:: Welcome to NRI - Article ::

రైతుల కోసం అమెరికాలో ఉద్యోగాన్ని వదిలేసి..

పట్టుదల, కష్టపడేతత్వం ఉండాలే గానీ ఎలాంటి పనిలోనైనా విజయం సాధించవచ్చు నని నిరూపించాడతడు. తన గ్రామంలో రైతులు పడుతున్న అవస్థలను, వ్యవసాయ పద్ధతులను చూసి వారిని ఆర్థికంగా ప్రగతిబాటలో నడిపించాలని కంకణం కట్టుకున్నాడు. చేస్తున్న సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం వదిలేశాడు. అతడే మధు చందన! 

బెంగుళూరు, మైసూరు హైవే మధ్యలో ఉన్న ఓ మారుమూల గ్రామం మండ్య. ఈ గ్రామానికి చెందిన మధుచందన్ అమెరికాలోని కాలి ఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసేవాడు. అయితే చిన్నతనం నుంచే తన గ్రామంలోని రైతుల బాధలు చూస్తూనే వున్నాడు. మధు ఇటీవల రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయంలో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించాడు. వారికి చేయూతనిచ్చేందుకు ఉద్యోగం వదిలేసి సొంతూరు చేరుకున్నాడు. బాగా ఆలోచించి ఆర్గానిక్‌ వ్యవసాయం వైపు రైతులను నడిపించాలనుకున్నాడు. స్నేహితులతో కలిసి కోటి రూపాయల నిధులు సేకరించాడు. వాటితో మండ్య ఆర్గానిక్‌ ఫార్మర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ అనే సంస్థ స్థాపించాడు. ఆర్గానిక్‌ మండ్య అనే బ్రాండ్‌ను రిజిస్టర్‌ చేసి, గ్రామంలోని రైతులకు ఆర్గానిక్‌ వ్యవసాయంలోని మెళకువలను, సూచనలను అందించాడు. తాము పండించిన పంటను స్వయంగా అమ్ముకునేందుకు హైవే పక్కన ఆర్గానిక్‌ మండ్య అనే దుకాణం ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగలేదు ఆర్గానిక్‌ రెస్టారెంట్‌ కూడా ఏర్పాటు చేశాడు. అంతేకాదు నగర వాసులకు, రైతులకు మధ్య అనుసంధానం పెంచడానికి ఆర్గానిక్‌ టూరిజం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇలా ఎన్నో రకాల కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నాడు మధు. 
 
             ఈ సొసైటీలో ఇప్పటికే 500మంది రైతులు సభ్యులుగా ఉండి లబ్ధి పొందుతున్నారు. వీరంతా దాదాపు 200 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. ఈ రకంగా దాదాపు పదివేల కుటుంబాలకు ఆర్ధిక స్వావలంబన కల్పించాడు మధు. కష్టించే తత్వం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం, వ్యాపార దక్షత ఉంటే మండ్యలాంటి గ్రామాలను ఎన్నింటినో తీర్చిదిద్దవచ్చని నిరూపించాడు మధుచందన. నలుగురికీ మార్గదర్శిగా నిలిచాడు.

 

Loading...