:: Welcome to NRI - Article ::

ఆ తండ్రి నమ్మకం గెలిచింది

ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజల్లో పలుకుబడి ఉండాలి. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండాలి. ప్రచారంలో వాగ్దాటి.. ఓటర్లను తనవైపు తిప్పుకునే నేర్పు ఉండాలి. అవే ఎన్నికలు దేశం కాని దేశంలో జరిగితే.. అక్కడ భారత సంతతికి చెందిన వ్యక్తి బరిలో దిగితే.. ఇంతకు మించిన ఆత్మవిశ్వాసం ఉండాలి. అదే విశ్వాసంతో బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసింది భారత సంతతికి చెందిన ప్రీత్ కౌర్‌ గిల్‌. ఎన్నికల్లో గెలిచి.. బ్రిటన్‌ పార్లమెంట్‌లో అడుగుపెట్టిన తొలి సిక్కు మహిళగా రికార్డు సృష్టించింది.

 
‘బేటీ! నువ్వు ఎదో ఒక రోజు చాలా గొప్పదానివి అవుతావు. ఈ ప్రజల కష్టాలను తీరుస్తావు..!’ ఈ మాట అన్న ప్రతిసారీ ఆ అమ్మాయిలో ఒకింత సంతోషం.. ఒకింత ఆందోళనలు కలిగేవి. నాన్నకు తనపై ఉన్న నమ్మకానికి ఆ సంతోషం. నాన్న కల నెరవేర్చగలనో.. లేదో అన్న చిన్న అనుమానం ఆమె ఆందోళనకు కారణం.
ఆ తండ్రి కల నెరవేరింది. ఆ అమ్మాయి ప్రజల కష్టాలను తీర్చే స్థాయికి చేరుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యురాలైంది. తనను పార్లమెంట్‌కు పంపిన బర్మింగ్‌హమ్‌ నగర పరిధిలోని ‘ఎడ్‌ బాస్టన్‌’ నియోజకవర్గ వాసుల సమస్యలను వింటోంది. వాటికి పరిష్కారాలు చూపిస్తోంది. ప్రజావాణిని తన గళంతో వినిపిస్తోంది.
అంచెలంచెలుగా...
కూతురిపై అపారమైన నమ్మకం పెంచుకున్న ఆ తండ్రి రాజనీతీజ్ఞుడు కాదు. రాజకీయ కుటుంబ వారసుడు అంతకన్నా కాదు. బ్రిటన్‌లో బస్సు నడిపే ఓ సాధారణ డ్రైవర్‌. భారతదేశం నుంచి బ్రిటన్‌ వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడిన వారు ఎందరో. అందులో సిక్కులు ఎక్కువ మందే. అలాంటి డ్రైవరే ఈయన కూడా. ఎందరో ప్రయాణికులను కోరుకున్న గమ్యానికి చేర్చే ఆ డ్రైవర్‌.. తన కూతురు గమ్యం ఏమిటో ముందే ఊహించాడు. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెకు అదే నూరిపోశాడు. తండ్రి గుర్తించిన తనలోని ప్రతిభను ఆమె వెలుగులోకి తీసుకొచ్చింది. అంచెలంచెలుగా ఒక్కో మెట్టూ ఎదుగుతూ.. బ్రిటన్‌ పార్లమెంట్‌ మెట్లు ఎక్కింది. లేబర్‌ పార్టీ తరఫున బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు ఇటీవలే ఎన్నికైంది. తాను పుట్టి, పెరిగిన బర్మింగ్‌హమ్‌లోని ఎడ్‌బాస్టన్‌ ప్రాంతం నుంచే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది.
 
