Man-from-Aallagadda-in-Australia

ఆళ్లగడ్డ శిల్పం..ఆసిస్‌లో మోగింది

కర్నూలు:ఆళ్లగడ్డ.. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు పురిటి గడ్డ. నెత్తురు తడిసిన ఆ రాళ్లలో పుట్టిందొక శిల్పపుష్పం. మూడుతరాల పునాదుల మీద.. వికసించిందా కళా సౌందర్యం. కళకు సరిహద్దులు లేవు. అందుకే, ఆళ్లగడ్డ కళ ఆస్ట్రేలియాలో శిల్పమై ఆశ్చర్యపరిసింది. మన తెలుగుశిల్పి రూపొందించిన ఆ శిల్పం.. ప్రపంచవ్యాప్తంగా 78 మంది కళాకారులను అధిగమించి.. 32 లక్షల రూపాయలు గెల్చుకుంది. ఆ యువ శిల్పి, సీమ కుర్రాడు హర్షవర్ధ్దన్‌. అతని ఆలోచన నుంచి ఊపిరి పోసుకున్న ఆ అపురూప శిల్పకళాఖండం ‘కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌’. 

‘శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు..’ మన భారతదేశ శిల్పకళా ఔన్నత్యాన్ని చాటడానికి ఇదొక్క పాట చాలు. గుళ్లు, గోపురాలు, ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, కోటగోడలు.. ఎక్కడ చూసినా అపురూప శిల్ప కళ అబ్బురపరుస్తుంది. ముందు నుంచి శిల్పకళ అంటే మహాప్రీతి. బహుశా అది కుటుంబం నుంచి అలవడిందేమో! మా తాత ముత్తాతల కాలం నుంచి మాది శిల్పకారుల కుటుంబం. నాది నాలుగోతరం. ప్రాచీన సంప్రదాయ శిల్పకళకు ఆధునికతను జోడించింది మా తరం. కేవలం పుట్టిన ప్రాంతానికే పరిమితం కాకుండా.. దశదిశలా మా నైపుణ్యాలను చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయాణంలో భాగంగా ఇప్పుడు నాకొక అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. నేను శ్రమించి రూపొందించిన ‘కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌’కు ‘రియో టింటో స్కల్‌ప్చర్‌’ ఆసే్ట్రలియా అవార్డు దక్కింది. ఇన్నేళ్లకు ఫలితం దక్కడం వెనక పెద్ద కథే ఉంది.
 
శిల్పకారుల కుటుంబం.. 
నా సొంతూరు కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ. వంశపారంపర్యంగా వస్తున్న శిల్పకళాకారులం మేము. నాన్న హరిప్రసాద్‌ శిల్పి అయితే అమ్మ పరిమళ నాగేశ్వరి టీచర్‌. నేను బాల్యంలో ఉన్నప్పుడు అమ్మానాన్నలు వైజాగ్‌కు వలస వచ్చారు. ఇంటర్‌ వరకు అక్కడే చదువుకున్నాను. హైదరాబాదులో డిగ్రీ పూర్తి చేశాను. శిల్పకళ నైపుణ్యానికి సరికొత్త సాంకేతికతను రంగరించి అద్భుత కళాఖండాలను రూపొందించాలనే ఆలోచన వచ్చింది నాకు. అమ్మనాన్నలతో అదే విషయాన్ని చెప్పాను. ‘‘సంప్రదాయ కళాకారులుగానే మిగిలిపోకూడదు. ఆధునిక సాంకేతికతను తెలుసుకుంటే.. ఈ రంగంలో ఇంకా ఎదగొచ్చు’’ అని సలహా ఇచ్చారు వాళ్లు. దాంతో ఢిల్లీలో ‘విజువల్‌ ఆర్ట్స్‌ కమ్యూనికేషన్‌’ కోర్సులో చేరాను. పీజీ డిప్లమో పూర్తయ్యే సరికి.. అధునాతన మెలకువలు తెలిశాయి. అప్పటి నుంచి దక్షిణ ఢిల్లీలోనే స్థిరపడ్డాను. అక్కడ ఒక స్టూడియో నెలకొల్పి.. కళారంగంలో కొత్త ప్రయోగాలు మొదలుపెట్టా.
 
అమ్మానాన్నల ప్రోత్సాహం 
పాతకాలం శిల్ప కళ ఖరీదైనదే! కానీ, అంతకంటే అధిక వ్యయంతో కూడుకున్న ప్రక్రియ ఆధునిక సాంకేతిక శిల్పకళ. ఇక్కడ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ప్రపంచ దేశాలతో పోటీపడితే తప్ప పేరు ప్రఖ్యాతులు రావు. అమ్మానాన్నలు ‘‘ఖర్చులకు వెనకాడవద్దు.. నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చెయ్యి. భారం మేము మోస్తాము’’ అని చెప్పారు. ఈ రోజుల్లో ఏ పేరెంట్స్‌ అయినా తమ పిల్లలు శిల్పకళలో రాణించడానికీ, రూపాయి ఖర్చుపెట్టడానికీ ఎంతో ఆలోచిస్తారు. ఇదొక ఉపాధి రంగం కాదు. సృజనాత్మక రంగం. కానీ, మా తల్లితండ్రులు ఇవేవీ లెక్కపెట్టలేదు. నన్ను భుజంతట్టి ప్రోత్సాహించారంతే! వాళ్ల అండ నాకు కొండంత బలం అయ్యింది.
 
శిల్పకళకు సాంకేతికత 
నేటి పోటీప్రపంచంలో నిలవాలంటే.. కుటుంబం నుంచి అలవడిన శిల్పకళా నైపుణ్యం ఒక్కటే సరిపోదు. అంతర్జాతీయ శిల్పకళలో వస్తున్న కొత్త ప్రయోగాలు, మార్పులు అవగతం కావాలి. అందు కోసం ఎంతో తోడ్పడిన గురువు ప్రొఫెసర్‌ మెక్లా హ్యారిసన్‌. శిల్పకళకు అధునాతన సాంకేతిక నైపుణ్యం ఎలా జోడించాలో నేర్పించారు. ఆ అవగాహనతో కొత్త ఆలోచనలను ఎంచుకుని శిల్పకళాఖండాలను తయారుచేశాను. వాటన్నిటినీ ఆన్‌లైన్‌లో ప్రదర్శనకు ఉంచాను. ప్రపంచదేశాలకు చెందిన శిల్పకారులందరూ ఆన్‌లైన్‌ వేదిక మీద పోటీపడతారు. అలా ఇప్పటి వరకు ‘వాలింగ్‌ మ్యాన్‌’, ‘స్పిన్‌ ఫేస్‌’, ‘టాంప్‌’, ‘బోన్స్‌ ఆఫ్‌ టైమ్స్‌’, ‘నిబిరో’, ‘బ్లోషోమ్స్‌’.. లాంటి పదిహేను శిల్పాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించా. ఈ శిల్పాలన్నిటినీ.. మన దేశంతోపాటు.. ఆసే్ట్రలియా, అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో ప్రదర్శించే అవకాశం వచ్చింది. అంచనాలకు మించి గుర్తింపు, ప్రశంసలు అందుకున్నా. కానీ, నేను ఆశించినట్లు అవార్డులు రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు.
 
ఐడియాలోనే సౌండ్‌ 
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. అది నిజం! ఒక శిల్పాన్ని చూడగలం.. తాకగలం. శబ్దాన్ని వినగలం తప్ప పట్టుకోలేం..! ఒక శిల్పం ద్వారా ఆ శబ్దాన్ని పట్టుకోలేమా..? అన్న ఆలోచన తట్టింది నాకు. ఆ ఐడియాకు ప్రాణం పోస్తే తయారైందే ‘కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌’ శిల్పకళాఖండం. ఒక సౌండ్‌ను రికార్డు చేసి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా శబ్దతరంగాల ప్రవాహానికి అనుగుణంగా.. రాజస్థాన మార్బుల్‌ పలకలను కట్‌ చేసి.. వాటిని రెండు స్టీల్‌ అర్ధచంద్రకారపు బంతుల మధ్య అమర్చాను. శబ్దతరంగ ప్రవాహానికి అనుగుణంగా ఈ శిల్పం రూపొందడం దీని ప్రత్యేకం! ఈ శిల్ప శబ్దాన్ని వినడమే కాదు, పట్టుకోవచ్చు కూడా. అందుకే ఈ శిల్పానికి ‘కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌’ అనే పేరు సార్థ్దకం అయ్యింది. అంతకు ముందు దీనిని సిడ్నీలో జరిగిన ‘యాండ్రో సె్ట్రటపన్‌ స్కల్‌ప్చర్‌ అవార్డు’ ప్రదర్శనకు ఉంచాను. అక్కడ మూడో బహుమతి వచ్చింది. ఆ శిల్పాన్నే మరింత మెరుగ్గా తీర్చిదిద్ది ఇటీవలే అసే్ట్రలియాలో జరిగిన ‘రియో టింటో స్కల్‌ప్చర్‌ అవార్డు-2017’ ప్రదర్శనకు ఆన్‌లైన్‌లో చిత్రాలను పంపించాను. ప్రపంచవ్యాప్తంగా 78 శిల్పకళాఖండాలు వచ్చాయక్కడికి. నేను రూపొందించిన ‘కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌’ శిల్పకళాఖండం నిర్వహకులను ఆకర్షించింది. అవార్డు వరించింది. అందుకుగాను రూ.32 లక్షలు నగదు బహుమతి ప్రకటించారు. మాటల్లో వర్ణించలేని ఆనందం అది. మళ్లీ ఒక్కసారి మా ఊరి జ్ఞాపకాల్లోకి వెళితే.. ‘ఎక్కడ ఆళ్లగడ్డ.. ఎక్కడ ఆసే్ట్రలియా? ఇంతమంది అంతర్జాతీయ శిల్పుల్లో నన్నే ఈ అవార్డు వరించడం ఏమిటి’ ఇలాంటి ఆలోచనలే ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో నేను ఏర్పాటు చేసుకున్న ఆర్ట్స్‌ స్టూడియో అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తాను. 
 
ఈ శిల్పాన్ని ఎలా చేశానంటే.. 
‘‘కాలమ్‌ ఆఫ్‌ సౌండ్‌’ శిల్ప రూపకల్పనకు మూడు మాసాలు పట్టింది. గ్రైండింగ్‌ మిషన్‌, వెల్డింగ్‌ మిషన్‌, హైడ్రాలర్‌ ప్రెస్‌, రోటర్‌ కటింగ్‌, రాజస్థాన్‌ మార్బుల్‌ (పాలరాతి) పలకలు, మైల్డ్‌ స్టీల్‌, అర్ధచంద్రాకారపు బంతులు.. వీటన్నింటి మేళవింపే ఈ శిల్పం. దీనిని తయారు చేయడానికి సుమారు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేశాను.’’ 
-గోరంట్ల కొండప్ప, కర్నూలు