిస్తున్నాం. తెలుగు నేర్చుకోవచ్చునని తెలుగు సినిమాలను ప్రోత్సహిస్తున్నాం. మా సంఘానికి ఆర్థిక బలం లేదు కానీ తల్లి భాషను కాపాడుకోవాలనే లక్ష్యం ఉంది. దానితో ముందుకు సాగుతున్నాం.
 
తెలుగు భాష ఖ్యాతిని కేసీఆర్‌ చాటారు
సీఎం కేసీఆర్‌ తెలుగు నాయకుడిగా తెలుగు భాష ఖ్యాతిని చాటారు. ఆయన తన గురువుకు సాష్టాంగ నమస్కారం చేయడం అభినందనీయం. కేసీఆర్‌ నిబద్ధతకు జోహార్లు. ఎక్కడ తెలుగు మహాసభలు పెట్టినా వెళతాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఆహ్లాదంగా జరుగుతున్నాయి.
 
సభల్లో తెలుగు వంటలు బాగున్నాయి. వీటిలో మలేసియా తెలుగు విద్యార్థులకు అవకాశం కల్పించినందుకు సంతోషం. మహాసభల్లో తెలుగువారంతా- చివరికి మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ సైతం తెలుగులోనే మాట్లాడడం, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన ప్రసంగం మమ్మల్ని ఆకట్టుకున్నాయి.
 
పొట్టిశ్రీరాములు యూనివర్శిటీతో ఒప్పందం
మేం మలేసియాలో నిర్వహిస్తున్న తెలుగు తరగతుల కోసం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీతో ఒప్పదం కుదుర్చుకున్నాం. యూనివర్శిటీ మా సిలబస్‌కు మెరుగులు దిద్ది సలహాలు, సూచనలు ఇస్తుంది. 2015లో మొదటి స్నాతకోత్సవం జరిగింది. పరీక్షలను యూనివర్శిటీ వారే నిర్వహాస్తారు. ప్రవేశిక, మాధ్యమిక, ప్రవీణ, విశారద అని నాలుగు అంచెల్లో తెలుగు భాషను నేర్పిస్తున్నాం. విశారద సర్టిఫికెట్‌ పొందిన విద్యార్థిభారతదేశంలో ఎక్కడైనా తెలుగు డిప్లమా పరీక్ష రాయవచ్చు. విశారద తెలుగు రాష్ర్టాల్లోని 12వ తరగతితో సమానం. ప్రస్తుతం విశారదలో 52 మంది విద్యార్థులు ఉన్నారు.
 
దేవాలయంలో కార్యక్రమాలన్నీ తెలుగులోనే
తెలుగు వారి కోసం మలేసియాలో వెంకటేశ్వరస్వామి గుడిని కట్టించాం. అక్కడ కార్యక్రమాలన్నీ తెలుగులోనే నిర్వహిస్తాం. రామభజనలు చేస్తాం, కీర్తనలు ఆలాపిస్తాం. అక్కడ తెలుగు కుటుంబాల్లో మమ్మీ, డాడీ అనే సంప్రదాయం లేదు. అమ్మ, నాన్నల పిలుపుకే విలువనిస్తాం.
 
తెలుగు అకాడమీ, తెలుగు తల్లి దేవాలయం
తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం ‘తెలుగు అకాడమీ ఆఫ్‌ మలేసియా’ అనే పేరిట మూడు బ్లాకులతో ఒక భవనాన్ని నిర్మించాం. మూడు బ్లాకులకు ‘తెలంగాణ’, ‘ఆంధ్రా’, ‘రాయలసీమ’ అనే పేర్లు పెట్టాం. తెలుగు తల్లికి దేవాలయం కూడా నిర్మించాం. రెండు, మూడు నెలల్లో మలేసియా ప్రధానమంత్రి చేతుల మీదుగా అకాడమీ భవనాన్ని ప్రారంభించనున్నాం. ప్రారంభోత్స వానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానిస్తాం.
 
ప్రత్యేక సమూహంగా గుర్తింపు సాధించాం
మలేసియాలో సుమారు 4 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. అక్కడ 30 తెలుగు శాఖలు ఉన్నాయి. సుమారు థివీవేలమంది తెలుగు ప్రధాన సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఇటీవల మలేసియా ప్రభుత్వం తెలుగువారిని ప్రత్యేక సమూహంగా గుర్తిచింది. ఇది తెలుగు వారి విజయంగా భావిస్తున్నాం.
 
 
తెలుగు ఉపాధ్యాయినినవుతా!
నేను ఐదు సంవత్సరాల నుంచి తెలుగు నేర్చుకుంటున్నా. ప్రస్తుతం మలేసియాలో నిర్వహిస్తున్న తెలుగు తరగతుల్లో ప్రవీణ పూర్తిచేశాను. విశారద పూర్తి చేసిన తరువాత మలేసియా తెలుగు అకాడమీలో ఉపాధ్యాయురాలిగా చేరుతాను. తెలుగు వారికి తెలుగు నేర్పిస్తాను. నాకు వేమన, సుమతీ శతకాలు వచ్చు. ఇంట్లో అందరం తెలుగులోనే మాట్లాడతాం.
- దయా శ్రీలేఖ, మలేసియా తెలుగు విద్యార్థిని
 
 
-బాగం నవీన్‌కుమార్‌