చదువులోనూ సేవే...
ప్రీత కౌర్‌ వయసు ఇప్పుడు 44 ఏళ్లు. ఎడ్‌బాస్టన్‌లోనే ఆమె విద్యాభ్యాసమంతా సాగింది. లార్డ్‌వుడ్‌ గర్ల్స్‌ స్కూల్‌ నుంచి సోషియాలజీలో ఆనర్స్‌లో పట్టా పొందింది. ఈస్ట్‌ లండన్‌ విశ్వవిద్యాలయం నుంచి సోషల్‌ వర్క్‌లో డిగ్రీ తీసుకుంది. చదువుల్లోనే కాదు.. బయట కూడా సోషల్‌ వర్క్‌లో బిజీగా ఉండేది ప్రీత. పలు స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేసింది. వీధి బాలలపై పరిశోధన చేసింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌మిడ్‌ల్యాండ్స్‌లో సోషల్‌ కేర్‌ రంగంలో 20 ఏళ్ల పాటు సేవలు అందించింది. ఇలా రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ప్రజాసేవలో భాగస్వామ్యమైంది ప్రీత. ఇందుకు కారణం ప్రీత తండ్రే. ‘నలుగురిలో నేను విలక్షణంగా కనిపించాలని నాన్న కోరుకున్నారు. ప్రజలకు సేవ చేయాలని అభిలషించారు. ప్రజాసేవపై చిత్తశుద్ధి ఉన్నవారే రాజకీయాల్లోకి రావాలని నాన్న అనేవార’ని చెబుతుంది ప్రీత. తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిందామె.
 
సామాజిక బలం
ప్రీత రాజకీయ ప్రవేశం ఒక్కసారిగా జరగలేదు. అంచెలంచెలుగా ఆమె ప్రజలతో మమేకం అయ్యింది. వెస్ట్‌మిడ్‌ల్యాండ్స్‌ పోలీస్‌, క్రైమ్‌ ప్యానల్‌లో కూడా ఉందామె. ‘చిల్డ్రన్‌ సర్వీసె్‌స’లో పని చేసింది. శాండ్‌వెల్‌ స్థానిక కౌన్సిలర్‌గా కూడా పని చేసింది. బ్రిటన్‌లోని సిక్కు కమ్యూనిటీతో ఎప్పుడూ కనెక్టయి ఉండేది. ‘సిక్కు నెట్‌వర్క్‌’ సభ్యురాలిగా వ్యవహరించింది. బ్రిటన్‌లోని వివిధ నేపథ్యాలకు చెందిన సిక్కు కార్యకర్తలు, ప్రతినిధులతో ఏర్పడిన నెట్‌వర్క్‌ ఇది. ఈ సంస్థ ప్రీతకి రెండేళ్లుగా అండగా నిలిచింది. ప్రీతకు ప్రజల్లో గుర్తింపు రావడానికి ఇది ఎంతగానో దోహదం చేసింది. ప్రీతకి పజల్లో ఉన్న ఆదరణ దృష్ట్యా ఎడ్‌బాస్టన్‌ సిట్టింగ్‌ ఎంపీ ‘గిసలా స్టువర్ట్‌’ని కాదని మరీ ఆమెకా సీటు కేటాయించింది ‘లేబర్‌ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటి’. ఎన్నికల సమయంలో అక్కడి సిక్కులు నిధులు సేకరించి ఆమెకు అందించారు. అంతేకాదు ఆమె తరఫున ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. ఎడ్‌బాస్టన్‌ ప్రజల మనసులు గెలుచుకుని ఎంపీగా గెలిచింది ప్రీత. ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యురాలిగా సేవలందిస్తోంది. పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ప్రొటెక్షన్‌కు కేబినెట్‌ సభ్యురాలిగా కూడా ఉంది.
 
ప్రీత విజయం అపురూపం. బ్రిటన్‌ రాజకీయ చరిత్రలో సిక్కు మహిళ శకం మొదలైంది. అక్కడి పార్లమెంట్‌లో వారి తరఫున ఒక గళం వినిపించనుంది. ప్రీత కౌర్‌ గిల్‌ విజయం ఆరంభం మాత్రమే. మున్ముందు మరెందరో మహిళలు బ్రిటన్‌ క్రియాశీలక రాజకీయాల్లోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించే అవకాశాలున్నాయి. అలా వచ్చేవారికి ఒక దారి చూపిన ప్రీతకు మనమూ హ్యాట్సాఫ్‌ చెప్పేద్దాం.
 
నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజల వెన్నంటి ఉంటాను. వారి అభివృద్ధి కోసం తోడ్పడతాను. స్థానిక ప్రజల సహకారంతో సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తాను. రాజకీయాలపై నాకు ఆసక్తి కలగడానికి నా తండ్రితోపాటు మిత్రుడు లార్డ్‌ కింగ్‌ కూడా కారణం. వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా!